దత్తత గ్రామం మోతెను పట్టించుకోని సీఎం​ కేసీఆర్

 దత్తత గ్రామం మోతెను పట్టించుకోని సీఎం​ కేసీఆర్
  •  2014లో  గ్రామంలో పర్యటించిన కేసీఆర్​
  • అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ
  • ఎనిమిదేండ్లు దాటినా అటువైపు చూడలే..
  • గ్రామం మంత్రి  మండలంలో ఉన్నా.. ‘డబుల్’ ఇండ్ల జాడే లేదు..


నిజామాబాద్,  వెలుగు:  తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన మోతె గ్రామం నేడు అభివృద్ధికి నోచుకోక వెలవెల బోతోంది. ఉద్యమ కాలంలో ఏకతాటిపై నడిచిన గ్రామస్తుల తెగువను చూసిన కేసీఆర్​‘ఈ  మట్టి ఎంతో పవిత్రమైనది’ అంటూ గ్రామంలో ముడుపు కట్టారు. తెలంగాణ వచ్చినంక వెళ్లి ముడుపు విప్పారు. ఈ సందర్భంగా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు. కానీ  ముడుపు విప్పి ఎనిమిదేండ్లు దాటినా సీఎం మోతె  వైపు మళ్లి చూడలేదని  గ్రామస్తులు చెప్తున్నారు. వంద శాతం సాగునీరు, పసుపు బోర్డు, ఎర్రజొన్న రైతుల బకాయిలను ఇప్పిస్తానని  హామీ ఇచ్చారని, నేటికీ ఏ ఒక్కటీ నెరవేర్చలేదంటున్నారు. తాము  పలు మార్లు  వెళ్లి  సీఎంను కలిసి డబుల్​ ఇండ్లు ఇవ్వాలని కోరగా, కట్టిస్తానని చెప్పారే కానీ, నేటికీ కట్టించలేదని వాపోతున్నారు. 

ముడుపుతో స్ఫూర్తి.. 

2001లో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ  ఉద్యమానికి మోతె గ్రామస్తులు రాజకీయ పార్టీలకతీతంగా ఏకతాటిపై నిలిచి ఉద్యమానికి మద్దతు పలికారు. అదే స్ఫూర్తితో తెలంగాణలోని చాలా పల్లెలు ‘మోతె’ బాటలో నడిచాయి.  నాటి ఉద్యమ నాయకుడుగా ఉన్న  కేసీఆర్​గ్రామంలో పర్యటించి ఇక్కడి మట్టి ఎంతో పవిత్రమైనదని, తెలంగాణ రావాలని కోరుకుంటూ గ్రామంలో మట్టితో ముడుపుకట్టారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 మార్చి 28న మోతె గ్రామానికి వచ్చిన కేసీఆర్ ​ముడుపు విప్పారు. ఈ సందర్భంగా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు. గ్రామాభివృద్ధికి స్పెషల్​ఆఫీసర్​ను నియమించి, సెక్రటేరియట్​ నుంచి పర్యవేక్షిస్తానని  హామీ ఇచ్చారు. కానీ నేటి వరకు స్పెషల్​ ఆఫీసర్​ను నియమించలేదు. డబుల్​ఇండ్లు కట్టించాలని గ్రామస్తులు పలు మార్లు కోరగా, కట్టిస్తానని సీఎం చెప్పినా.. గ్రామంలో సరిపోను జాగా లేదని అధికారులు చెప్తున్నారు.  మోతె గ్రామం హౌసింగ్​ శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి  సొంత మండలంలోనే ఉన్నా.. ‘డబుల్’ ఇండ్లకు జాగ లేదనడమేమిటని పలువురు ప్రతి పక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు.     

‘డబుల్’​ నిర్లక్ష్యం.. 

మోతె గ్రామంలో 4,115 మంది జనాభా ఉండగా 2,763 మంది ఓటర్లు ఉన్నారు.   గ్రామంలో ఫస్ట్​ఫేజ్​లో 200 మందికి డబుల్​ బెడ్  రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.  కానీ  ఎనిమిదేండ్లు దాటుతున్నా.. వాటి ఊసే లేదని గ్రామస్తులు వాపోతున్నారు. 2014  నుంచి ఇప్పటివరకు సుమారు 20 సార్లు జిల్లాలో  పర్యటించినా... కేసీఆర్​ మోతె గ్రామాభివృద్ధి గురించి మాట్లాడలేదని చెప్తున్నారు.  గ్రామస్తులు  ఇప్పటికి 3 సార్లు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని హైదరాబాద్​కు వెళ్లి సీఎం ను కలిశారు.  అయినా హామీలు కార్యరూపం దాల్చకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. 

స్పెషల్​ ఫండ్స్​ నిల్.. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోనే మోతె గ్రామంలో అడపాదడపా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.  కానీ ఇప్పటి వరకు   స్పెషల్ ​ఫండ్ ​ మంజూరు చేయలేదు.    14వ ఫైనాన్స్​ కమిషన్​ కింద  రూ. 35 లక్షలు , ఎస్ఎస్​సీ కింద రూ. 24 లక్షలు,  పంచాయతీ పన్నులు రూ. 15 లక్షలు  మొత్తం రూ. 74  లక్షలు ఏటా వస్తున్నాయి. ఇప్పటికైనా సీఎం స్పందించి ఇచ్చిన మాట ప్రకారం స్పెషల్​ఫండ్స్​కేటాయించాలని, గ్రామాభివృద్ధి   ‘డబుల్’ ఇండ్ల ను నిర్మించాలని కోరుతున్నారు.


దళితబంధు స్కీమ్​ రాలే 

గ్రామంలో 80 దళిత కుటుంబాలున్నాయి. ‘దళిత బంధు’ కోసం ఫస్ట్​ఫేజ్​లో   పలువురు దరఖాస్తులు చేసుకున్నారు. కానీ  మోతె  స్కీమ్​ కు ఎంపిక కాకపోవడంతో ఎవరికీ రాలే.  సెకండ్​ఫేజ్​లో ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.   పీహెచ్​సీలో  డాక్టర్​ లేక ప్రజలు అవస్థలు పడుతున్న మాట వాస్తవం. కొన్ని సార్లు ‘భగరీథ’ నీటిసరఫరాలో  కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  
– ఎండీ ఖాన్,​ గ్రామ కార్యదర్శి

కొన్ని సమస్యలు పరిష్కరించిన్రు..

 గ్రామంలో సుమారు రూ.20 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టిన్రు . ‘డబుల్’ ఇండ్ల నిర్మాణాలే మొదలు పెట్టలే. ఫస్ట్​ఫేజ్​లో 200 ఇండ్లు ఇస్తమన్నరు. ఇంకా ఇవ్వలే. పీహెచ్​సీలో డాక్టర్​లేడు. పంచాయతీ బిల్డింగ్, సీసీ రోడ్లు, చెరువు ఫీడర్ చానల్​ఏర్పాటు ఇలా చిన్న చిన్న సమస్యలు పరిష్కరించిన్రు. ఇంకా ఫండ్స్​కేటాయించి గ్రామాన్ని డెవలప్​చేయాలి.
– బాల్​రాజ్, మాజీ ఎంపీపీ, వేల్పూర్​


‘డబుల్’ ఇండ్లకు స్థలం లేదంటున్నరు..

 సీఎం కేసీఆర్​దత్తత తీసుకున్న గ్రామంలో ‘డబుల్’ ఇండ్లు ముందుగానే కడ్తరనుకున్నాం.  గ్రామంలో స్థలం లేదని చెప్తూ ఇప్పటి వరకు కట్టలే.  ఎనిమిదేండ్లు దాటినా  నిర్మాణానికి  అడుగే పడలేదు.  ‘డబుల్’​ ఇండ్లను వెంటనే నిర్మించి గ్రామస్తులందరికీ పంచాలె.
– అన్వేశ్,​ గ్రామస్తుడు