
తమిళనాడులో పాలసేకరణ అంశం రచ్చకెక్కింది. తమిళనాడులో అమూల్ వర్సెస్ ఆవిన్ అన్న చందంగా మారింది. తమిళనాడు రాష్ట్ర సహకార సంస్థ అయిన ఆవిన్ పాల సమాఖ్య నుంచి అమూల్ సంస్థ పాలను సేకరించకుండా ఆపాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. ఆవిన్‌కు పాలు సరఫరా చేసే కేంద్రాల నుంచి అమూల్ సంస్థ పాలను సేకరించడం నిలిపివేయాలని లేఖలో కోరారు.
గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థ.. తమిళనాడుకు చెందిన ఆవిన్ డైయిరీ నుంచి పాలను సేకరిస్తోంది. అయితే రాష్ట్రానికి చెందిన ఆవిన్ నుంచి పాల సేకరణను ఆపేయాలని అమూల్ సంస్థను సీఎం స్టాలిన్ కోరారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ట్విట్టర్‌లో ఈ లేఖను స్టాలిన్ పోస్టు చేశారు.
ఏం రాశారంటే..
తమిళనాడు వేలూరులోని కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం అమూల్, కృష్ణగిరి జిల్లాలో శీతలీకరణ కేంద్రాలు, ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిందని..అందుకు వారు మల్టీస్టేట్ కోఆపరేటివ్ లైసెన్స్‌ను ఉపయోగించినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం స్టాలిన్ లేఖలో తెలిపారు. దీని వల్ల తమిళనాడులోని కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, రాణిపేట, తిరుపత్తూరు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని రైతులు, స్వయం సహాయక సంఘాల నుంచి పాలను సేకరిస్తున్నారని చెప్పారు. ఇది క్రాస్-ప్రొక్యూర్‌మెంట్ ‘ఆపరేషన్ వైట్ ఫ్లడ్’ స్ఫూర్తికి విరుద్ధమని లేఖలో తెలిపారు. ఆ ప్రక్రియను ఆపేయాలని సీఎం స్టాలిన్ తన లేఖలో మంత్రి అమిత్ షాను కోరారు.
అమూల్ ఆధారపడటమేంటి..
ఒక సహకారం సంఘం అవిన్ పై మరో సహకార సంఘం అమూల్ ఆధారపడరాదని..దేశంలో ఉన్న విధానాన్ని పాటించాలని అమూల్ ను స్టాలిన్ కోరారు. అక్రమంగా పాలను సేకరించడం కరెక్ట్ కాదన్నారు. అవిన్ డెయిరీ సంస్థకు పాలను సరఫరా చేసేవారిపై అమూల్ ఆధారపడడం సహకార స్పూర్తిని దెబ్బతీస్తుందని స్టాలిన్ తెలిపారు.
అమూల్ యొక్క చర్య.. పాలు, పాల ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్‌లో నిమగ్నమైన సహకార సంఘాల మధ్య అనారోగ్య పోటీని సృష్టిస్తుందని సీఎం స్టాలిన్ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రాలలో పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రాంతీయ సహకార సంఘాలు పునాదిగా ఉన్నాయన్నారు. పాడి రైతులను ప్రోత్సహించడానికి, వినియోగదారులను ధరల పెంపుదల నుండి రక్షించడానికి ఈ సంఘాలు ముఖ్యభూమిక పోషిస్తున్నాయని చెప్పారు. కానీ అమూల్ యొక్క ఈ చర్య దశాబ్దాలుగా నిజమైన సహకార స్ఫూర్తితో పెంపొందించబడిన ఆవిన్ పాలసమాఖ్య ప్రయోజనాలను ఉల్లంఘిస్తుందని అన్నారు. అమూల్ అక్రమ పాలు సేకరణ వల్ల సహకార సంఘాల్లో పోటీతత్వం తగ్గిపోతుందన్నారు. తక్షణమే అముల్ సంస్థ పాల సేకరణ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని సీఎం స్టాలిన్ తన లేఖలో అమిత్ షాను కోరారు.