
సీఎం కేసీఆర్ యూపీఏకు దగ్గరవుతున్నారంటూ నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బుధవారం దీనిపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. కేసీఆర్‌తో భేటీకి డీఎంకే చీఫ్ స్టాలిన్ వెనుకడుగు వేయడానికి ఇదే కారణమంటూ తమిళ మీడియా సైతం పేర్కొంది. కేసీఆర్ కేరళ టూర్ బయల్దేరడానికి ముందే కర్నాటక సీఎం కుమారస్వామితో ఫోన్‌లో మాట్లాడారు. అంతకు రెండ్రోజుల ముందు కూడా కుమారస్వామి కేసీఆర్‌కు ఫోన్ చేశారు. కాంగ్రెస్‌తో దోస్తీకి మధ్యవర్తిత్వం నెరపాలంటూ ఈ సందర్భంగా కుమారస్వామిని కేసీఆర్
కోరారని కర్నాటక సీఎం సన్నిహిత వర్గాలను ప్రస్తావిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అందుకు కుమారస్వామి కూడా ఓకే చెప్పినట్టు తెలిపాయి.
స్టాలిన్ అందుకే దూరం?
సీఎం కేసీఆర్ ఈ నెల 13న చెన్నైలో డీఎంకే చీఫ్ స్టాలిన్‌ను కలవాల్సి ఉంది. సీఎంవో వర్గాలు కూడా అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించాయి. సోమవారం కేరళ రాజధాని తిరువనంతపురం వెళ్లిన కేసీఆర్ ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 11న ఆయన చెన్నైకి చేరుకొని 13న స్టాలిన్‌తో భేటీ కావాల్సి ఉంది. తమిళనాడులో ఉప ఎన్నికలు ఉండటంతో కేసీఆర్‌తో స్టాలిన్ భేటీ కాకపోవచ్చంటూ డీఎంకే వర్గాలు పేర్కొన్నట్టు తమిళ, జాతీయ మీడియాలు కథనాలు ప్రసారం చేశాయి. యూపీఏలో డీఎంకే భాగస్వామిగా ఉంది. తమ ప్రధాని అభ్యర్థి రాహులేనని స్టాలిన్ ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తృతీయ ప్రత్యామ్నాయం ప్రతిపాదనతో వస్తున్న కేసీఆర్‌ను కలవడం స్టాలిన్‌కు ఇష్టం లేదని, ఇందుకే సున్నితంగా తిరస్కరించారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ పర్యటించాలనుకుంటున్న మిగతా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలు ఇప్పటికే ఏదో ఒక జాతీయ పార్టీ వైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనను విరమించుకున్నట్టు జాతీయ మీడియా తన కథనాల్లో విశ్లేషించింది.