
- గత ప్రభుత్వంలో కోదాడ నియోజకవర్గానికి మంజూరైన చెక్కుల పంపిణీలో అవకతవకలు
- నకిలీ పేర్లతో డబ్బులు డ్రా చేసుకున్న మాజీ ఎమ్మెల్యే పీఏ, బీఆర్‌ఎస్ లీడర్లు
కోదాడ, వెలుగు : బీఆర్‌ఎస్ హయాంలో సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అప్పటి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పీఏగా చెప్పుకున్న ఓ వ్యక్తితో పాటు మరికొందరు బీఆర్‌ఎస్ లీడర్లు కలిసి ఈ దందాకు తెర లేపినట్లు తెలుస్తోంది.
అసలైన లబ్ధిదారులకు కాకుండా అదే పేరుతో ఉన్న వేరే వ్యక్తులకు చెక్కులను ఇచ్చి.. వారి ద్వారా డబ్బులు డ్రా చేసుకునేవారని సమాచారం. ఈ వ్యవహారంలో సెక్రటేరియట్‌కు చెందిన ఓ ఉద్యోగి ప్రమేయం కూడా ఉందని, చెక్కులు మంజూరు అయ్యే సమయంలో సదరు ఉద్యోగి లబ్ధిదారుల వివరాలను స్థానిక లీడర్లకు చేరవేసేవాడని తెలిసింది.
100కు పైగా చెక్కులు డ్రా ?
సెక్రటేరియట్ ఉద్యోగి నుంచి వివరాలు తెలుసుకున్న స్థానిక లీడర్లు అసలు లబ్ధిదారుల పేర్లు, ఇంటి పేర్లతో సరిపోయే వ్యక్తులను వెతికి పట్టుకునే వారు. వారికి కొంత డబ్బు ఇస్తామని ఆశ చూపించి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఇచ్చేవారు. తర్వాత వాటిని డ్రా చేయించి తలా కొంత పంచుకునేవారు. ఇలా సింగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేరిట మంజూరైన చెక్కును ఏపీలోని జగ్గయ్యపేట మండలం బూడవాడకు చెందిన వ్యక్తికి ఇచ్చి డ్రా చేయించుకున్నట్లు తెలిసింది.
ఇలా 2020 నుంచి 100కు పైగా చెక్కులు డ్రా చేసుకున్నారని, ఈ చెక్కుల విలువ రూ. 1.50 కోట్లపైగా ఉన్నట్లు చర్చ నడుస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు వచ్చి అడిగితే.. చెక్కులు ఇంకా రాలేదు.. త్వరలోనే వస్తాయని సమాధానం చెప్పి పంపించేవారు.
క్యాంప్ ఆఫీస్‌లో ఫిర్యాదుతో వెలుగులోకి...
సీఎంఆర్‌ఎఫ్ కోసం అప్లై చేసుకున్నా చెక్కులు రాని వారు ఇటీవల ఎమ్మెల్యే పద్మావతికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఎంక్వైరీ చేయగా చెక్కుల గోల్‌మాల్ విషయం బయటపడింది. ఇప్పటివరకు ఎన్ని చెక్కులు డ్రా చేశారు ? ఎంత సొమ్ము స్వాహా చేశారన్న విషయంపై వివరాలు సేకరిస్తున్నారు. సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల గోల్‌మాల్ విషయం బయటకు పొక్కడంతో అప్లికేషన్ చేసుకున్న వారు క్యాంప్ ఆఫీస్‌కు క్యూ కడుతున్నారు. ఈ వ్యవహారంపై ఎంక్వైరీ ప్రారంభించిన పోలీసులు ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.