కేసీఆర్ గ్రాఫ్ పడిపోయింది

కేసీఆర్ గ్రాఫ్ పడిపోయింది

బెల్లంపల్లి, వెలుగు: సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అబద్ధపు హామీలు ఇస్తూ, వాళ్లను హింసిస్తూ పరిపాలన సాగిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కేసీఆర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, ఆయనను గద్దె దించేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని చెప్పారు. మంత్రి కేటీఆర్​పై రైతు చెప్పు విసరడంతోనే ప్రజల తిరుగుబాటు మొదలైందన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తాపీ కార్మిక సంఘం భవనంలో బీజేపీ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనికి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్​దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం సమావేశాన్ని ప్రారంభించి వివేక్ మాట్లాడారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి.. ఇలా ఎన్నో హామీలిచ్చిన కేసీఆర్, వాటిలో ఒక్కటన్నా నెరవేర్చలేదని మండిపడ్డారు. సీఎం అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. ‘‘రూ.36 వేల కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీడిజైనింగ్ చేసి రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఇందులో వేల కోట్ల కమీషన్లు దండుకున్నారు. మిగులు బడ్జెట్​తో రాష్ట్రం ఏర్పడితే, ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మార్చారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల కమీషన్ రావు” అని వివేక్ విమర్శించారు. 

బీజేపీలో చేరిన 150 మంది
వివేక్ సమక్షంలో 100  మంది యువకులు, 50 మంది మహిళలు బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి వివేక్ పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశంలో బీజేపీ జిల్లా ఇన్​చార్జి పల్లె గంగారెడ్డి, అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు, ప్రధాన కార్యదర్శి మునిమంద రమేశ్, నియోజకవర్గ ఇన్​చార్జి వెన్నంపల్లి పాపన్న తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నరు... 
ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది పేదలకు ఇండ్లు కట్టించారని వివేక్ చెప్పారు. కేంద్ర పథకాల కింద వస్తున్న నిధులను సీఎం కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ‘‘దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్.. తన మంత్రివర్గంలోని ఇద్దరు దళిత ఉప ముఖ్యమంత్రులను తొలగించారు. కానీ మోడీ ఒక దళితుడిని రాష్ట్రపతిని చేశారు. ఇప్పుడు గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తున్నారు” అని చెప్పారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలని మోడీ ధీమాతో ఉన్నారన్నారు. బీజేపీపై ప్రజల్లో ఎంతో నమ్మకం పెరిగిందని, అందరూ కమలం వైపే చూస్తున్నారని అన్నారు. త్వరలో హైదరాబాద్​లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బెల్లంపల్లి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఆయన హయాంలో భూ కబ్జాలు, దందాలు పెరిగిపోయాయన్నారు. ఆ అక్రమాలను బయట పెడతామన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.