మణిపూర్‌‌ అల్లర్లలో విదేశీ హస్తం : సీఎం ఎన్ బీరేన్ సింగ్

మణిపూర్‌‌ అల్లర్లలో విదేశీ హస్తం : సీఎం ఎన్ బీరేన్ సింగ్
  •     ముందుగానే ప్లాన్ చేసి హింసకు పాల్పడ్డరు
  •     సీఎం బీరేన్ సింగ్ ప్రకటన
  •     శాంతి కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని వెల్లడి

ఇంఫాల్ : మణిపూర్‌‌లో రెండు నెలలుగా జరుగుతున్న హింసపై సీఎం ఎన్.బీరేన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లర్ల వెనుక విదేశీ హస్తం ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మైతీ, కుకీ కమ్యూనిటీల మధ్య ఘర్షణలకు ముందస్తుగా ప్లాన్ చేసినట్లుగా ఉందని అన్నారు. ‘‘మయన్మార్‌‌తో మణిపూర్‌ సరిహద్దులను పంచుకుంటున్నది. చైనా కూడా దగ్గర్లోనే ఉంది. 398 కిలోమీటర్ల మేర బార్డర్లు రాళ్లు రప్పలతో, కొండలతో నిండి ఉన్నాయి. అక్కడ ఎలాంటి కాపలా ఉండదు. మన సరిహద్దుల్లో భద్రతా బలగాలు మోహరించాం. 

కానీ పటిష్టమైన, విస్తృతమైన భద్రత ఏర్పాటు కూడా.. పూర్తి ప్రాంతాన్ని కవర్ చేయదు. జరుగుతున్న దాన్ని ఖండించలేం, ధ్రువీకరించలేం. కానీ ఇది ప్రీ ప్లాన్డ్‌గా చేసినట్లు కనిపిస్తున్నది. కారణం ఏంటనేది స్పష్టంగా తెలియడం లేదు” అని బీరేన్ సింగ్ చెప్పారు. శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని తెలిపారు. కుకీ సోదర సోదరీమణులతో తాను ఫోన్‌లో మాట్లాడానని, ‘క్షమించండి, మరిచిపోండి’ అని కోరానని వివరించారు.

రాజకీయ అజెండాతోనే రాహుల్ వచ్చిండు

రాహుల్‌ గాంధీ పర్యటనపై బీరేన్ సింగ్ స్పందిస్తూ.. రాజకీయ అజెండాతోనే ఆయన మణిపూర్‌‌ వచ్చారని విమర్శించారు. ‘‘మేం ఎవరినీ ఆపలేము. కానీ ఆయన వచ్చిన సమయమే సరి కాదు. ఇంతకుముందు ఎందుకు రాలేదు? ఆయన కాంగ్రెస్ నాయకుడు.. కానీ ఏ హోదాలో వచ్చారు? రాజకీయ అజెండాతోనే వచ్చినట్లు అనిపిస్తున్నది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కోసమా? పొలిటికల్ మైలేజ్ కోసమా? ఎందుకు వచ్చారు? ఆయన వచ్చిన పద్ధతిని నేను సమర్థించను” అని మండిపడ్డారు. 

చైనా హస్తం ఉంది: సంజయ్ రౌత్

మణిపూర్‌‌ హింస వెనుక చైనా హస్తం ఉందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ విషయంలో చైనాపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కేంద్రంలో, మణిపూర్‌‌లో బీజేపీనే అధికారంలో ఉంది. మరి హింసకు ముందస్తుగా ప్లాన్‌ చేసిందెవరు? 40 రోజులకు పైగా హింస కొనసాగుతున్నది. ప్రజలు ఇండ్లు వదిలి రిలీఫ్ క్యాంపుల్లో ఉంటున్నారు. ఈ హింసలో ఇన్వాల్వ్‌ అయిన చైనాపై ఏం చర్యలు తీసుకున్నారు?” అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.