2015లో బీజేపీని నేనే గెలిపించా.. 2024లో నా సత్తా చూపిస్తా

2015లో బీజేపీని నేనే గెలిపించా.. 2024లో నా సత్తా చూపిస్తా

బీహార్ అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం నెగ్గింది. 243మంది సభ్యులు గల బీహార్ అసెంబ్లీలో నితీష్ కు మద్ధతుగా 160 ఓట్లొచ్చాయి. బలపరీక్ష సందర్భంగా సీఎం నితీష్ కుమార్ ప్రసంగిస్తుండగా.. బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు.  

బలపరీక్ష సందర్భంగా బీజేపీపై నితీష్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. మొన్నటి ఎన్నికల గురించి మాత్రమే బీజేపీ మాట్లాడుతోందని.. 2015లో ఆ పార్టీని తానే గెలిపించానని చెప్పారు. 2024లో తానేంటో నిరూపిస్తానని నితీష్ ఛాలెంజ్ చేశారు. వాజ్ పేయి, అద్వానీ లాంటి వారు తనను ఎంతో గౌరవంగా చూసేశారని.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. మార్పు కోసం అందరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 

కాగా బలపరీక్షకు ముందే బీహార్ అసెంబ్లీ స్పీకర్ పదవికి విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేశారు.  సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాఘట్బందన్‌ ప్రభుత్వం.. విజయ్ కుమార్ సిన్హా పై ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానం అస్పష్టంగా ఉందని.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని సిన్హా కొద్దిరోజుల క్రితం తేల్చి చెప్పారు. అయితే  అవిశ్వాస తీర్మానంపై ఇవాళ అసెంబ్లీలో సిన్హా  ప్రసంగిస్తూ.. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.