
- వాటికి కొబ్బరికాయ కొట్టి వదిలేసిన ప్రభుత్వం
- కేసీఆర్ హామీ ఇచ్చి ఐదేండ్లయినా పూర్తి కాలే
- కరోనా తర్వాత ఖాళీ అయిన గచ్చిబౌలిటిమ్స్
- పనులు పూర్తి చేయకుండానే సర్కారు గొప్పలు
హైదరాబాద్, వెలుగు : సిటీ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్నిర్మిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించి ఆరేళ్లు దాటినా నేటికీ అందుబాటులోకి రాలేదు. నాలుగు ఆస్పత్రుల్లో ఒకటి కరోనా సమయంలో గచ్చిబౌలిలో టిమ్స్ హాస్పిటల్‌గా ఓపెన్ చేసినప్పటికీ కొద్దిరోజులకే రెనోవేషన్ పేరుతో దాన్ని క్లోజ్ చేశారు. ప్రస్తుతం టిమ్స్పూర్తిగా బంద్ అయింది. పేషెంట్లకు సేవలు అందకపోయినప్పటికీ ఏదో నామ్ కే వాస్తేగా కొంతమంది స్టాఫ్‌ను మాత్రం ఉంచారు.
మిగతా మూడు హాస్పిటల్స్‌కు గతేడాది సీఎం కేసీఆర్ శంకుస్థాపనలు కూడా చేశారు. వాటిని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ప్రకటించినా నేటికీ పూర్తి చేయలేదు. పాత సెక్రటేరియెట్‌ను కూల్చి కొత్తది నిర్మించిన సర్కార్.. ఆస్పత్రుల నిర్మాణాల్లో నిర్లక్ష్యంగా ఉంది. దీంతో ప్రజలకు సకాలంలో వైద్యం అందడంలేదు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. ఏ చిన్న అనారోగ్య సమస్య అయినా కూడా జిల్లా ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ అందుబాటులో లేదని సిటీలోని పెద్దాసుపత్రులకే రిఫర్ చేస్తున్నారు.
కరోనా టైమ్‌లో హడావుడిగా ప్రారంభించి..
కరోనా సమయంలో టిమ్స్ హాస్పిటల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి ట్రీట్ మెంట్ అందించారు. ఆ తర్వాత టిమ్స్‌ని పక్కన పెట్టేశారు. అప్పట్లో నెలలోనే
టిమ్స్‌ని హడావుడిగా ప్రారంభించారు. గతేడాది రెనోవేషన్ పనులు చేపట్టినా ఇంకా పూర్తి చేయలేదు. ఇక్కడ ఏర్పాటు చేసిన వైద్య పరికరాలను కూడా వేరే ఆస్పత్రులకు తరలించారు. స్టాఫ్ ని కూడా గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, సరోజినిదేవి ఆస్పత్రులకు పంపించారు.
ఇప్పటి వరకు కేవలం 10 శాతం మాత్రమే పనులు జరిగాయి. ఇంకా చాలా పనులు పెండింగ్‌లోనే ఉండగా.. త్వరగా పూర్తి చేస్తారనే నమ్మకం కూడా లేదు. అప్పట్లో కొద్ది రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని అందుబాటులో తెచ్చిన ప్రభుత్వం, రెనోవేషన్ పనులను ఎందుకు పట్టించుకోవడంలేదనేది చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా టిమ్స్ పనులు త్వరగా పూర్తిచేసి ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావాలని జనం కోరుతున్నారు.
సిటీలోని గాంధీ, ఉస్మానియాపై తగ్గనున్న భారం
ప్రస్తుతం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్తో పాటు వివిధ సర్జరీలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌కు ప్రజలు రావాల్సి వస్తుంది. దీంతో ఆయా ఆస్పత్రులపై తీవ్ర భారం పడడంతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుంది. అయితే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించిన తర్వాత హాస్పిటల్స్‌పై భారం తగ్గుతందని ఏండ్లుగా చెబుతున్నారు. వాటి నిర్మాణాలు పూర్తికాకపోవడంతో రెండు హాస్పిటళ్లకు రోగులు సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది.
ఎమర్జెన్సీ పేషెంట్లకు అక్కడ కూడా త్వరగా వైద్యం అందని పరిస్థితి నెలకొంది. కొత్తగా నిర్మించే హాస్పిటల్స్‌ను త్వరగా పూర్తి చేసి ఉంటే వీటిపై భారం పడకుండా ఉండేది. జిల్లాల నుంచి వచ్చే వారికి శివారు ప్రాంతాల్లోనే ట్రీట్ మెంట్అందేది. జంట నగరాల ప్రజలు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు వెళ్లి ఈజీగా ట్రీట్ మెంట్పొందేందుకు ఎంతో వీలు ఉండేది.
ఆధునిక సౌకర్యాలతో నిర్మిస్తామని..
ఆధునిక సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని అందుబాటులోకి తీసుకొచ్చి జిల్లాల నుంచి వచ్చే పేషెంట్లకు సిటీ శివారులోనే మెరుగైన ట్రీట్ మెంట్అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అల్వాల్ లో 28.41ఎకరాల్లో రూ.897 కోట్లు, గడ్డిఅన్నారంలో 31.36 ఎకరాల్లో రూ.900 కోట్లు, ఎర్రగడ్డలో 60 ఎకరాల్లో రూ.882 కోట్లతో కొత్త హాస్పిటల్స్నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో దశల వారీగా ఆస్పత్రుల నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన కూడా చేశారు. నెలలు గడుస్తున్నా ఇంకా నిర్మాణాలు చేపట్టడడంలేదు.