తాడ్వాయి, వెలుగు : మేడారం సమ్మక్క, సారలమ్మకు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వరుస సెలవులు రావడం, మహాజాతరకు మరో పది రోజులే ఉండడంతో భక్తుల రాక రోజురోజుకు పెరుగుతోంది. ఇటు ఏపీ, తెలంగాణ, అటు చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవార్లను దర్శించుకొని, ఎత్తు బంగారం, చీర సారెలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో మేడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వన దేవతల దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు చేస్తున్నారు. భక్తుల రాక పెరుగుతుండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, ఆఫీసర్లు అన్ని చర్యలు చేపడుతున్నారు.
