ప్రస్తుతానికి ఏ ఫ్రంట్ లేదు..ఉంటే చెప్తామన్న కేసీఆర్

ప్రస్తుతానికి ఏ ఫ్రంట్ లేదు..ఉంటే చెప్తామన్న కేసీఆర్

రాంచీ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చించారు. హేమంత్ సోరెన్ నివాసానికి సీఎం సతీమణి శోభ కూడా వెళ్లారు. భేటీ అనంతరం గల్వాన్ లోయలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేశారు. గతేడాది శత్రువులతో పోరాడుతూ అసువులుబాసిన కుందన్ కుమార్ తో పాటు గణేశ్ హన్సదా కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రితో సమావేశానికి ముందు సీఎం కేసీఆర్ రాంచీలోని ఉన్న గిరిజన ఉద్యమకారుడు బిర్సా ముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. 

నేను చాలా తెలివైనవాణ్ణి నా నుంచి మీరు ఏమీ రాబట్టలేరు -కేసీఆర్

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  దేశ రాజ‌కీయాల్లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌తో పాటు భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌పై చ‌ర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇప్పుడు దేశానికి కొత్త దిశానిర్దేశం కావాలన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశం సరిగ్గా అభివృద్ధి జరగలేదన్నారు. దేశాన్ని బాగు చేసేందుకు ఏం చేయాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయని..త్వరలో అందరం కలుస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఏ ఫ్రంట్ లేదని..ఉంటే చెప్తామన్నారు.భవిష్యత్తులో ఏమవుతుందో త్వరలో తెలుస్తుందన్నారు. తాను చాలా తెలివైనవాణ్ణి తన నుంచి మీరు ఏమీ రాబట్టలేరన్నారు కేసీఆర్.