ఏపీ కొత్త లిప్ట్ ఇరిగేషన్ పై కేసీఆర్ అభ్యంతరం

ఏపీ కొత్త లిప్ట్ ఇరిగేషన్ పై కేసీఆర్ అభ్యంతరం
  • కొత్త లిఫ్టు ప్రతిపాదన విభజన చట్టానికి విరుద్ధం
  • అపెక్స్​ కమిటీ ఆమోదం లేకుండా ఎలా చేస్తరు?
  • దానితో పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నష్టం
  • కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేస్తం.. సుప్రీంకోర్టుకు వెళ్తం
  • రెండు టీఎంసీల కెపాసిటీతో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు వేగంగా పూర్తిచేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగుపోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు, శ్రీశైలం నుంచి కృష్ణానీటిని తరలించుకుపోయేలా ఏపీ చేపడుతున్న కొత్త లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్​ స్పందించారు. ఏపీ సర్కారు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేసే కొత్త పథకం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని, అది రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దానిని అడ్డుకోవడానికి అన్నిరకాలుగా ప్రయత్నం చేస్తామని, న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఏపీ సర్కారు నిర్ణయంపై వెంటనే కృష్ణాబోర్డులో ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని లిఫ్ట్​చేసి, తరలించుకునేలా ఏపీ సర్కారు కొత్త ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం కేసీఆర్​ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఏపీ సర్కారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఏపీ తీరు చట్ట విరుద్ధం

రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలంటే తొలుత అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని విభజన చట్టం స్పష్టంగా పేర్కొన్నదని సీఎం కేసీఆర్​ చెప్పారు. కానీ ఏపీ అపెక్స్ కమిటీ ఆమోదం తీసుకోలేదన్నారు.  ‘‘శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ, ఏపీల ఉమ్మడి ప్రాజెక్టు. అందులోని నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కనీసం సంప్రదించకుండా ఏపీ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని లిఫ్టు చేయాలని నిర్ణయించి, జీవో జారీ చేసింది. ఇది తీవ్ర అభ్యంతకరం.కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీటి సమస్య ఏర్పడుతుంది. ఆ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని వెంటనే కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేస్తాం’’అని కేసీఆర్ స్పష్టం చేశారు.

నేనే చొరవ చూపించిన

గతంలో ఉన్న వివాదాలను, విభేదాలను పక్కనపెట్టి ఇరు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా ఏపీకి స్నేహహస్తం అందించామని సీఎం కేసీఆర్​ చెప్పారు. ‘‘నదీ బేసిన్లు, భేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించిన. అయినా ఏపీ సర్కారు కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి కొత్త పథకం ప్రకటించడం అత్యంత బాధాకరం. పరస్పర సహకారంతో నీటిని వాడుకుందామనే స్ఫూర్తికి ఇది విఘాతం. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీపడే ప్రసక్తే లేదు. ఏపీ తలపెట్టిన కొత్త ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరడమే లక్ష్యంగా న్యాయ పోరాటం చేస్తం’’అని పేర్కొన్నారు. కృష్ణా నదిలో రాష్ట్రాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్ ట్రిబ్యునల్ లో చాలా జాప్యం జరుగుతున్నందున.. సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఒక్కరోజే 79 కరోనా కేసులు..ఇదే హయ్యెస్ట్