రీట్రైవ్లో రాజీపడే ప్రసక్తే లేదు : కాగజ్ నగర్ ఎఫ్డీవో అప్పయ్య

రీట్రైవ్లో రాజీపడే ప్రసక్తే లేదు : కాగజ్ నగర్ ఎఫ్డీవో అప్పయ్య

కాగజ్ నగర్, వెలుగు: అటవీ భూములను రీ ట్రైవ్ చేసే విషయంలో రాజీ పడొద్దని, భవిష్యత్ తరాలకు మేలు చేసేలా అడవులు రక్షించడమే లక్ష్యంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పనిచేయాలని కాగజ్ నగర్ ఎఫ్​డీవో అప్పయ్య సూచించారు. ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆదివారం ఖర్జెల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పర్యటించి అడవుల సంరక్షణ, రీ ట్రైవ్, నర్సరీ మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బండెపల్లి బీట్ దిందా సమీపంలో చేపట్టిన పోడు భూముల రీట్రైవ్ ను పరిశీలించారు. 

దాదాపు రెండు వేల ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకునే పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవుల ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. అడవులను నరికివేయొద్దని, అటవీ భూమిలో పోడు సాగు చేయొద్దన్నారు. ఈ  సందర్భంగా కేతిని గ్రామంలో యువతకు వాలీబాల్ కిట్ అందజేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుభాష్, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.