దళిత బంధు లెక్క అన్ని కులాలకు సాయం చేస్తం

దళిత బంధు లెక్క అన్ని కులాలకు సాయం చేస్తం
  • దళిత బంధు లెక్క అన్ని కులాలకు సాయం చేస్తం: కేసీఆర్
  • అన్నిట్లో దేశం వెనుకబడితే.. మనమే ముందున్నం
  • రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తలెత్తుకొని బతుకుతున్నరు
  • దేశ, విదేశాల్లో మన కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తున్నయ్​
  • ఈసీది చిల్లరమల్లర వ్యవహారం
  • కిరికిరి గాళ్లు, తలకుమాసినోళ్లు అడ్డం పొడువు మాట్లాడితే పట్టించుకోం
  • పార్టీకి విరాళాలు, ఫిక్స్​డ్​ డిపాజిట్లతో రూ. 425 కోట్లు వచ్చినట్లు వెల్లడి

అద్భుతాలను ఆవిష్కరిస్తున్నం..
ఏపీ తలసరి ఆదాయం లక్షా 70 వేలయితే.. తెలంగాణది 2 లక్షల 30 వేలు. ఆంధ్రప్రదేశ్​లో కరెంట్​ లేదు.. తెలంగాణలో 24 గంటల కరెంట్​ ఉంది. ధరణి అద్భుతమైన విప్లవం. ఏ ప్రయాస లేకుండా చాలా అద్భుతమైన పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నయ్. ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకొని ముందుకువెళ్తున్నం.. అద్భుతాలను ఆవిష్కరిస్తున్నం.  రాబోయే ఏడేండ్లలో తెలంగాణ ఖర్చు పెట్టేది రూ. 23 లక్షల కోట్లు. 2028లో రాష్ట్ర  బడ్జెట్ ​రూ. 4 లక్షల 28 వేల కోట్లుగా ఉంటది.. అప్పటికి రాష్ట్ర తలసరి ఆదాయం  7 లక్షల 70 వేలకు చేరుతది.

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ ప్రజలకు అవసరమైన అన్ని పనులను ఏడేండ్లలో పూర్తిచేశామని, అద్భుతాలు చేసి చూపిస్తున్నామని, అన్నిట్లో దేశం వెనుకబడి ఉంటే తెలంగాణ మాత్రం ముందున్నదని సీఎం కేసీఆర్​అన్నారు. ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నామని, ఇక్కడి స్కీంలను దేశమంతా కాపీ కొడుతున్నారని చెప్పారు. ఏ రంగంలోనైతే తెలంగాణ వెనుకబడుతుందని అన్నారో ఆ  రంగాల్లోనూ అద్భుతమైన విజయాలను సాధిస్తూ దేశానికే తలమానికంగా నిలిచేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ‘‘ఏడేండ్లలో తెలంగాణకు అవసరమైన మంచినీళ్లు, సాగునీళ్లు, కరెంట్.. ​ఇట్ల మౌలిక రంగాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చుకున్నం. తెలంగాణ ఆర్థికంగా పటిష్టపడ్డది. దీంతో ఇప్పుడు స్పష్టమైన లక్ష్యంతో, సంపూర్ణ అవగాహనతోటి దళిత బంధు ఉద్యమం చేపట్టినం. నేనేం చెప్పిన్నో అది జరిగింది. రాష్ట్రానికి వచ్చే సంపద వేరే ఎవరికో ఇవ్వరు.. గిరిజన, బీసీ, ఎంబీసీ, రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ వర్గాల్లోని పేదలకు కూడా దళిత బంధు లెక్క సాయం చేస్తం. అన్ని కులాల్లోని వాళ్లకు ఇస్తం” అని ప్రకటించారు. హైదరాబాద్​లోని  హైటెక్స్​లో సోమవారం టీఆర్​ఎస్​ ప్లీనరీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్​ను తొమ్మిదోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిదానికి కిరికిరిగాళ్లు, కిరాయి గాళ్లు అవాకులు చెవాకులు పేలుతున్నారని  ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఎలక్షన్​ కమిషన్​ తన పరిధిని దాటుతోందని ఆయన ఆరోపించారు. 

ఒకటీ రెండు రంగాల్లోనే కాదు.. అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని కేసీఆర్​ చెప్పారు. ‘‘పంజాబ్​ రాష్ట్రాన్ని తలదన్ని 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని తెలంగాణ ఉత్పత్తి చేస్తున్నది. మీరు పండించే పంటలను తీసుకోలేం అని ఎఫ్​సీఐ చెప్పే లెవల్​ దాకా వ్యవసాయ ఉత్పత్తులు సాధిస్తున్నం. ఇది ఏడేండ్ల తెలంగాణ సాధించిన ఘనత. తలసరి విద్యుత్​ వినియోగంలో నంబర్​ వన్​ స్టేట్​గా తెలంగాణ నిలిచింది. ఆదాయంలో కూడా మొదటి ఒకటీ రెండు స్థానాల్లో తెలంగాణ ఉంది. 11.5 శాతం గ్రోత్​తోటి దేశంలోనే టాప్​ స్టేట్​గా ఆర్థికరంగంలో తెలంగాణ పురోగమిస్తున్నది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అద్భుతాలను ఆవిష్కరిస్తున్నయ్​. సాగునీటి రంగంలో తక్కువ టైంలో అద్భుతమైన విప్లవం జరిగింది. భయంకరమైన వలసలకు గురైన పాలమూరు జిల్లాకే ఇప్పుడు పక్క రాష్ట్రాల వాళ్లు వచ్చి పనిచేస్తున్నరు. దీనికి నేను గర్వపడుతున్న. సమైక్య రాష్ట్రంలో దెబ్బతిన్న రంగాల్లోనే ఇప్పుడు దేశానికి తలమాణికంగా  వెలుగొందుతూ.. వేనోళ్ల కొనియాడబడుతూ.. దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు కాపీ కొట్టబడుతున్నయ్. తెలంగాణను ఒక దరికి తెచ్చుకున్న తర్వాత.. దేశాన్ని తట్టిలేపే ఉద్యమం దళిత బంధు చేపట్టినం’’ అని వివరించారు. మొన్నామధ్య తాను ఢిల్లీ వెళ్లినప్పుడు ఇతర రాష్ట్రాల సీఎంలు తనతో మాట్లాడారని, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని వాళ్లు అడిగారని కేసీఆర్​ అన్నారు. 

ఏడేండ్ల కింద అంతా అంధకారమే
ఏడేండ్ల కింద అంతా అంధకారమేనని, తెలంగాణ వచ్చిన తర్వాత ఏడేండ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించామని కేసీఆర్​ చెప్పారు. ‘‘ఏడేండ్ల కింద గతి ఏముండె? అంధకార బంధురమైన తెలంగాణ.. కరెంటు రాదు.. వస్తే ఎప్పటి దాకా ఉంటదో తెల్వదు.. మంచి నీళ్లు లేవు.. ముంబై, దుబాయి బొగ్గు బావి బతుకులు, భయంకరమైన వలసలు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు.. ఆదరణ లేని వృద్ధులు, వికలాంగుల బతుకులు..  కుశించిపోయిన తెలంగాణ. కానీ.. ఇప్పుడు నవనవోన్మేషంగా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరినీ పలుకరించినా.. తలెత్తుకొని బతుకుతున్నా అంటున్నరు” అని పేర్కొన్నారు. ‘‘పండించిన ధాన్యాన్ని పట్టించడానికి రైస్​ మిల్లులు సరిపోవడం లేదు.. పండించి ధాన్యాన్ని మోయడానికి ఇక్కడి హమాలీ  బిడ్డలు సరిపోవడం లేదు. ఎక్కడికి పోయినా.. బీహార్​, ఉత్తరప్రదేశ్​, జార్ఞండ్​ నుంచి హమాలీలు వచ్చి పనిచేస్తున్నరు... వరినాట్లు కూడా బెంగాల్​ నుంచి, ఉత్తరప్రదేశ్​ నుంచి వచ్చి వేస్తున్నరు. ఇంత త్వరితగతిన టీఆర్​ఎస్​ నాయకత్వంలో గొప్ప అభివృద్ధి, గొప్ప ఆవిష్కారం సాధించింది తెలంగాణ. అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, కృష్ణా, గోదావరి జలాలు, మిషన్​ భగీరథ.. అద్భుతంగా పొంగిపొర్లుతున్న చెక్​ డ్యాంలు, మత్తడి పోస్తున్న చెరువులు కనిపిస్తున్నయ్​.  పరిశ్రమల రంగంలో వెల్లువలా పెట్టుబడులు వస్తున్నయ్​. ఐటీ రంగంలో మన ఖ్యాతి దూసుకుపోతున్నది. దేశ విదేశాల్లో మన కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తున్నయ్​” అని కేసీఆర్​ తెలిపారు. దళిత బంధు వందకు వంద శాతం విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. సమగ్ర సర్వే ప్రకారం రాష్ట్రంలో 17 లక్షల పైచిలుకు దళిత కుటుంబాలున్నాయని, ఇంకో రెండు లక్షల దాకా ఉండొచ్చని, దీనికి మొత్తం లక్షా 70 వేల కోట్లో, లక్షా 80 వేల కోట్లో ఖర్చవుతుందని చెప్పారు. 

కిరికిరి గాళ్లు అడ్డం పొడువు మాట్లాడితే అదిరిపోం
నెగెటివ్ ఫోర్సెస్ ఎప్పుడూ ఉంటాయని, తమను కూడా ఆ శక్తులు వెంటాడాయని కేసీఆర్​ అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, సెక్రటేరియట్, యాదాద్రి టెంపుల్ కడుతామంటే  కేసులు వేశారని, అన్నింటినీ ఛేదించుకొని ముందుకు సాగామని చెప్పారు. ‘‘పాలమూరులో పెండింగ్ లో ఉన్న  కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్ సాగర్, జురాలతోపాటు ఉత్తర తెలంగాణలో పెండింగ్  లో ఉన్న మిడ్ మానేరు, దేవాదుల వంటి ప్రాజెక్టులను పూర్తి చేసినం” అని వివరించారు. ‘‘కిరికిరి గాళ్లు, తలకు మాసినోళ్లు, పనికిమాలినోళ్లు  తెలివి తక్కువతనంతో అడ్డం పొడువు మాట్లాడితే టీఆర్ఎస్ అదిరిపోదు” అని ఆయన అన్నారు. ‘‘విరాళాలు, ఫిక్స్‌ డ్‌ డిపాజిట్ల రూపంలో పార్టీకి రూ. 425 కోట్లు వచ్చినయ్​. వాటి మీదనెలకు వస్తున్న రూ. 2 కోట్ల ఆదాయంతో ముందుకు కొనసాగుతున్నం. 31 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు మొదలైనయ్. ఇటివలే రూ. 10 కోట్లతో ఢిల్లీలోనూ పార్టీ ఆఫీసుకు శంకుస్థాపన జరిగింది. 10 నెలల్లో ఆఫీసు రెడీ అయితది. జిల్లాల్లో మిగతా చోట్లా త్వరలో పూర్తి చేస్తం” అని కేసీఆర్​ చెప్పారు. కిరికిరిగాళ్లు, కిరాయిగాళ్లు, ఢిల్లీ గులాములు దళితబంధులాంటి పథకాలు తేలేరని, కాంగ్రెస్, బీజేపీకి ఢిల్లీలో ఉండే వారి అధిష్టానాలు పర్మిషన్లు ఇవ్వవని కేసీఆర్​ అన్నారు. ‘‘ఈ గులాములు అధికారంలోకి వస్తే సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ వీళ్ల బతుకులు. టీఆర్ఎస్ కు బాసులు లేరు.. శాసించేవారు, బాసులు, అధిష్టానం తెలంగాణ ప్రజలే. వారే టీఆర్ఎస్ అధిష్టానం” అని చెప్పారు. 

ఈసీది చిల్లరమల్లర వ్యవహారం
ఈసీ తన పరిధిని దాటుతోందని కేసీఆర్​ ఆరోపించారు. ‘‘నిన్నగాక మొన్న నాగార్జున సాగర్ లో ఎన్నిక జరిగింది. ఎన్నిక అంటే నాయకులు వెళ్లి మాట్లాడతరు. విచిత్రమేందంటే అక్కడ కేసీఆర్ సభ పెట్టొద్దని కేసు.. ఇదేం దిక్కుమాలిన వ్యవహారం. డెమోక్రసీలో సభ పెట్టొద్దని చెప్పడం ఏం రాజకీయం? ఇప్పుడు హుజూరాబాద్ లో కేసీఆర్ సభ పెట్టకుండా చేయాలనే దిక్కుమాలిన రాజకీయం నడుస్తున్నది. వాళ్లు తమ పరిధిని దాటుతున్నరు. ఇది మీకు గౌరవం కాదని హెచ్చరిస్తున్నా.  చిల్లర మల్లర పనులు మానుకోవాలని భారత  ఎన్నికల సంఘానికి ఈ దేశంలో ఒక సీనియర్ నేతగా, ఒక సీఎంగా నేను సలహా ఇస్తున్నా. నవంబర్ 4 తర్వాత ఎన్నికల సంఘం కూడా దళితబంధును ఆపలేదు. గెల్లు శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ పథకాన్ని కొనసాగిస్తరు. అక్కడ నవంబర్, డిసెంబర్ కల్లా దళితబంధును సక్సెస్‌‌ చేస్తం’’ అని కేసీఆర్‌‌ అన్నారు. 


ఆ రాత్రంతా నిద్ర పట్టలె
ఓ సభలో తన వద్దకు ఇద్దరు అనాథ అమ్మాయిలు వచ్చి, తమ గోడు వెళ్లబోసుకున్నారని కేసీఆర్  చెప్పారు. అప్పటికీ వాళ్లిద్దరు టెన్త్​ క్లాస్ చదువుతున్నారని, ఆ తర్వాత ఏంచేయాలో, ఎటుపోవాలో తెల్వని పరిస్థితి ఉన్నదని వివరించారని అన్నారు. దీంతో ఆ రాత్రి అంతా తనకు నిద్రపట్టలేదని, ఏడుస్తూ కూర్చున్నానని తెలిపారు. ఈ క్రూర సమాజంలో ఎదిగిన ఇద్దరు అనాథ ఆడబిడ్డల పరిస్థితి ఏందో తల్చుకుంటే దుఖం వచ్చిందన్నారు. అందుకే,  అనాథ పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రి అయ్యేలా కొత్త కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. అనాథల ఆలన, పాలన ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. అనాథ పిల్లలు ఎవరున్నా మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌కు వారి వివరాలు ఇవ్వాలని కేసీఆర్ సూచించారు.

దళితబంధు నుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్నం
హుజూరాబాద్‌‌‌‌ నియోజకవర్గంలో దళిత బంధు అమలు సందర్భంగా తాము ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటున్నామని సీఎం కేసీఆర్‌‌‌‌ అన్నారు.  ‘‘హుజూరాబాద్‌‌‌‌ నుంచి చాలా గుణపాఠాలు వస్తున్నయ్​.  ఇంకా కూడా వస్తయ్​” అని చెప్పారు. ఏ ఒక్క లబ్ధిదారుడు మళ్లీ కిందికి పోకుండా ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామని, కేవలం పైసలిచ్చి వదిలేయకుండా, ప్రభుత్వం ఇచ్చే అన్ని లైసెన్సులు, కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. టీఆర్​ఎస్​ ప్లీనరీలో దళిత బంధుపై తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడారు. దళితబంధుకు కఠిన నిబంధనలు లేవన్నారు. ‘‘ఎవడో మనల్ని  విమర్శించిండని అనుకోవద్దు. నూటికి నూరుపాళ్లు ఈ కార్యక్రమంలో విజయం సాధిస్తం. మేకను ఎక్కడ, కుక్కను ఎక్కడ కట్టేయాలో తెలుసని.. ఎమ్మెల్యే ఆనంద్‌‌‌‌ అన్నడు. మనం కట్టేయాల్సిన అవసరం లేదు.. ప్రజలకు అన్నీ తెలుసు. మేకను ఎక్కడ కట్టేయాల్నో.. కుక్కను ఎక్కడ కట్టేయాల్నో వాళ్లే కట్టేస్తరు.. మనం ముందుకు సాగాలె’’ అని పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో దళితబంధు కార్యక్రమాన్ని మూడు రకాలుగా అమలు చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గంలో వంద మందికి దళితబంధు పథకం వర్తింపజేస్తామని,  ఈ వంద మంది లబ్ధిదారులను రెండు, మూడు గ్రామాల నుంచే గుర్తించాలని, అంతకుమించి తీసుకోవద్దని చెప్పారు. నలుగురు దళిత ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని ఒక్కో మండలంలో పూర్తి స్థాయిలో స్కీం అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని నాలుగు వైపులా స్కీం అమలు చేస్తే ఒక అవగాహన వస్తుందని అమలు చేస్తున్నామని తెలిపారు. హుజూరాబాద్‌‌‌‌లో పైలెట్‌‌‌‌ ప్రాజెక్టుగా ఈ స్కీం ప్రారంభించామని చెప్పారు. 

ఏపీలో పార్టీ పెట్టుమంటున్నరు 
ఇక్కడి పథకాలను చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆ పథకాలు కావాలని అడుగుతున్నారని కేసీఆర్​ అన్నారు. మహారాష్ట్ర నాందేడ్​ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల వాళ్లు, కర్నాటక రాయచూర్​ ఎమ్మెల్యే .. తెలంగాణలో అమలు చేసే పథకాలు తమకూ అమలు చేయాలని, లేదంటే తెలంగాణలో తమను కలపాలని డిమాండ్​ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దళిత బంధు తీసుకువచ్చిన తర్వాత ఏపీలో తమ పార్టీని ప్రారంభించాలని అక్కడి వాళ్లు విజ్ఞప్తి చేస్తున్నారని చెప్పారు. ‘‘ఆంధ్రా ప్రాంతం నుంచి కూడా వందల వేల విజ్ఞాపనలు వస్తున్నయ్​. ‘సార్​ మీ పార్టీ ఇక్కడ కూడా ప్రారంభించండి.. మీ పార్టీని గెలిపించుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నం. మీ పథకాలు మాకు కావాలి’ అని అంటున్నరు” అని ఆయన వివరించారు.

మహిళా ప్రజాప్రతినిధులను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలి
మహిళా ప్రజాప్రతినిధులను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని పార్టీ క్యాడర్‌‌‌‌‌‌‌‌కు కేసీఆర్​ సూచించారు. మహిళల్లో గొప్పవాళ్లు ఉన్నారని, మగవాళ్లలో సన్నాసులు ఉన్నారని వ్యాఖ్యానించారు. గొప్ప రాజ్యంలో అందరినీ సమానంగా చూస్తారని, మన దగ్గర కూడా ఆ పరిస్థితి రావాలన్నారు. ప్రతిభావంతులైన మహిళలను ముందు వరుసలో పెట్టనన్ని రోజులు, ఈ దేశం బాగుపడదని చెప్పారు.