టెన్షన్ పడొద్దు నేనున్నా.. వరంగల్ ఎంజీఎంలో కేసీఆర్

V6 Velugu Posted on May 21, 2021

వరంగల్‌ అర్బన్: సీఎం కేసీఆర్ వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు. నగరంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల హెలిప్యాడ్ వద్ద మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ లు సీఎంకు స్వాగతం పలికారు. ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న కేసీఆర్.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కొవిడ్‌ బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, రెమ్‌డెసివిర్, ఇతర మందుల లభ్యత తదితర అంశాలపై అధికారులతో కేసీఆర్ చర్చించారు. కోవిడ్ పేషెంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడొద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 

ఎంజీఎం ఆస్పత్రిలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే రోగులకు కావాలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఎంజీఎం నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసానికి వెళ్ళిన కేసీఆర్.. మధ్యాహ్న భోజనం తర్వాత సెంట్రల్ జైల్ ను సందర్శిస్తారు. ఈ పర్యటనలో  సీఎం కేసీఆర్  వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, సీఎస్ సోమేశ్ కుమార్, రిజ్వి, డీఎం ఈ రమేష్ రెడ్డి, ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంజీఎం సూపరిండెంటెంట్ చంద్రశేఖర్, హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నతాదికారులు, సీపీ తరుణ్ జోషితోపాటు జిల్లాకు చెందిన పలువురు నాయకులున్నారు.

Tagged Errabelli Dayakar, COVID Patients, Telangana CM KCR, MGM Hospital, Satyavati Rathod, Medical Equipments, Warangal Visit, Facilities

Latest Videos

Subscribe Now

More News