దక్షిణాది రాష్ట్రాల భేటీకి కేసీఆర్ పోతలే

దక్షిణాది రాష్ట్రాల భేటీకి కేసీఆర్ పోతలే

 

  • గతంలో తిరుపతిలో జరిగిన సమావేశానికీ హాజరుకాని సీఎం
  • తిరువనంతపురంలో నేడు అమిత్​షా అధ్యక్షతన కౌన్సిల్ మీటింగ్
  • రాష్ట్రం నుంచి అప్పుడూ ఇప్పుడూ మహమూద్ అలీ, పెద్దాఫీసర్లు హాజరు
  • ముఖ్యమైన మీటింగ్‌కు సీఎం గైర్హాజరుపై చర్చ
  • అక్కడికి వెళ్లకుండా ఉండాలనే.. కేబినెట్, టీఆర్‌‌ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టుకున్నట్లు విమర్శలు

హైదరాబాద్, వెలుగు: సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదు. తిరువనంతపురంలో శనివారం జరగనున్న 30వ మీటింగ్‌కు వెళ్లడం లేదు. ఏపీ విభజన చట్టం హామీల అమలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రధాన ఎజెండాగా జరుగుతున్న ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్​షా అధ్యక్షత వహించనున్నారు. గతేడాది నవంబర్ 14వ తేదీన ఏపీలోని తిరుపతిలో జరిగిన సదరన్ మీటింగ్‌కు కూడా కేసీఆర్ అటెండ్ కాలేదు. అప్పుడు హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు వెళ్లారు. ఇప్పుడూ మహమూద్ అలీ, ఆయన వెంట ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌ నిర్వహణపై ఎప్పుడో నిర్ణయం జరిగినప్పటికీ.. అటు వెళ్లకుండా ఉండేందుకే కేబినెట్​ భేటీ, టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టుకున్నట్లు చర్చ జరుగుతున్నది. మరో వైపు సమావేశం అజెండాలో మొత్తం 26 అంశాలను చేర్చగా విభజన చట్టం అమలుపై ఏపీ అనేక విషయాలను ప్రస్తావించింది. కానీ తెలంగాణ వైపు నుంచి ఒక్క పాయింట్ కూడా పెట్టలేదు. తెలంగాణ నుంచి ఏపీకి కరెంట్ బకా యిలు రూ.6,756 కోట్లు చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ ఇటీవల ఆదేశించింది. దీనిపై సదరన్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉండగా.. సీఎం డుమ్మా కొడుతుండటంతో ఆఫీసర్లు ఏం చెప్తారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు, హామీలపై  నిలదీయాల్సిన సీఎం.. మొత్తంగా మీటింగ్‌‌‌‌కే దూరంగా ఉండటంపై ఆఫీసర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పాలమూరుపై కర్నాటక అభ్యంతరాలు
పాలమూరు-–రంగారెడ్డి, నక్కలగండి వంటి లిఫ్ట్ స్కీమ్స్‌‌‌‌పై కర్నాటక అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై మీటింగ్​లో చర్చించాలని కేంద్రాన్ని కోరింది. పాలమూరు ప్రాజెక్టు విషయంలో కేఆర్​ఎంబీ జోక్యం చేసుకోవాలని కోరుతోంది. సర్ ప్లస్ వాటర్ వాడుకునేందుకు పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కట్టడాన్ని ఒప్పుకోవడం లేదు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలు, కేఆర్​ఎంబీ జ్యూరిస్ డిక్షన్ వంటి ప్రధాన అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఇంత ముఖ్యమైన సమావేశానికి సీఎం వెళ్లకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎలాంటిఅవగాహన లేని హోంమంత్రి మహమూద్ అలీని పంపడంపై ఇంజనీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

విభజన హామీలపై అజెండా పెట్టిన ఏపీ
గత సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌‌‌‌లో తెలంగాణ నుంచి రావాల్సిన కరెంట్ బకాయిలపై ఏపీ గట్టిగా వాదించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ వాడుకున్న కరెంట్​కు డబ్బులు ఇంకా ఇవ్వలేదని.. వెంటనే ఇచ్చేలా కాలపరిమితి పెట్టాలని మీటింగ్​లో ఏపీ కోరింది. దీంతో తెలంగాణ బకాయిలు అసలు, వడ్డీ, పెనాల్టీ కలిపి రూ.6,756 కోట్లు కట్టాలని కేంద్రం ఆదేశించింది. తొమ్మిది, పదో షెడ్యూల్‌‌‌‌లో ఇంకా పూర్తి కాని సంస్థల విభజన, తెలంగాణ సివిల్ సప్లయ్స్ సంస్థ నుంచి ఏపీ సివిల్ సప్లయ్స్ సంస్థకు రావాల్సిన మొత్తం, 2014 – 15 రైస్ సబ్సిడీ వంటి ఇతర అంశాలను ఏపీ ప్రస్తావించనుంది. మహిళలపై నేరాలు, హింసపై తీసుకుంటున్న చర్యలు, స్టేట్ హైవేస్, రైల్వేస్‌‌‌‌పై చర్చించనున్నారు. డ్రగ్స్ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో రాష్ట్రాలు చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల హైదరాబాద్‌‌‌‌లో డ్రగ్స్ వ్యవహారాలు బయటపడుతుండటంతో ఈ అంశంపై కేంద్ర హోం శాఖ రిపోర్ట్ కోరినట్లు తెలిసింది.