బీజేపీని ఈజీగా తీస్కోవద్దు.. పార్టీ నేతలతో కేసీఆర్

బీజేపీని ఈజీగా తీస్కోవద్దు.. పార్టీ నేతలతో కేసీఆర్
  • దుబ్బాకలో బీజేపీ గెలుపును తక్కువగా చూడొద్దు
  • జీహెచ్​ఎంసీలో 100 సీట్లు గెలవాలి
  • వరద సాయానికి మరో రూ. 100 కోట్లు ఇస్తామని వెల్లడి!
  • 9 గంటలపాటు సుదీర్ఘ భేటీ.. నేడు కేబినెట్ మీటింగ్​

హైదరాబాద్, వెలుగు: బీజేపీతో అప్రమత్తంగా ఉండాలని మంత్రులను, టీఆర్​ఎస్​ లీడర్లను సీఎం కేసీఆర్​ అలర్ట్​ చేశారు. ఆ పార్టీ బలం పెంచుకునేందుకు ట్రై చేస్తున్నదని, అలాంటి చాన్స్ ఇవ్వొద్దని సూచించారు. దుబ్బాకలో ఊహించని తీరుగా బీజేపీ గెలిచిందని, రూరల్​ ఏరియాల్లోనూ బలపడుతోందని ఆయన అన్నట్టు తెలిసింది. రూరల్​ ఏరియా అయిన దుబ్బాకలో బీజేపీ గెలువడాన్ని ఆషామాషీగా తీసుకొవద్దని లీడర్లకు కేసీఆర్‌‌ సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో  టీఆర్​ఎస్​ 100 డివిజన్లు గెలుచుకునేలా ముందుకు వెళ్లాలన్నారు. ఇందుకోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకోవాలని  ఆయన  ఆదేశించారు. గురువారం ప్రగతిభవన్ లోని తన ఇంట్లో మంత్రులు, టీఆర్​ఎస్​ జనరల్ సెక్రటరీలతో  కేసీఆర్ ​సమావేశమయ్యారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత మొదలైన సమావేశం దాదాపు 9 గంటల పాటు కొనసాగింది. దుబ్బాకలో ఊహించని తీరుగా బీజేపీ విజయం సాధించిందని భేటీలో కేసీఆర్ అన్నట్టు తెలిసింది. ‘‘దుబ్బాకలో బీజేపీ గెలవడాన్ని అనేక కారణాలు ఉన్నయ్​. భవిష్యత్ లో వాటిని వివరిస్తా. సీఎం సొంత జిల్లాలో పార్టీ ఓడిపోవడం వల్ల పార్టీకి నష్టం అనే ప్రచారాన్ని నమ్మొద్దు. పార్టీ కేడర్​లో ఉత్సాహం నింపేలా కార్యక్రమాలు ఉంటయ్​” అని కేసీఆర్​ అన్నట్లు సమాచారం.

బీజేపీ వాళ్ల ముత్తాతలు దిగొచ్చినా గ్రేటర్ మనదే

దుబ్బాకలో విజయం సాధించిన తర్వాత బీజేపీ గ్రేటర్​ హైదరాబాద్​పై ఫోకస్ పెట్టే చాన్స్ ఉందని, అయితే వాళ్ల తాతలు, ముత్తాతలు దిగొచ్చినా ఏం చేయలేరని, గ్రేటర్​ తమదేనని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. జీహెచ్​ఎంసీ ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని, అభ్యర్థుల ఎంపిక త్వరలో కొలిక్కి వస్తుందని వివరించినట్టు సమాచారం.

వరద సాయం కోసం మరో రూ. 100 కోట్లు

హైదరాబాద్ లో వరద బాధితులకు ఆర్థిక సాయం కోసం మరో రూ. 100 కోట్లు ఇస్తామని కేసీఆర్ అన్నట్టు తెలిసింది. సాయం అందలేదని విమర్శలు రాకుండా చూడాలని సూచించినట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి  కోసం ఇప్పటి వరకు రూ. 67 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు వివరించారు.

మీడియాకు లీకులివ్వొద్దు

సమావేశంలోని అంశాలను మీడియాకు ఎట్టి పరిస్థితుల్లో లీక్​ చేయొద్దని పదే పదే మంత్రులు, లీడర్లను కేసీఆర్ హెచ్చిరించినట్టు తెలిసింది. సమావేశంలో చర్చించిన అంశాలు ఏ ఒక్కటి బయటకు వెళ్లినా సీరియస్ పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం.

తొలిసారి సుదీర్ఘ భేటీ

రెండో సారి అధికారంలోకి వచ్చాక రాజకీయ అంశాలపై మంత్రులు, పార్టీ జనరల్ సెక్రటరీలతో కేసీఆర్  ఇంత సుదీర్ఘంగా  మంతనాలు జరపడం ఇదే తొలిసారని టీఆర్​ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. దుబ్బాకలో టీఆర్​ఎస్​కు బీజేపీ షాక్ ఇవ్వడంతో.. ఓటమికి కారణాలపై చర్చించినట్లు తెలిసింది. మంత్రులు, జనరల్ సెక్రటరీలను ప్రగతి భవన్‌‌కు ఆహ్వానించి సీఎం లంచ్ ఇచ్చారు. పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలను వివరించినట్టు సమాచారం. ఇంతకాలం అర్బన్‌‌కే పరమితమైన బీజేపీ.. రూరల్‌‌లో విస్తరించడాన్ని ఈజీగా తీసుకోవద్దని సూచించినట్టు తెలిసింది.

ముందే కలిసిన హరీశ్

ప్రగతిభవన్ కు మంత్రులు రాకముందే మంత్రి హరీశ్ రావు అక్కడికి చేరుకున్నారు.  నేరుగా కేసీఆర్ చాంబర్ లోకి వెళ్లి, సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. దుబ్బాకలో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తానని హరీశ్ ప్రకటించిన తర్వాత కేసీఆర్ తో విడిగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ ఓటమికి గల కారణాలను కేసీఆర్​కు హరీశ్  వివరించినట్టు తెలిసింది. అభ్యర్థి ఎంపిక సరిగా లేదని కేడర్ లో జరుగుతున్న చర్చను కేసీఆర్ దృష్టికి ఆయన తీసుకెళ్లినట్లు టీఆర్​ఎస్​ లీడర్లు అంటున్నారు.  బీజేపీ పుంజుకోవడం వెనుక ఉన్న కారణాలను వివరించినట్టు చెప్తున్నారు.

గ్రేటర్​పై ఒవైసీతో చర్చ

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి కేసీఆర్ ఫోన్ చేసి, ప్రగతి భవన్ కు పిలిపించుకున్నారు. గ్రేటర్ ఎన్నికలను వెంటనే నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఆయనతో సీఎం చర్చించినట్టు తెలిసింది. గ్రేటర్ లో బీజేపీ దూకుడును ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.