బీజేపీకి ఓటు వేస్తే.. మోరీలో వేసినట్లే : సీఎం కేసీఆర్

బీజేపీకి ఓటు వేస్తే.. మోరీలో వేసినట్లే : సీఎం కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కు చేరింది. మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉండటంతో.. అన్ని పార్టీలు జోరుగా జనంలో తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. నవంబర్ 24న మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టింది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అభ్యర్థుల వెనక ఉన్న చరిత్ర చూసి ఓటేయాలని.. బీఆర్ఎస్ చేసిన ఉద్యమం చూసి ఓటేయాలని జనానికి పిలుపునిచ్చారు కేసీఆర్. 2004లోనే రాష్ట్రం ఇస్తామని చెప్పి.. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారాయన. 

24 గంటల కరెంట్ కాదు.. మూడు గంటల కరెంట్ అని కాంగ్రెస్ పార్టీ అంటుందని.. దీని వల్ల రైతులు నష్టపోతారంటూ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేశారు కేసీఆర్. కత్తి ఒకరికి ఇచ్చి.. యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా అంటూ ప్రశ్నించారాయన. ధరణి ఉండదని చెబుతున్నారని.. అలా అయితే రైతు భరోసా ఎలా వస్తదంటూ నిలదీశారు కేసీఆర్. సింగరేణిలో సగం వాటాను కేంద్రానికి ఇచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీనే అన్నారాయన. 

బీజేపీకి ఓటు వేస్తే.. మోరీలో వేసినట్లే అని.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదన్నారు. పదేళ్లుగా ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వలేదని.. మెడికల్ కాలేజీ కోసం ఎన్నోసార్లు కొట్లాడినట్లు వివరించారు. బీజేపీకి ఓటు అడిగే హక్కు కూడా లేదన్న కేసీఆర్.. ఆ పార్టీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మంచిర్యాల ప్రజలకు వివరించారు. మంచిర్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని.. అలా చేస్తే గోదావరి నదికి కరకట్ట కడతామని.. చుక్క నీరు కూడా మంచిర్యాలలోకి రాకుండా ముంపును కట్టడి చేస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్.