ప్రకాశ్ రాజ్‌కు సీఎం కేసీఆర్ ఆఫర్‌‌

ప్రకాశ్ రాజ్‌కు సీఎం కేసీఆర్ ఆఫర్‌‌

బీజేపీకి వ్యతిరేకంగా రీజినల్​ పార్టీలను ఏకం చేసే బాధ్యత
కేసీఆర్‌‌ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లోనూ కీలక పాత్ర!

హైదరాబాద్‌‌, వెలుగు: సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్​గా ఉన్న  ప్రకాశ్‌‌రాజ్‌‌కు టీఆర్​ఎస్​ చీఫ్​, సీఎం కేసీఆర్ బంపర్‌‌ ఆఫర్​ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. టీఆర్‌‌ఎస్​ తరఫున ప్రకాశ్ రాజ్‌‌ను రాజ్యసభకు నామినేట్​ చేసే ఆలోచనలు ఉన్నట్టు పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. ఇటీవలే రాజ్యసభ సభ్యుడు బండి ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో ఆ సీటు ఖాళీ అయింది. జూన్‌‌లో టీఆర్ఎస్‌‌ రాజ్యసభ సభ్యులు కెప్టెన్​ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్​ పదవీ కాలం ముగియనుంది. ఈ మూడు ఖాళీలకు ఒకేసారి నోటిఫికేషన్​ వెలువడే అవకాశాలున్నాయి. ఈ ఖాళీల్లో  ఒక సీటును ప్రకాశ్ రాజ్‌‌కు కేటాయించి, టీఆర్ఎస్​ తరఫున ఢిల్లీ రాజకీయాల్లో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం నడుస్తున్నది. అదే ఆలోచనతో ప్రకాశ్‌‌రాజ్‌‌ను కేసీఆర్ ఎంకరేజ్​ చేస్తున్నట్లు పార్టీ లీడర్లు చెప్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే బాధ్యతలు కూడా ప్రకాశ్​రాజ్​కు అప్పగించనున్నారని అంటున్నారు.  సీఎం కేసీఆర్‌‌ మహారాష్ట్ర టూర్‌‌లో ప్రకాశ్‌‌ రాజ్ సడన్​ఎంట్రీ ఇవ్వడంతో పార్టీలో ఆయన రోల్​పై టీఆర్ఎస్‌‌లో ఊహాగానాలు జోరందుకున్నాయి. 

కేసీఆర్​కు అభిమానిగా ఉంటూ..!
 జాతీయ రాజకీయాలపై ఫోకస్​ పెట్టిన కేసీఆర్​ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల లీడర్లతో భేటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారిని.. తన అభిమానులు టీమ్​లో ఉండేలా  కేసీఆర్ ఎంకరేజ్​ చేస్తున్నారు.  ఇందులో భాగంగానే కర్నాటకకు చెందిన ప్రకాశ్‌‌రాజ్​ను టీమ్​లోకి తీసుకోనున్నారనే చర్చ మొదలైంది. ఫెడరల్​ ఫ్రంట్‌‌ ఏర్పాటుకు కేసీఆర్​ తొలిదఫా ప్రయత్నాలు చేసినప్పుడు  మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీకి ప్రకాశ్‌‌​రాజ్  కీలక మధ్యవర్తిత్వం నడిపినట్లు తెలిసింది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ సినీ ఇండస్ట్రీలకు సుపరిచితుడైన ప్రకాశ్‌‌రాజ్ రాజకీయంగా కేసీఆర్​ అభిమాని. గత ఎన్నికల్లోనూ ఆయన కేసీఆర్‌‌కు మద్దతుగా నిలబడ్డారు. 2024 లోక్‌‌సభ ఎన్నికల నాటికి బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కేసీఆర్‌‌ ఉన్నారు. 2018లో అసెంబ్లీని రద్దు చేయడానికి ముందు కూడా ఫెడరల్‌‌ ఫ్రంట్‌‌ ఏర్పాటుకు ప్రయత్నించారు. 2019 లోక్‌‌సభ ఎన్నికలప్పుడు బెంగాల్‌‌ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌‌ పట్నాయక్‌‌, మాజీ ప్రధాని దేవెగౌడ, సమాజ్‌‌వాదీ పార్టీ చీఫ్‌‌ అఖిలేశ్‌‌ యాదవ్‌‌, డీఎంకే చీఫ్‌‌ స్టాలిన్‌‌తో కేసీఆర్‌‌ భేటీ అయ్యారు. అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌‌తోనూ సంప్రదింపులు జరిపారు. లోక్​సభ  ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఫెడరల్‌‌ ఫ్రంట్‌‌ ఏర్పాటు ప్రయత్నాలు ఫలించలేదు. కర్నాటకకు చెందిన ప్రకాశ్‌‌రాజ్‌‌ విలక్షణ నటుడిగా తెలంగాణ ప్రజలకు సుపరిచితుడు. ఆయన మొదటి నుంచి కేసీఆర్‌‌తో మంచి సంబంధాలు మెయింటెయిన్‌‌ చేస్తున్నారు. దీంతో ఆయనకు ఉన్న క్రేజ్‌‌ను రాజకీయంగా ఉపయోగించుకోవాలనే యోచనలో కేసీఆర్‌‌ ఉన్నట్టు తెలుస్తున్నది. 

లోక్​సభ, ‘మా’ ఎన్నికల్లో ఓటమి తర్వాత..!
బీజేపీ విధానాలపై ప్రకాశ్‌‌రాజ్‌‌ బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. 2017లో జర్నలిస్టు గౌరీలంకేశ్‌‌ హత్య తర్వాత తన స్వరం పెంచారు. ‘జస్ట్‌‌ ఆస్కింగ్‌‌’ అనే హ్యాష్‌‌ట్యాగ్‌‌తో కేంద్రానికి వ్యతిరేకంగా పొలిటికల్‌‌ మూవ్‌‌మెంట్‌‌ నడిపించారు. కేసీఆర్‌‌ మద్దతుతో 2019 లోక్​సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్‌‌ లోక్‌‌సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌‌గా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ప్రకాశ్​రాజ్​ ఓడిపోయారు. ఆయనకు 28,906  ఓట్లు (2.41 శాతం) వచ్చాయి. మూవీ ఆర్టిస్ట్స్‌‌ అసోసియేషన్​ (మా) ఎన్నికల్లోనూ టీఆర్‌‌ఎస్‌‌ మద్దతుతోనే ప్రకాశ్​రాజ్​ పోటీకి దిగారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయనపై పోటీ చేసిన మంచు మనోజ్‌‌కు కొందరు ప్రభుత్వ పెద్దలు ఫోన్‌‌ చేసి తప్పుకోవాలని సూచించినట్టుగా ప్రచారం జరిగింది. ‘మా’ ఎన్నికల్లో స్థానికత అంశం తెరపైకి రావడంతో ప్రకాశ్​రాజ్​ ఓడిపోయారు. అప్పటి నుంచి  ఆయన ఎక్కడా కనిపించలేదు. ఉన్నట్టుండి సీఎం కేసీఆర్​ ముంబై పర్యటనలో ప్రత్యక్షమయ్యారు. కేసీఆరే స్వయంగా ఆయనకు ఫోన్‌‌ చేసి రమ్మని చెప్పినట్టుగా టీఆర్‌‌ఎస్‌‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయనను రాజ్యసభకు పంపితే పార్లమెంట్‌‌లో బీజేపీ విధానాలను ఎండగట్టడంతో పాటు బీజేపీ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటులోనూ టీఆర్‌‌ఎస్‌‌కు అండగా నిలుస్తారనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈక్రమంలోనే ప్రకాశ్​రాజ్​ను పెద్దల సభకు పంపాలని కేసీఆర్‌‌ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. త్వరలో కేసీఆర్‌‌ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లోనూ ప్రకాశ్‌‌రాజ్‌‌ క్రియాశీలంగా వ్యవహరిస్తారని తెలుస్తున్నది.