లీడర్ల నుంచి ఫీడ్ బ్యాక్​ తీసుకున్న సీఎం కేసీఆర్​ 

లీడర్ల నుంచి ఫీడ్ బ్యాక్​ తీసుకున్న సీఎం కేసీఆర్​ 
  • తమ వర్గానికే దక్కాలంటూ లీడర్ల పైరవీలు 
  • మూణ్నాలుగు రోజుల్లో తేలే అవకాశం 

ఖమ్మం, వెలుగు: స్తంభాద్రి అర్బన్​ డెవలప్​మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్​ పదవి కోసం అధికార పార్టీ ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత చైర్మన్​ బచ్చు విజయ్​ కుమార్​ స్థానంలో మరొకరికి  అవకాశం ఇవ్వాలని కొందరు లీడర్లు పట్టుబడుతుండగా, ఆయననే కంటిన్యూ చేయాలని మరో ప్రధాన నేత ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మూణ్నాలుగు నెలల నుంచి కొత్త పాలకవర్గ ఏర్పాటుపై ప్రచారం జరుగుతుండగా, దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఇప్పుడు ఫైనల్​స్టేజ్​కు వచ్చినట్టు సమాచారం. కొత్త కమిటీని ప్రకటిస్తారా లేక ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగిస్తారా అన్నది 3, 4 రోజుల్లో క్లారిటీ వస్తుందని విశ్వసనీయంగా తెలిసింది. 

ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరు

సుడాకు కొత్త పాలకవర్గ ఏర్పాటు ప్రచారంతో తాము చెప్పిన వారికే పదవి దక్కాలంటూ ప్రగతి భవన్​ లో లీడర్లు పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా చైర్మన్​ రేసులో ప్రస్తుతం ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్​ జిల్లా కార్యాలయ ఇన్​చార్జి పనిచేసిన గుండాల కృష్ణ, ఖమ్మం నగర టీఆర్ఎస్​ మాజీ అధ్యక్షుడు, కార్పొరేటర్​ కమర్తపు మురళి.. ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మంత్రి పువ్వాడ అజయ్.. మురళి​, కృష్ణకు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్​ పదవులు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరికి సుడా చైర్మన్​, మరొకరికి కార్పొరేషన్​ చైర్మన్​ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, గాయత్రి రవి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల​ నుంచి సీఎం కేసీఆర్​ అభిప్రాయం​అడిగినట్టుగా తెలుస్తోంది. దీంతో త్వరలోనే కొత్త పాలకవర్గ ఏర్పాటుపై ఉత్తర్వులు వస్తాయని, దసరాలోపే ప్రమాణ స్వీకారం ఉండొచ్చన్న అంచనాలున్నాయి. 

రేసులో ముఖ్యనేతలు

చైర్మన్​ రేసులో ఉన్న ఆర్జేసీ కృష్ణకు సీఎం కేసీఆర్​ తో సాన్నిహిత్యం ఉంది. 2014 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచి టీఆర్ఎస్​ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్​గా పనిచేశారు. 2016లో ఖమ్మం కార్పొరేషన్​ ఎన్నికల టైంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ ఖమ్మం వచ్చినప్పుడు ఆర్జేసీ కృష్ణ ఇంట్లోనే రెండ్రోజుల పాటు ఉన్నారు. ఆ తర్వాత పార్టీ జిల్లా కార్యాలయ ఇన్​చార్జిగా పనిచేశారు. గతేడాది జిల్లా అధ్యక్షులను నియమిస్తున్న సమయంలో పదవిని, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశించి భంగపడ్డారు. ఇక కమర్తపు మురళి ఖమ్మం నగర టీఆర్ఎస్​ అధ్యక్షుడిగా ఇంతకు ముందు పనిచేసి, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు. రెండుసార్లు కార్పొరేటర్​ గా విజయం సాధించారు. మొదటిసారి సుడా చైర్మన్​నియామకంలో కూడా మురళి పేరు వినిపించింది. అయితే ఇప్పటి వరకు అవకాశం దక్కలేదు. వీళ్లిద్దరూ కాకుండా ఖమ్మం రూరల్​ మండల టీఆర్ఎస్​ అధ్యక్షుడు బెల్లం వేణు పేరును పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​ రెడ్డి సూచించినట్టు చెబుతున్నారు.

536చ.కి.మీ. ఏరియా పరిధిలో సుడా 

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​తో పాటు ఆనుకొని ఉన్న ఏడు మండలాల్లోని 46 గ్రామాలను కలుపుతూ 2017 అక్టోబర్​లో ప్రభుత్వం సుడాను ఏర్పాటుచేసింది. వైరా, కొణిజర్ల, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, చింతకాని, రఘునాథపాలెం మండలాల్లో 536 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్న సుడాకు 2020 జూన్​ లో మొదటి పాలకవర్గాన్ని ఏర్పాటుచేశారు. మంత్రి పువ్వాడ అజయ్​ ప్రధాన అనుచరుడు బచ్చు విజయ్​కుమార్​ను చైర్మన్​గా నియమించగా, 15మంది సభ్యులతో అడ్వైజరీ కమిటీని ప్రకటించారు. చైర్మన్​విజయ్​కుమార్ పై అనుమతి లేని వెంచర్ల నుంచి రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. సుడా నుంచి నిధుల కేటాయింపు, వెంచర్లకు అనుమతులిచ్చే విషయంలో తమకు సమాచారం కూడా ఇవ్వడం లేదని అడ్వైజరీ కమిటీ సభ్యులు ఆరోపించారు. సభ్యులు అని చెప్పుకోవడం తప్ప తమ సలహాలు, సూచనలు తీసుకోవడం లేదని మంత్రికి ఫిర్యాదుచేశారు. దీంతో నాలుగైదు నెలల క్రితమే విజయ్​ ను మారుస్తారన్న ప్రచారం తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.