కాళేశ్వరంపై కేసీఆర్ సైలెంట్.. ప్రాజెక్టు ఊసెత్తని సీఎం

కాళేశ్వరంపై కేసీఆర్  సైలెంట్.. ప్రాజెక్టు ఊసెత్తని సీఎం
  •     మందమర్రి, మంథని, పెద్దపల్లి సభల్లో ప్రాజెక్టు ఊసెత్తని సీఎం 
  •     ముంపు బాధితులను ఆదుకుంటామని హామీ కూడా ఇయ్యలే

మంచిర్యాల, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఊసే ఎత్తడంలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ అద్భుతమని, రూ. లక్ష కోట్లతో కట్టిన ఈ ప్రాజెక్టుతో ఏటా 360 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి 36 లక్షల ఎకరాలకు సాగునీరు.. హైదరాబాద్ కు తాగునీరు సైతం ఇస్తున్నామంటూ ఆయన అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు. కానీ గతేడాది కాళేశ్వరం పంప్ హౌస్ మునిగి మోటార్లు కరాబ్ అయ్యాయి. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు బుంగలు ఏర్పడటంతో కేసీఆర్ ఇప్పుడా ప్రాజెక్టు గురించిన ప్రస్తావనే తేవడంలేదు.

చివరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు అటూ ఇటూగా గోదావరి ఒడ్డున ఉన్న మంథని, పెద్దపల్లి, మందమర్రి పట్టణాల్లో జరిగిన బీఆర్ఎస్ సభల్లో కూడా ఈ ప్రాజెక్టు పేరునే ఎత్తలేదు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల తమ నియోజకవర్గాల్లో ఏటా పంటలు మునిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారని మందమర్రి, మంథని సభల్లో ఆ పార్టీ అభ్యర్థులు బాల్క సుమన్, పుట్ట మధు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని, గోదావరికి కరకట్టలు కట్టి ముంపు సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. కానీ కేసీఆర్​తన ప్రసంగంలో ఎక్కడా ఈ ప్రాజెక్టు గురించిగానీ, ముంపు సమస్య గురించి గానీ మాట్లాడకుండా దాటవేశారు.

దీంతో బాల్క సుమన్, పుట్ట మధు ఎన్నికల ప్రచారంలో ముంపు రైతులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటివరకు 200 టీఎంసీలే లిఫ్ట్ చేయగా.. అందులో 100 టీఎంసీల నీళ్లను మళ్లీ గోదావరిలోకే వదిలేశారు. కాళేశ్వరం నీళ్లతో పంటల సాగు 50 వేల ఎకరాలకు కూడా మించలేదని చెప్తున్నారు. మరోవైపు ప్రాజెక్టు నిర్మాణంలోనూ వరుస వైఫల్యాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో వీటన్నింటికీ సమాధానం చెప్పుకోలేకనే ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ మాటే ఎత్తడంలేదన్న చర్చ సాగుతోంది.  

ముంపు సమస్యపై రైతుల మండిపాటు 

మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లాలకు చుక్కనీరు కూడా రాకపోగా, గత నాలుగేండ్లుగా వేలాది ఎకరాల్లో పంటలు మునుగుతున్నాయి. బ్యారేజీల నిర్మాణంలో గోదావరి, ప్రాణహిత నదుల్లో వచ్చే వరదనే ప్రామాణికంగా తీసుకుని భూసేకరణ చేపట్టారు. క్యాచ్​మెంట్ ఏరియా నుంచి వచ్చే వరదను లెక్కించలేదు. అలాగే ఫుల్ రిజర్వాయర్ లెవల్​ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మాగ్జిమమ్ రిజర్వాయర్ లెవల్స్​ను విస్మరించారు. ఫలితంగా నాలుగేండ్లుగా గోదావరి తీర ప్రాంతాల్లో 40 వేల ఎకరాల్లో పంటలు మునుగుతున్నాయి. రైతులు పెట్టుబడులు నష్టపోతున్నారు. ముంపు రైతులను ఆదుకోవాలని పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో పోరాటాలు చేశారు.

కోటపల్లి మండలం అన్నారం నుంచి మంచిర్యాల కలెక్టరేట్ వరకు పాదయాత్ర, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ర్ట గవర్నర్​కు ఫిర్యాదులూ చేశారు. ముంపు రైతులకు ఎకరానికి రూ.30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని, ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించి ముంపు భూములను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ కాళేశ్వరం కట్టకముందు కూడా పంటలు మునిగాయంటూ బాల్క సుమన్, పుట్ట మధు గత నాలుగేండ్లుగా రైతుల డిమాండ్లను కొట్టిపారేశారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో నష్టపరిహారం, కరకట్టలు అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కానీ బ్యాక్ వాటర్ సమస్యపై సీఎం హామీ ఇవ్వకపోవడంతో వీరు రైతులకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు.