సీఎం టూర్ కోసం ఏర్పాట్లు..రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

సీఎం టూర్ కోసం  ఏర్పాట్లు..రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్, వెలుగు: నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు జూన్ 4 నిర్మల్ కు  సీఎం కేసీఆర్ రానున్నారని  రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.  ఆదివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ వివిధ శాఖల అధికారులతో కలిసి  కలెక్టరేట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ కలెక్టరేట్ సమీపంలో లక్ష మందితో సీఎం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

9 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ఈ సందర్భంగా వివరించనున్నారన్నారు. నిర్మల్ జిల్లాకు మరిన్ని కొత్త పథకాలతో పాటు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు.  సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలిరావాలని మంత్రి కోరారు.  జూన్ 2 లో గా సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. పార్కింగ్, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.

మురళీకృష్ణ ఆలయంలో మంత్రి పూజలు...

 స్థానిక గాంధీ చౌక్ కాల్వగడ్డలోని శ్రీ మురళీకృష్ణ ఆలయ 13వ వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఆలయంలో మంత్రి పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని వెల్లడించారు.

ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు...

 మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శత జయంతిని పురస్కరించుకొని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వర్గీయ ఎన్టీఆర్ సోషల్ లీడర్ అని ఆయన  పాలనపరంగా ఎన్నో సంస్కరణలు చేశారని పేర్కొన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ తదితరులు పాల్గొన్నారు.