బీఆర్ఎస్‌‌ క్యాండిడేట్లు.. 75 సీట్లలో ఖరారు!.. లిస్టు రెడీ చేసిన కేసీఆర్

బీఆర్ఎస్‌‌ క్యాండిడేట్లు.. 75 సీట్లలో ఖరారు!.. లిస్టు రెడీ చేసిన కేసీఆర్
  • ఫామ్‌‌హౌస్‌‌లో 5 రోజులపాటు కసరత్తు
  • జాబితాలో ఇతర పార్టీల నేతలు?
  • త్వరలోనే బీఆర్ఎస్‌‌లోకి ఆయా లీడర్లు
  • ఆగస్టు మూడో వారంలో ఫస్ట్ లిస్ట్ ప్రకటించే చాన్స్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు రెడీ అయింది. ఎర్రవెల్లిలోని ఫామ్‌‌హౌస్‌‌లో పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ ఐదు రోజుల పాటు కసరత్తు చేసి.. 75 స్థానాల్లో క్యాండిడేట్ల తుది జాబితా రూపొందించారని సమాచారం. ఇందులో కొందరు ఇతర పార్టీల లీడర్లకు కూడా చోటు దక్కినట్టు తెలుస్తున్నది. వారిలో కొంత మంది రానున్న రెండు వారాల్లో పార్టీలో చేరుతారని, మిగతా వాళ్లు టికెట్ల ప్రకటనకు ముందు గులాబీ కండువా కప్పుకుంటారని సమాచారం. 

ఉమ్మడి నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన సీనియర్​నాయకుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్టు బీఆర్ఎస్‌‌ నేతలు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్​పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం.. ఈ వారంలోనే క్యాండిడేట్ల మొదటి జాబితా ప్రకటించాల్సి ఉంది. కానీ అధిక శ్రావణం కావడంతోనే దీనికి బ్రేక్​పడినట్టు తెలుస్తున్నది. ఆగస్టు 16వ తేదీతో అధిక శ్రావణం ముగుస్తుంది. 17 నుంచి నిజ శ్రావణం మొదలవుతుంది. ఆ తర్వాతి రోజు మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా కేసీఆర్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశముందని గులాబీ నేతలు చెప్తున్నారు. లేదా శ్రావణం ప్రారంభమైన తర్వాత మంచి ముహూర్తం చూసుకొని క్యాండిడేట్ల పేర్లు ప్రకటిస్తారని సమాచారం.

50 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత

బీఆర్ఎస్‌‌కు 104 మంది ఎమ్మెల్యేలుండగా వారిలో దాదాపు సగం మందిపై వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్టు వివిధ సర్వేల ద్వారా తేలింది. అందులో 30 మందికి టికెట్లు ఇస్తే పార్టీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని ఆయా సర్వే నివేదికలు చెప్తున్నాయి. అలాంటి నియోజకవర్గాలపై స్పెషల్​ఫోకస్​పెట్టిన కేసీఆర్.. ఇతర సర్వే ఏజెన్సీలను రంగంలోకి దించి మళ్లీ సర్వే చేయించారు. ఆయా నివేదికలను బేరీజు వేసుకొని ఎక్కడెక్కడ ఎవరిని తప్పించాలి? వారి స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలి? అనే వివరాలను సేకరించారు. ఆయా అభ్యర్థులపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో ఇంటెలిజెన్స్​వర్గాల నుంచి సమాచారం సేకరించారు. ఈ మొత్తం వివరాలతో ఐదు రోజుల పాటు కుస్తీ పట్టిన కేసీఆర్.. ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ ప్రిపేర్ చేశారు. దానికి అనుగుణంగానే పార్టీలో చేరికలపైనా ఫోకస్​పెట్టారు. ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడాలనే విషయాన్ని సంబంధిత జిల్లాల మంత్రులు, ఇతర ముఖ్య నేతలకు అప్పగించారు. వారు స్వయంగా ఆయా నేతలను రహస్యంగా కలిసి, కేసీఆర్​తో మాట్లాడించి టికెట్, రాజకీయ భవిష్యత్‌‌పై భరోసా ఇప్పిస్తున్నారు.

21 నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రకటన

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే 21 నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులెవరో పలు బహిరంగ సభల్లో ప్రకటించారు. వారితో పాటు పార్టీ కచ్చితంగా గెలుస్తుందని ధీమా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఫస్ట్​లిస్ట్​లో ప్రకటించనున్నారు. కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం ఆరు అంకె వచ్చేలా అభ్యర్థుల మొదటి జాబితా ఉండొచ్చని నేతలు చెప్తున్నారు. ఖరారు చేసిన 75 స్థానాల్లో ముందుగా 51 మందితో లేదా 42 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటించే అవకాశం ముందని అంటున్నారు. ఆ వెంటనే మిగిలిన అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తారని, తర్వాత కొంత టైం తీసుకొని మిగతా స్థానాల్లో పేర్లు వెల్లడిస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు. కేసీఆర్​ స్వయంగా అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తారని, బీఫాంలు అందజేసే పనిని కేటీఆర్​కు అప్పగిస్తారని సమాచారం. ఈసారి బీఫాంలను కేసీఆర్​కు బదులుగా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ సంతకంతోనే జారీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ మేరకు కేసీఆర్ ఆయనకు ఆథరైజేషన్​ ఇస్తారని సమాచారం.