- ప్రారంభించిన కలెక్టర్, ఎంపీ
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రాష్ట్రస్థాయి 11వ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ రాజర్షి షా, ఎంపీ గొడం నగేశ్ క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. 33 జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారుల గౌరవ వందనాన్ని అతిథులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటమికి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్రీడాకారుల సౌకర్యార్థం స్టేడియంలో వసతుల లేమిని గుర్తించి, అవసరమైన సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా రాణించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. ఎంపీ మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడతాయన్నారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల్లో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని, ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు వారి నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి గొప్ప వేదికలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతిభ గల విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, వివిధ జిల్లాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, క్రీడా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
