అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం

అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం

దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగం వెలకట్టలేనిదని సీఎం కేసీఆర్ అన్నారు. గల్వాన్ లోయలో అమరుల త్యాగం మరువలేనిదని చెప్పారు. ప్రతి ఒక్క భారతీయుడు సైనికులకు అండగా ఉంటారని కేసీఆర్ భరోసా ఇచ్చారు. అమరుల కుటుంబాలకు మేమున్నామన్న భరోసా ఇచ్చారు. కొత్త రాష్ట్రం తెలంగాణ అభివృద్ధిలో బీహారీల పాత్ర ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వలస కార్మికుల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కరోనా సమయంలో వలస కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. అప్పట్లో వారిని స్వస్థలాలకు పంపేందుకు అనేక రైళ్లు నడిపిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.

అంతకు ముందు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో కలిసి గాల్వాన్ అమరవీరుల కుటుంబాలతో పాటు సికింద్రాబాద్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ చెక్కులు అందజేశారు. గల్వాన్ ఘర్షణల్లో వీర మరణం పొందిన సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయ కిషోర్ ల కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని సీఎం కేసీఆర్ చెక్కుల రూపంలో అందజేశారు. వారితో పాటు సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో మరణించిన సికిందర్ రామ్, దినేశ్ కుమార్, బిట్టూ కుమార్, దీపక్ రామ్, సత్యేంద్ర కుమార్, ఘటీ లాల్ రామ్, రాజేష్ కుమార్, అంకజ్ కుమార్ రామ్, ప్రేమ్ కుమార్, సింధు మహల్దార్, దామోదర్ మహల్దార్, రాజేష్ కుమార్ ల కుటుంబాలకురూ.5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు.