
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ఏడు వేల కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని సీఎస్ శాంతి కుమారి, సివిల్ సప్లయ్స్ కమిషనర్ అనిల్ కుమార్ కు సీఎం ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. కొనుగోళ్ల కోసం తక్షణ చర్యల్లో భాగంగా సోమవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత ఏర్పాట్లు, కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారిని ఆయన ఆదేశించారు. గతంలో నిర్వహించిన విధంగానే ఏడువేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను అన్నింటినీ ప్రారంభించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఈ నేపథ్యంలో కొనుగోళ్ల సమయంలో తీసుకోవాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. యాసంగిలో పండిన వడ్లను రైతులు దళారులకు విక్రయించి మోసపోకుండా మద్దతు ధరతో గ్రేడ్ వన్‌కు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 ధరకు కొనుగోళ్లు చేపట్టనున్నారు.
నిరుడి నూక శాతం ఇంకా తేల్చలే
నిరుడు యాసంగిలో బాయిల్డ్ రైస్ వివాదం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనబోమని, వరి వేస్తే ఉరే అని ప్రచారం చేసింది. కేంద్రం రారైస్ మాత్రమే తీసుకుంటామని కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో చివరకు రాష్ట్ర ప్రభుత్వం నూక శాతం భరిస్తామని, రైతులను ఒప్పించి వడ్లు కొనుగోళ్లు చేసింది. నిరుడు యాసంగిలో 50.39 లక్షల టన్నుల ధాన్యం సేకరించారు.
సివిల్ సప్లయ్స్ ద్వారా 2021–22 యాసంగిలో సేకరించిన వడ్లను మిల్లింగ్ చేసి 34.07 లక్షల టన్నులను సీఎంఆర్‌గా ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు 72.81 శాతం అంటే 24.80 లక్షల టన్నుల బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసింది. ఇంకా 9.26 లక్షల టన్నుల బియ్యంను ఎఫ్‌సీఐకి సరఫరా చేయాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ నూక నష్టశాతాన్ని తేల్చలేదు. దీంతో మిల్లర్లు నష్టాన్ని లెక్కగట్టి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కోరుతున్నారు. నిరుడు యాసంగి వడ్లు మిల్లింగ్ నష్టాన్నే తేల్చని సర్కారు.. ఈసారి నూకనష్టంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ నేపథ్యంలో యాసంగి ధాన్యం సేకరణపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది తేలాల్సి ఉంది.