ఇందిరమ్మ రాజ్యం బాగుంటే టీడీపీ పుట్టేదా? : కేసీఆర్

ఇందిరమ్మ రాజ్యం బాగుంటే టీడీపీ పుట్టేదా? : కేసీఆర్

కరీంనగర్/జనగామ: ఇందిరమ్మ రాజ్యం బాగుంటే.. ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్​జిల్లా మానుకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్, జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ గొప్పలు చెప్తుంది. ఆమె పాలనే బాగుంటే ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఎందుకు పెట్టినట్టు. ఆయన వచ్చాకే పేదోడికి కడుపు నిండా అన్నం దొరికింది. ఎన్టీఆర్ తెచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం గొప్ప పథకం. ఎమర్జెన్సీ పేరిట జైళ్లో వేసుడు, ప్రభుత్వాలను కూలగొట్టుడేనా ఇందిరమ్మ రాజ్యం అంటే ? పత్తికాయలు పగిలినట్లు రైతుల గుండెలు పగిలిపోయింది కాంగ్రెస్‌ హయాంలోనే. 

ఇందిరమ్మ సక్కదనంగా ఉంటే మనోళ్లంతా ముంబైకి, హైదరాబాద్ ఎందుకు వలస పోయిండ్రు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలంటున్నడు. ధరణి తీసి బంగాళఖాతంలో వేస్తరట. ఏం పెడతార్రా భాయ్ అంటే భూమాత పెడతారట. అది భూమాతనా... భూమేతనా. 34 కాలమ్స్ పెడతం. కౌలుదార్ల కాలమ్ పెడతం అంటున్నరు. అంటే రైతులకు, కౌలుదారులకు జుట్లు ముడేద్దామనా. ధరణి పోతే మళ్లీ దళారుల రాజ్యం వస్తది. ఓట్లు అడిగేందుకు బీజేపీ నాయకులకు సిగ్గుండాలే. పార్టీల చరిత్ర ఏంటో ప్రజలు తెలుసుకోవాలి’ కోరారు.

ఆటోల ఫిట్​నెస్ చార్జీలు రద్దు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఆటో డ్రైవర్లకు​గుడ్​న్యూస్​చెప్పారు. మరోసారి అధికారంలోకి రాగానే ప్యాసింజర్ ఆటోల ఫిట్ నెస్ చార్జీ రూ. 700, పర్మిట్ రూ. 500 మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇకపై ఆటో కార్మికులకు ఆ బాధ ఉండదన్నారు. తాను కరీంనగర్ వచ్చిన ప్రతిసారీ ఒక కొత్త స్కీమ్ ప్రకటిస్తానని తెలిపారు. ఇక మళ్లీ అధికారం చేపడితే రూ.5వేల పింఛన్ ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.