ఏడాది లోపే పాలమూరు పూర్తి చేస్తాం: కేసీఆర్

ఏడాది లోపే పాలమూరు పూర్తి చేస్తాం: కేసీఆర్
  •  కరెంట్​ బిల్లులు15 వేల కోట్లయినా కడ్తం
  •  రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేస్తం: కేసీఆర్​
  •  దుర్మార్గులు, దరిద్రులు, సన్నాసులు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నరు
  •  ప్రతిపక్షాలకు నీళ్లు, భౌగోళిక పరిస్థితులపై పరిజ్ఞానం లేదు
  •  రైతులకు మరో ఏడెనిమిదేండ్లు ఉచిత కరెంటు ఇవ్వాల్సిందే
  •  త్వరలోనే గోదావరి – కృష్ణా లింక్‌‌పై ఏపీతో అగ్రిమెంట్‌‌
  •  పాలమూరు ప్రాజెక్టు పనుల పరిశీలనలో సీఎం

హైదరాబాద్‌‌, వెలుగుఏడాదిలోపే పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెకును పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. హైదరాబాద్​లో విలువైన భూములను వేలానికి పెట్టామని, ఆ పైసలు కూడా ఈ ప్రాజెక్టుకే ఉపయోగిస్తామని స్పష్టం చేశారు.  కొందరు దుర్మార్గులు, దరిద్రులు, చవటలు, సన్నాసులు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని, భగవంతుడు వాళ్లకు ఎట్ల జన్మ ఇచ్చాడో అని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్లు, పంపుహౌస్‌ పనులను సీఎం గురువారం పరిశీలించారు. ఉదయం 11 గంటలకు ఆయన మొదట మహబూబ్​నగర్​ జిల్లాలోని కరివెన రిజర్వాయర్​ పనులను పరిశీలించి, ఆ తర్వాత నాగర్​కర్నూల్​ జిల్లాలోని వట్టెం, నార్లాపూర్​లో జరుగుతున్న రిజర్వాయర్ల పనులను పరిశీలించారు. అటు నుంచి హెలిక్యాప్టర్​ ద్వారా ఏరియాల్​ సర్వే చేపట్టారు. ఏదుల రిజర్వాయర్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల అప్పులు తీరిపోయి.. వాళ్ల జేబుల్లో, వాళ్ల బ్యాంక్‌ ఎకౌంట్లలో నగదు నిల్వ ఉండాలనేది తమ పార్టీ సిద్ధాంతమని చెప్పారు. ‘‘కొందరు కరెంటు బిల్లులు ఇంతగానమా అని అడుగుతా ఉన్నరు. ఇంతగానం కాదు ఇంకెంత గానమైనా.. ఐదువేల కోట్లు కాదు 15 వేల కోట్ల రూపాయలైనా సరే ఖర్చు పెట్టి రైతాంగానికి నీళ్లిస్తం. అది మా పంతం. మా పాలసీ. మీకు ఇష్టం లేకపోతే మీ ఖర్మ. మేం చేయగలిగింది ఏమీ లేదు” అని సీఎం అన్నారు. కేసీఆర్​ ప్రసంగం ఆయన మాటల్లోనే..

దరిద్రులు ఈ జిల్లాల ఎట్ల పుట్టిండ్రు

కొందరు అవాకులు చెవాకులు మాట్లాడుతా ఉన్నరు. ఇదే పాలమూరు జిల్లాలో ఉన్నరు ఆ అర్బకులు, ఆ సన్నాసులు. వాళ్లను చూస్తే నవ్వాల్నో ఏడువాల్నో అర్థం కాదు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సి ఉండే అని ఇదే జిల్లాకు చెందిన నాయకులు మాట్లాడుతా ఉన్నరు. వాళ్లు మనుషులా..? ఆ దరిద్రులు ఈ జిల్లాల ఎట్ల పుట్టిండ్రు.. భగవంతుడు వాళ్లకు ఎట్ల జన్మ ఇచ్చిండ్రో నాకు అర్థం కాలే. జూరాలల యూజబుల్‌‌ వాటర్‌‌ ఉండేది ఆరు టీఎంసీలు. అలకేషన్‌‌ ఉంది కానీ అండ్ల వాడుకోగలిగిన నిల్వ ఉండేది 6 టీఎంసీలే. జూరాల దాని పరిధిలోని ఆయకట్టుకు, తాగు నీళ్లకు కావాల్సిన నీళ్లు రూ. 71.1 టీఎంసీలు. ఇన్ని నీళ్లు జూరాల నుంచి వాడితే తప్ప మనం బతుకలేని పరిస్థితి. ఎండకాలం జూరాలల నీళ్లు ఉండవు. రామన్‌‌పాడు ఎండిపోతది. ప్రతి సంవత్సరం కర్నాటకను బతిమాలుకొని ఒక టీఎంసో, అర టీఎంసో తేవడం కళ్లారా చూస్తా ఉన్నరు. ఇంత దుస్థితి జూరాలలో ఉంటే ఈ చవటలు పాలమూరు ఎత్తిపోతలకు జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలంటరు. ఇప్పుడు గోదావరికి శ్రీశైలం అనుసంధానం కాబోతా ఉంది. లింక్‌‌ అయిన తర్వాత నారాయణపేట నియోజకవర్గానికి నీళ్లిచ్చే కాలువ సామర్థ్యాన్ని పెంచి భీమా ద్వారా సంగంబండ రిజర్వాయర్‌‌లో ఏసి దాని ద్వారా జూరాలకు నీళ్లిస్తం. మేం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తే ఎవరూ నమ్మలేదు. దేశమే ఆశ్చర్యపడిపోయి ఇవ్వాల ప్రశంసిస్తా ఉన్నది. మ్యాన్‌‌ మేడ్‌‌ మార్వెల్‌‌ అంటా ఉన్నరు. ఇది జీర్ణం కాని కొందరు సన్నాసులు కాళేశ్వరం నీళ్లు పక్కపొంటి దుంకుతా ఉంటే ప్రాణహితకు పోయి డ్రామాలు చేస్తా ఉన్నరు. కాళేశ్వరం దాదాపు సమాప్తి అయింది. 14 టీఎంసీలతో మిడ్‌‌ మానేరు నిండుతా ఉంది. కంటిన్యూయస్‌‌గా గంగపొంగుతా ఉంది.

చంద్రబాబు సాధించింది గుండుసున్న

శ్రీశైలాన్ని గోదావరి జలాలతో నింపుదామని ఏపీ సీఎం ముందుకు వచ్చారు. ఏపీతో చర్చలు సఫలమైతే చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తయి. నెక్ట్స్‌‌ మీటింగ్‌‌లో చర్చలు కొలిక్కి వస్తయి. సంకుచితంగా, కుత్సితంగా ఎవరైతే ఆలోచిస్తరో వారికి చంద్రబాబులాంటి ఆలోచనలు వస్తయి. ఇదే చంద్రబాబు.. బాబ్లీ మీద గొడవ చేసి సాధించింది ఏంద్రా అంటే గుండుసున్న. పరవాడా ప్రాజెక్టు మీద గొడవ చేసి సాధించిందేందటే  గుండుసున్న. హడావిడి చేయడం.. కోర్టుకు వెళ్లడం.. ఆయన పని.  ఇప్పుడూ అదే పద్ధతిలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబులా అల్పంగా కుత్సితమైన బుద్ధితో ఆలోచించే వారికి ఒకే మాట చెప్తున్నం. గోదావరి–  కృష్ణా లింక్‌‌ చేసే క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య అగ్రిమెంట్లు జరుగుతయి. ఆ తర్వాతే ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్‌‌ అనేది ఫైనల్‌‌గా జరుగుతది. నాక్కూడా ఒక కల ఉంది. అసాధ్యమేమి కాదు. గతంలోనూ ఇదే చెప్పిన. కొంత మంది సన్నాసులు వాళ్లకు తెలివి లేదు. గతంలో మేమేం చేయలే.. ఇప్పుడు మీరేం చేయొద్దు అనే పద్ధతిలో మాట్లాడుతా ఉన్నరు. వాళ్లు ఇదే పాలమూరును ఎండబెట్టిండ్రు.

దుర్మార్గులు కేసులు వేసిండ్రు

పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొంత మంది దుర్మార్గులు.. కొన్ని ప్రగతి నిరోధకశక్తులు కేసులు వేయడం వల్ల కొంత ఆలస్యమైనయి. పాలమూరు ఆన్‌‌గోయింగ్‌‌ ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌‌సాగర్‌‌, జూరాల ద్వారా 11.20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే వెసులుబాటు కలిగింది. వెయ్యి నుంచి 1,500 చెరువులను నింపుకోగలుగుతున్నం. ప్రాజెక్టు కాలువలకు తూములు ఏర్పాటు చేసి చెరువులకు నీళ్లిచ్చేందుకు రూ.4 వేల కోట్లు కేటాయించినం. పాలమూరు చెరువులను కాలువలతో లింక్‌‌ చేస్తం. శ్రీశైలం నుంచి మహబూబ్‌‌నగర్‌‌, నల్లగొండ జిల్లాలో కొంత భాగానికి, నాగార్జునసాగర్‌‌ ద్వారా నల్లగొండ, వికారాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాల్లోని భూములను సస్యశ్యామలం చేస్తం. గత పాలకుల అసమర్థత, తెలివి తక్కువ విధానాలతోనే రాష్ట్రానికి నష్టం జరిగింది.

వచ్చే వానాకాలంలో  ‘పాలమూరు’ నీళ్లు

వచ్చే వానాకాలంలో నీళ్లిచ్చేలా పాలమూరు ప్రాజెక్టు డిజైన్‌‌ చేస్తున్నం. ఫస్ట్‌‌ ఫేజ్‌‌లో కరివెన వరకు నీళ్లు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నం. ఫాలోఅప్‌‌లో ఉద్దండాపూర్‌‌, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌‌, వికారాబాద్‌‌ జిల్లాకు నీళ్లిచ్చే ఆలోచన చేస్తున్నం. 10 వేల కోట్లు అప్పు తెచ్చినం. బడ్జెట్‌‌లో కొంత ఇచ్చినం. నెక్ట్స్‌‌ ఇయర్‌‌ బడ్జెట్‌‌లో కొంత ఇస్తం. రెండేండ్లలో లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించాం. జూరాలకూ పాలమూరు నుంచి నీళ్లిస్తం.. అన్నీ పూర్తయితే ఇక్కడి ప్రతి  సెగ్మెంట్​కు లక్ష ఎకరాలతో పాటు అదనంగా 3, 4 లక్షల ఎకరాలకు నీళ్లిస్తం. మొగులు మొఖం చూడకుండా పంట పండించుకునే పరిస్థితి తెస్తం.

కుర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అన్న మాకు ఆ మంచి గుణం ఉంది

ఉత్తర తెలంగాణ కూడా మొత్తం ఆరిపోయింది. దేశంలోనే ఎక్కడ లేనన్ని పంపుసెట్లు అధికారికంగానే రాష్ట్రంలో 24 లక్షలు ఉన్నయి. ఒక్కో బోరు 700, 800 ఫీట్ల వేస్తే తప్ప నీళ్లు రాని దుస్థితి.  ఒక్కో పంపుసెట్టుకు రూ.25 వేల నుంచి లక్షన్నర దాక అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితికి కాంగ్రెస్​ వాళ్లు, గతంలో పరిపాలించిన వాళ్లే కారణం. పాలమూరు జిల్లా వలసల జిల్లా కారకులైన వీళ్లే ఇయ్యాలా మళ్లా మాట్లాడుతున్నరు. వీళ్ల అవివేకం చాలా ఘోరంగా ఉంటది. వీళ్లకు నీళ్ల పరిణామంపై పరిజ్ఞానం లేదు.. భౌగోళిక పరిజ్ఞానం లేదు. కాంటూర్స్‌‌పై పరిజ్ఞానం లేదు. గాలికి ఇష్టం వచ్చినట్టుగా ఎటుపడితే అటు మాట్లాడుతున్నరు. ఓట్ల కోసమో, తమాషా కోసమో.. చక్కిలిగింతల కోసమో మేము చెప్పలేదు.. మేధావుల దగ్గర, నిపుణుల దగ్గర కూడా తెలుసుకునే మంచి గుణం కూడా మాకు ఉంది.  రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయినారు. వాళ్లు బాగుపడాలంటే ఇంకో ఏడెనిమిది ఏండ్ల పాటు ఉచిత కరెంట్‌‌ ఇయ్యాలె.. ఆరు నూరైనా సప్లయి చేసి తీరుతం. నీటి తీరువా కూడా రద్దు చేసినం. ఫ్రీగా నీళ్లు ఇస్తా ఉన్నం. కరెంటు బిల్లులు ఇంతగానమా అంటా ఉన్నరు. కరెంటు బిల్లులకు..5వేల కోట్లు కాదు.. 15వేల కోట్లు ఖర్చు బెడుతం.

వానాకాలంలో నీళ్లు ఎత్తిపోయాలి

అధికారులకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు: ‘‘వచ్చే వానాకాలంలో శ్రీశైలం బ్యాక్‌‌ వాటర్‌‌ నుంచి నీటిని ఎత్తిపోసి ఆయకట్టుకు నీళ్లివ్వాలి. నార్లాపూర్‌‌ రిజర్వాయర్‌‌, పంపుహౌస్‌‌.. అక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్‌‌కు నీటిని తరలించే సొరంగాలు, ఏదుల నుంచి వట్టెం రిజర్వాయర్‌‌కు నీటిని తీసుకెళ్లే కాలువలు, సొరంగాలు, అక్కడి నుంచి కరివెనకు నీటిని పంపే కాలువలు, టన్నెళ్లు మేనెలాఖరుకు పూర్తి చేయాలి” అని అధికారులను సీఎం కేసీఆర్​ ఆదేశించారు. నీళ్లను ఎత్తిపోసేందుకు అవసరమైన కరెంట్‌‌ సబ్‌‌ స్టేషన్లు రెడీ చెయ్యాలని, కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా కట్టామో.. అంతే వేగంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించాలని, ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ, పునరావాసం లాంటి చిన్నచిన్న పనులను సంబంధిత ఎమ్మెల్యేలు పరిష్కరించాలని సూచించారు. ఏదుల రిజర్వాయర్‌‌ వద్ద మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, సీఎంవో అధికారులు, ఇంజనీర్లు, వర్క్‌‌ ఏజెన్సీలతో ఆయన సమీక్షించారు. పాలమూరు ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి ఇక నుంచి సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్‌‌ పది రోజులకోసారి వస్తారని సీఎం తెలిపారు. మహబూబ్‌‌నగర్‌‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులతో మరోసారి సమీక్షించి సాగునీటి పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటామన్నారు. రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, కొత్తగా కెపాసిటీ పెంచాల్సిన కాలువలు ఇతర అంశాలపై వచ్చే రివ్యూలో నివేదించాలన్నారు. ‘‘కాళేశ్వరం పని పట్టినం.. ఇక నుంచి మీ వెంట పడుతం..’’ అని సీఎం అనడంతో రివ్యూలో పాల్గొన్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వారు. ఏదుల రిజర్వాయర్‌‌ నిర్మాణం ఇప్పటికే పూర్తి కావడంతో దానిలో కల్వకుర్తి నీటిని నింపే అవకాశముందో పరిశీలించాలన్నారు. కల్వకుర్తి పెండింగ్‌‌ పనులపై సీఎం ఆరా తీశారు. కల్వకుర్తి నీటి లిఫ్టింగ్‌‌కు కాళేశ్వరంలో వాడిన బాహుబలి మోటార్లను వినియోగించాలన్నారు. ఆ మోటార్లను విదేశాల నుంచి తెప్పించకుండా బీహెచ్‌‌ఈఎల్‌‌ ద్వారానే కొనుగోలు చేయాలని  సూచించారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి