2 వేల మంది ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమావేశం

2 వేల మంది ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమావేశం
  • పూజలు చేసి రిజర్వాయర్​లోకి నీటిని వదలనున్న సీఎం కేసీఆర్
  • 2 వేల మంది జిల్లా ప్రజాప్రతినిధులతోనే ముఖ్యమంత్రి సమావేశం
  • పాసులున్న వారికే అనుమతి.. సాధారణ ప్రజలకు నో ఎంట్రీ

సిద్దిపేట/దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్​వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. అండర్ గ్రౌండ్ పంప్ హౌస్​లో​ మోటార్లను ఆన్​చేయడంతోపాటు డెలివరీ సిస్టర్న్​వద్ద పూజలు చేసి గోదావరి జలాలను లాంఛనంగా రిజర్వాయర్ లోకి విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం12 గంటలకు రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసిన తరువాత సీఎం కేసీఆర్​జిల్లా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంత్రి హరీశ్​రావు పర్యవేక్షణలో సీఎం మీటింగ్​కోసం దాదాపు 2 వేల మందికి సరిపోయేలా ప్రత్యేక సభా వేదిక ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి కేసీఆర్ ​హెలికాప్టర్ లో నేరుగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ వద్ద దిగనుండటంతో అక్కడ ప్రత్యేక హెలిప్యాడ్ ను నిర్మించారు. 

జిల్లా ప్రతినిధులతోనే..

సీఎం కేసీఆర్ పర్యటన దృష్ట్యా మల్లన్న సాగర్ రిజర్వాయర్ చుట్టు పక్కల ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. నిర్వాసితులు అడ్డుకుంటారనే అనుమానంతో బహిరంగ సభకు బదులు జిల్లా ప్రజా ప్రతినిధుల సమావేశానికే కార్యక్రమాన్ని పరిమితం చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లాలోని రెండు వేల మంది ప్రజా ప్రతినిధులను ఆహ్వానించారు. జిల్లాలోని సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, రైతు సమన్వయ సమితి సభ్యులు, కో ఆప్షన్ మెంబర్లతోపాటు మున్సిపల్ కౌన్సిలర్లకు ఆహ్వానాలు పంపారు. మహిళా ప్రజాప్రతినిధులతో పాటు వారి భర్తలను సమావేశానికి అనుమతించే విధంగా పాస్ లు జారీ చేశారు. ఆఫీసర్లు, ప్రజాప్రతినిధుల వాహనాల పార్కింగ్​కోసం వేర్వేరు చోట్ల ఐదు స్థలాలను ఏర్పాటు చేశారు. సిద్దిపేట సీపీ శ్వేత ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

అపూర్వ ఘట్టమిది: మంత్రి హరీశ్

తెలంగాణ చరిత్రలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రారంభం అపూర్వ ఘట్టమని మంత్రి హరీశ్​రావు అన్నారు. మంగళవారం రాత్రి తొగుట మండలం తుక్కాపూర్ మల్లన్న సాగర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాట్లు పరిశీలించి మీడియాతో మాట్లాడారు. వందేండ్ల భవిష్యత్తును ఆలోచించి సీఎం కేసీఆర్ తెలంగాణ నడిగడ్డలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను నిర్మించారని గుర్తు చేశారు. నది లేని చోట అతి పెద్ద రిజర్వాయర్ నిర్మించి,15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా నదికే నడక నేర్పారని కొనియాడారు. ప్రతి రోజు 22 వేల క్యూసెక్కుల నీటితో మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను నింపుతామని మంత్రి వెల్లడించారు. మల్లన్న సాగర్ నిర్మాణంతో కూడవెల్లి, హల్దీ, ఘనపూర్ వాగులు జీవనదులుగా మారాయని, నిండు వేసవిలో సైతం గోదావరి జలాలు పరవళ్లు తొక్కిన విషయాన్ని గుర్తు చేశారు.  విద్వేషాలను రెచ్చగొట్టి బీజెపీ రక్తం పారించాలని చూస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం నీళ్లు పారించాలని ఆలోచిస్తున్నారని అన్నారు.