కేసీఆర్ చెప్పిన అమెరికా, చైనా కథ ఏమిటంటే..?

కేసీఆర్ చెప్పిన అమెరికా, చైనా కథ ఏమిటంటే..?

సీఎం కేసీఆర్ ప్రసంగంలో భాగంగా అమెరికా, చైనాల వ్యవసాయ రంగం గురించి తనదైన శైలిలో వివరించారు. ఆ రెండు దేశాలను మించిన స్థాయిలో సాగు యోగ్యమైన భూమి భారత్ లో అందుబాటులో ఉందని చెప్పారు. కేసీఆర్ ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘నాకు అవగాహన కలిగిన భారతదేశం ఏ దశకు చేరుకోవాలో .. ఆ దశకు చేరుకోలేదు. కొన్ని విషయాలు నేను చెబితే.. మీకు అది వాస్తవమా అనిపిస్తుంది. మన దేశం నేటికీ ఒక దశకు చేరుకోలేదు.. స్వతంత్ర ఫలం సిద్ధించలేదు.. అనేది బలమైన మాట, బరువైన మాట. అంత తేలికగా చెప్పగలిగే మాట కాదు అది.  నేను చెబుతున్నానంటే.. దానికి వివరణ కూడా చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది’’ అని కేసీఆర్ మొదలుపెట్టారు. 

‘‘ఉదాహరణకు అమెరికాను తీసుకుంటే.. అది మన దేశం కంటే రెండున్నర రెట్లు పెద్దగా ఉంటది. చైనా కూడా మన దేశం కంటే ఒకటిన్నర రెట్లు పెద్దగా ఉంటది. అమెరికా భూభాగంలో 29 శాతం మాత్రమే వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉంటది. చైనాలో కూడా 16 శాతం మాత్రమే సాగు యోగ్యమైన భూమి ఉంది.  ప్రపంచ దేశాలతో భారతదేశాన్ని పోలిస్తే.. మన దేశంలోని భూభాగంలో 50 శాతం (41 కోట్ల ఎకరాల) భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. సూర్యకాంతి కూడా మనదేశంలో విస్తారంగా ఉంటది. మూడు రకాల వాతావరణ మండలాలు మన దేశంలో ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతాలు, అతిశీతల ప్రాంతాలు కూడా మన దేశంలో ఉన్నాయి. యాపిల్ కాయలు, మామిడి కాయలు కూడా మనదేశంలో పండుతాయి. ఆవిధంగా వైవిధ్యమైన వాతావరణం ఇక్కడ ఉంది.  ఏటా మన దేశంలో 4000 బిలియన్ క్యూబిక్ మీటర్ల (1.40 టీఎంసీల) వర్షం కురుస్తుంది. 70వేల టీఎంసీలు నీళ్లు వర్షం కురిసేటప్పుడు ఏటా ఆవిరైపోతుంటయి.. మిగతా 70వేల టీఎంసీలు సమృద్ధిగా మిగిలి ఉంటయి. ఇవన్నీ కలుపుకొని ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ చైన్ కలిగిన దేశంగా ఎదిగే సత్తా మన ఇండియాకు ఉంది’’ అని కేసీఆర్ వివరించారు.