డిగ్రీ ఫైన‌లియ‌ర్ ఎగ్జామ్స్ త‌ప్ప‌నిస‌రి నిబంధ‌న వెన‌క్కి తీసుకోండి: మోడీకి పంజాబ్, బెంగాల్ సీఎంల లేఖ‌

డిగ్రీ ఫైన‌లియ‌ర్ ఎగ్జామ్స్ త‌ప్ప‌నిస‌రి నిబంధ‌న వెన‌క్కి తీసుకోండి: మోడీకి పంజాబ్, బెంగాల్ సీఎంల లేఖ‌

డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్యా కోర్సుల ఫైన‌లియ‌ర్ ఎగ్జామ్స్‌ను త‌ప్ప‌నిస‌రిగా నిర్వ‌హించాల‌న్న‌ యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ప‌శ్చిమ బెంగాల్ సీఎం మమ‌తా బెన‌ర్జీ డిమాండ్ చేశారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ ప‌రీక్ష‌ల‌ను సెప్టెంబ‌ర్ చివ‌రిలోపు పెట్టాల‌ని ఇటీవ‌లే ఉత్త‌ర్వులు జారీ చేసిన నేప‌థ్యంలో దాన్ని వ్య‌తిరేకిస్తూ ప్ర‌ధాని మోడీకి ఆమె లేఖ రాశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌ల‌గ‌జేసుకుని ప‌రీక్ష‌ల త‌ప్ప‌నిస‌రి నిర్వ‌హ‌ణ నిబంధ‌న‌ను వెన‌క్కి తీసుకునేలా కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ‌, యూజీసీకి ఆదేశాలివ్వాల‌ని కోరారు. కాలేజీలు, యూనివ‌ర్సిటీల నుంచి ప‌లువురు అధ్యాప‌కులు, విద్యార్థుల నుంచి త‌న‌కు వంద‌లాది ఈ-మెయిల్స్ వ‌స్తున్నాయ‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ వ‌ద్ద‌ని కోరుతున్నార‌ని మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. వారి అభ్య‌ర్థ‌న‌ల మేర‌కు తాను ప్ర‌ధానికి లేఖ రాస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు భారీ సంఖ్య‌లో పెరుగుతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ అంటే విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్ర‌మాదంలోకి నెట్ట‌డ‌మేన‌ని అన్నారామె. ఈ నేప‌థ్యంలోనే జూన్ 27న ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్ర ప‌రిధిలోని అన్ని యూనివ‌ర్సిటీలు, కాలేజీల్లోని విద్యార్థుల‌కు ఇంటర్న‌ల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చి ప్ర‌మోట్ చేయాల‌ని అడ్వైజ‌రీ జారీ చేశామ‌ని మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు రోజు రోజుకీ భారీగా పెరుగుతూనే పోతున్న నేప‌థ్యంలో ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి చేస్తూ ఈ నెల‌లో జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని, ఎగ్జామ్స్ పెట్టుకునే విష‌యంలో సూచ‌న మాత్ర‌మే చేస్తూ ఏప్రిల్ 29న విడుద‌ల చేసిన గైడ్‌లైన్స్‌ను పున‌రుద్ద‌రించాల‌ని ప్ర‌ధాని మోడీని కోరారామె. ఇది విష‌యాన్ని ప్ర‌తిపాదిస్తూ ప్ర‌ధాని మోడీకి పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ కూడా ఈ రోజు లేఖ రాశారు.