బీజేపీ, బీఆర్ఎస్ క‌‌లిసి నన్ను టార్గెట్ చేసినయ్.. మీనాక్షి అంశంలో తెలంగాణ కాంగ్రెస్ ను ముద్దాయిని చేసే కుట్ర: సీఎం రేవంత్

బీజేపీ, బీఆర్ఎస్ క‌‌లిసి నన్ను టార్గెట్ చేసినయ్.. మీనాక్షి అంశంలో తెలంగాణ కాంగ్రెస్ ను ముద్దాయిని చేసే కుట్ర: సీఎం రేవంత్
  • మీనాక్షి అంశంలో తెలంగాణ కాంగ్రెస్​ ను ముద్దాయిని చేసే కుట్ర: సీఎం రేవంత్​
  • ఆర్వోను బీజేపీ వెప‌‌న్​లా వాడుకున్నది 
  • ఆ పార్టీ అంత‌‌ర్గత రాజ‌‌కీయాల‌‌కు తెలంగాణ‌‌ను బ‌‌లి తీసుకుంటున్నరు
  • రాష్ట్రానికి ఏ ప్రాజెక్టూ రాకుండా కిష‌‌న్ రెడ్డి అడ్డుకుంటున్నరు
  • చేత‌‌కాక‌‌పోతే ఆయ‌‌న రాజీనామా చేయాలి
  • ప‌‌వ‌‌న్ రావొచ్చు.. పోవ‌‌చ్చు.. రాజకీయం చేయొచ్చు
  • కానీ తెలంగాణ‌‌కు వ్యతిరేకంగా మాట్లాడితే స‌‌హించ‌‌రు 
  • దేశ భ‌‌విష్యత్​కు హైద‌‌రాబాదే కీల‌‌కం
  • బీజేపీది ‘గాంధీ వర్సెస్ కిమ్’ సిద్ధాంతం 
  • ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ ​చిట్​చాట్​

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ క‌‌లిసి తనను టార్గెట్ చేశాయ‌‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీల‌‌ నేతలకు తాను ఉమ్మడి ప్రత్యర్థిని అని, అందుకే త‌‌న‌‌పై మాట‌‌ల యుద్ధం చేస్తున్నార‌‌ని విమ‌‌ర్శించారు. ప్రధానంగా సీట్​చోరీని పక్కదారి పట్టించేందుకే ఇరుపార్టీలు క‌‌లిసి ఉమ్మడి దాడికి దిగాయ‌‌న్నారు. 

కాంగ్రెస్ తెలంగాణ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు అంశంలో రాష్ట్ర కాంగ్రెస్​ను ముద్దాయిని చేయాలని కుట్రలు పన్నారని ఆరోపించారు. బీజేపీలోని అంతర్గత రాజకీయాలతో తెలంగాణను బలి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ కౌన్సిల్ మీటింగ్​లో పాల్గొనేందుకు ఢిల్లీ వ‌‌చ్చిన సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం తుగ్లక్ రోడ్​లోని  త‌‌న అధికారిక నివాసంలో మీడియాతో చిట్ చాట్ చేశారు.  

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్​ను అక్రమంగా తిరస్కరించడం ద్వారా బీజేపీ ప్రజాస్వామ్య, మహిళా వ్యతిరేకిగా నిరూపించుకుందని సీఎం అన్నారు. గాంధేయ వాది అయిన ఆమెను రాజ్యసభలో అడుగు పెట్టకుండా చేయడం ద్వారా దేశంలో గాంధేయ సిద్దాంతాన్నే అంతం చేయాలన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందని ఆరోపించారు. 

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాస్తూ, ప్రతిపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా ఆ పార్టీ ముందుకు సాగుతోందన్నారు. బీజేపీకి ఒక్క ఓటు కూడా లేనిచోట రాజ్యసభ స్థానాన్ని ఎలా కట్టబెడతార‌‌ని ప్రశ్నించారు. ఇందుకోసం ఆర్వోను బీజేపీ ఒక వెపన్‌‌లా వాడుకుంద‌‌ని ఆరోపించారు. ఈ వ్యవ‌‌హారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌‌తో ఆర్వో కుమ్మక్కయ్యార‌‌ంటూ సీఎం తీవ్ర ఆరోప‌‌ణ‌‌లు చేశారు. ‘రంకు నేర్చినోడు.. బొంకు నేర్చిండంట’.. అన్నట్లు బీజేపీ వ్యవహారం ఉంద‌‌న్నారు. ఈ వ్యవ‌‌హారంలో తప్పు చేశార‌‌ని.. దానిని కప్పి పుచ్చుకునేందుకు నానా అవస్థలు పడుతూ త‌‌ప్పించుకునేందుకు కాంగ్రెస్​పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 

ఈ అక్రమాలపై పార్టీ, తాను న్యాయపోరాటం చేస్తామన్నారు. ‘‘ఎలక్షన్ పిటిషన్‌‌పై విచారణను 6 నెలల్లో ముగించాలనే నియమం ఉంది. సుప్రీంకోర్టు ప్రొసీజర్ ఏమిటో చెప్పింది.. ఎలక్షన్ పిటిషన్ వేయమని సూచించింది. అంతేతప్ప.. రిటర్నింగ్ అధికారి చేసింది ఒప్పేనని చెప్పలేదు కదా! 75 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇంత అడ్డగోలుగా వ్యవ‌‌హ‌‌రించిన తీరు చూడ‌‌లే. ఇది ప్రజాస్వామ్యానికే తలవంపు. కోర్టులపై మాకు నమ్మకం ఉంది. ఎలక్షన్ పిటిషన్‌‌లో మేం తప్పకుండా విజయం సాధిస్తాం’’  అని సీఎం ధీమా వ్యక్తం చేశారు. 

మోదీకి నోటీసులిస్తే అఫిడవిట్‌‌లో చూపుతరా?

‘ప్రధాని మోదీపై దేశవ్యాప్తంగా 1,000 ప్రైవేట్ ఫిర్యాదులు నమోదైతే, వాటిపై కోర్టు నోటీసులిస్తే.. మోదీ తన అఫిడవిట్‌‌లో ఆ 1,000 నోటీసుల వివరాలు పొందుపరుస్తారా?’ అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. గాంధేయవాది  అయిన మీనాక్షీ నటరాజన్ ను పార్లమెంట్‌‌లో అడుగు పెట్టకుండా చేయడానికే బీజేపీ ఈ కుట్రకు తెర‌‌తీసింద‌‌న్నారు. 2022లో శ్రీలత, శ్రీనివాస్ రెడ్డి మధ్య జరిగిన పంచాయితీకి, 2025లో పార్టీ ఇన్​చార్జిగా వచ్చిన మీనాక్షీ నటరాజన్‌‌కు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. 

‘‘అసలు ఎఫ్‌‌ఐఆర్ లేదు, చార్జిషీట్ లేదు, అసలు కేసే లేదు. అలాంటప్పుడు ఎలక్షన్ అఫిడవిట్‌‌లో ఏమని మెన్షన్ చేయాలి? నోటీసులు ఇచ్చినా అఫిడవిట్‌‌లో మెన్షన్ చేయాలనే అంశమే ఫారమ్‌‌లో లేదు. ఎవరు ఎవరిపై ప్రైవేట్ కంప్లయింట్ ఇచ్చినా కోర్టు నోటీసులు ఇష్యూ చేస్తుంది. వివరణ విన్నాక నిర్ణయిస్తుంది’’ అని సీఎం పేర్కొన్నారు.   

బీజేపీది ‘గాంధీ వర్సెస్ కిమ్’ సిద్ధాంతం 

మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేని అధిగమించి ఇప్పుడు బీజేపీ ఉత్తర కొరియా నియంత కిమ్ ను ఆదర్శంగా తీసుకుంటోందని సీఎం రేవంత్ విమ‌‌ర్శించారు. ‘‘ఓటు చోరీ నుంచి సీటు చోరీ వరకూ’’ ఆ పార్టీ  దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు. ‘‘ఉత్తర కొరియాలోనూ ఎన్నికలు ఉంటాయి. ప్రజలు ఓట్లు వేస్తారు. కానీ, పోలింగ్ బూత్‌‌లో కిమ్ పార్టీకి సంబంధించిన బటన్ మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలోనూ అటువంటి దుస్థితే ఏర్పడింది.

ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా, ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ, కేవలం గెలుపు కోసం ఎంతకైనా తెగించే విధానాలను బీజేపీ అవలంబిస్తోంది. బీజేపీకి కిమ్ జోంగ్ ఉన్ ఆదర్శంగా మారారు. ఇంతకాలం దేశంలో గాంధీ వర్సెస్ గాడ్సే విధానం నడిచింది. కానీ, ఇప్పుడు బీజేపీ ‘గాంధీ వర్సెస్ కిమ్’ సిద్ధాంతం ప్రకారం నడుస్తోంది. దేశంలో గాంధీ ఐడియాలజీని చంపాలనే ఉద్దేశంతో బీజేపీ, ఆర్‌‌ఎస్‌‌ఎస్ పనిచేస్తున్నాయి’’ అని సీఎం మండిప‌‌డ్డారు.  

రాష్ట్ర ప్రాజెక్టులను కిషన్ రెడ్డి, కేసీఆర్ అడ్డుకుంటున్నరు.. 

బీజేపీ అంతర్గత కుమ్ములాటల వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని సీఎం ఆరోపించారు. ‘మెట్రో వస్తే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌‌కు పేరు వస్తుందని కిషన్‌‌రెడ్డి ఆపుతున్నారు. ఈటలకు వ్యతిరేకంగా బ్యానర్లు వేసింది కిషన్‌‌రెడ్డి అనుచరులే కదా?’ అని ప్రశ్నించారు. 2023లో ప్రధాని మోదీ స్వయంగా మెట్రో రెండోదశ ప్రాజెక్టును ప్రకటించార‌‌ని, కానీ ఇవ్వలేద‌‌న్నారు. రాష్ట్ర ప్రాజెక్ట్ ల‌‌పై తాను కేంద్రంలో ఎవరిని కలిసినా.. ఆ తర్వాత కిషన్ రెడ్డి అక్కడికి వెళ్లి అడ్డుప‌‌డుతున్నార‌‌ని ఆరోపించారు. 

ఈ విషయం స్వయంగా కిషన్ రెడ్డి ఎవరికైతే చెప్పారో.. వాళ్లే తనకు చెప్పారన్నారు. ‘‘అంతెందుకు తానే ప్రాజెక్టులు ఆపించానని కేటీఆరే స్వయంగా అంగీకరించారు కదా! కేసీఆర్‌‌ చెప్పినట్లుగా కిషన్‌‌రెడ్డి ఆడుతున్నారు. ఐఆర్‌‌ఎఫ్‌‌సీకి లోన్‌‌ ఎందుకు ఇవ్వడంలేదు? 30వ తేదీ రావాల్సిన ఆ డబ్బులు ఎందుకు రాలేదు? ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ లో 320 కిలోమీటర్ల టెండర్ల ప్రక్రియ ఎందుకు లేట్​ అవుతోంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. కేంద్రమంత్రిగా సీఎం ఫడ్నవీస్‌‌తో మాట్లాడి 1500 ఎకరాలు ఇప్పించలేడా? పోలవరం కోసం ఏడు మండలాలను ఎవరిని అడిగి ఇచ్చారు. 

భూమి, మనుషులతోపాటు సగం అసెంబ్లీ నియోజకవర్గంను ఏపీలో కలిపారు. మేం అడుగుతున్న మెట్రో, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు కిషన్‌‌రెడ్డి పార్లమెంట్‌‌ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. వీటిపై ఆయన ప్రధాని మోదీని ఎందుకు అడగడంలేదు. ప్రధానికి కిషన్‌‌రెడ్డి ఎన్ని లేఖలు రాశారో చెప్పాలి. తెలంగాణ సమస్యలపై కేంద్ర మంత్రులను కలిసేందుకు వెళ్లినప్పుడు నన్నుకూడా తీసుకెళ్లమని చెప్పండి. ఈ సమస్యలన్నీ పరిష్కరించే వరకు మంత్రివర్గం సమావేశానికి హాజరు కానని చెప్పమనండి. కిషన్‌‌రెడ్డి సహా.. మొత్తం 8 మంది ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తే తెలంగాణ ప్రాజెక్టులు పరిగెత్తుకుంటూ వస్తాయి కదా?”అని సీఎం అన్నారు.  

సీఎం విజయ్, నేను మాట్లాడుకున్నాం..

నీతి ఆయోగ్ మీటింగ్​లో త‌‌మిళ‌‌నాడు సీఎం విజ‌‌య్, త‌‌న మ‌‌ధ్య కుశ‌‌ల ప్రశ్నల సంభాష‌‌ణ జ‌‌రిగింద‌‌న్నారు. త‌‌మిళ‌‌నాడుతో తెలంగాణ‌‌కు ఎలాంటి ఇబ్బందులు లేవ‌‌న్నారు. తాను సీనియ‌‌ర్ కాబ‌‌ట్టే విజ‌‌య్ త‌‌న ప‌‌క్కన కూర్చున్నారు త‌‌ప్ప.. తాను విజ‌‌య్ ప‌‌క్కన కూర్చోలేద‌‌ని.. ఈ సంద‌‌ర్భంగా విజ‌‌య్​కి మ‌‌రోసారి అభినంద‌‌న‌‌లు తెలిపాన‌‌న్నారు. అయితే, ప్రధాని మోదీ మాత్రం త‌‌న చేయి ప‌‌ట్టుకొని.. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలుగా స‌‌హ‌‌క‌‌రిస్తామ‌‌ని హామీ ఇచ్చార‌‌ని చెప్పారు. 

జ‌‌ర్నలిస్టుల ఇండ్ల స్థలాల‌‌ను వెంటనే ఆమోదిస్తాం..  

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఉన్నామ‌‌ని సీఎం రేవంత్ తెలిపారు. దీనిపై ఇప్పటికే కేబినెట్‌‌ సబ్‌‌ కమిటీ వేశామ‌‌ని గుర్తు చేశారు. ఎలాంటి సమస్య ఉన్నా మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌‌ కుమార్‌‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌‌ బాబు దృష్టికి తీసుకురావాల‌‌ని జ‌‌ర్నలిస్ట్ సంఘాల‌‌కు సూచించారు. ‘సబ్‌‌ కమిటీని ఒకే చోట కూర్చోబెట్టి ఆ సిఫార్సులను తీసుకువస్తే టీ తాగేలోపు మినిట్స్‌‌ రాసి, కేబినెట్‌‌లో ఆమోదిస్తాం. 

సోసైటీ పేరుతో కాకుండా ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇస్తాం. వ్యక్తిగతంగా ఇస్తాం కాబట్టి.. ఈ ఇళ్ల స్థలాలపై పిటిషన్‌‌ వేయాల్సి వస్తే ఒక్కొక్కరి పేరు మీద వేయాలి. అది సాధ్యం కాదు. భవిష్యత్తులో ఆ ఇళ్ల స్థలాలపై సమస్యలు రాకూడదన్నదే మా ప్రయత్నం’ అని సీఎం క్లారిటీ ఇచ్చారు.  

దేశ భవిష్యత్తుకు హైదరాబాదే కీల‌‌కం.. 

దేశంలో ఆరు మెట్రోపాలిటన్ సిటీలు ఉన్నాయని, దేశ జీడీపీలో వీటి పాత్ర ముఖ్యమైంద‌‌ని సీఎం రేవంత్ అన్నారు. ‘‘ఢిల్లీలో కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. స్వయంగా సీజేఐనే కోర్టులకు సెలవులు ఇచ్చిన ప‌‌రిస్థితులు చూశాం. చిన్న వర్షం కురిసినా ముంబై అత‌‌లాకుత‌‌లం అవుతోంది. బెంగళూరులో తీవ్ర ట్రాఫిక్ స‌‌మ‌‌స్యను ఎదుర్కొంటున్నారు. కోల్‌‌కతా పరిస్థితి అందరికీ తెలిసిందే.. ఇక చెన్నై సముద్రతీరంలో ముంపు ముప్పుతో ఉంటుంది.  

వాతావరణ పరిస్థితులు, శాంతిభద్రతల పరంగా దేశ భవిష్యత్తుకు హైదరాబాద్ ఎంతో ముఖ్యం, ఉత్తమం. అందుకే హైదరాబాద్‌‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అభివృద్ధికి సహకరించాలని పీఎంను కోరాను’’ అని ఆయన వివరించారు. అలాగే, ‘ఫోర్త్ సిటీ’లోనే స్కిల్ యూనివర్సిటీ సహా అన్ని కీలక విభాగాలు ఉంటాయని తెలిపారు. బాలానగర్‌‌లోని పరిశ్రమలకు మాత్రం ఫోర్త్ సిటీలో కాకుండా.. అక్కడి స్థానిక పరిస్థితులకు తగ్గట్లుగా వేరేచోటకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 

ఇకపోతే, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం ఇప్పటికే కమిటీలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. చెరువులను రక్షించేందుకే కబ్జా చేసినోళ్లను ఖాళీ చేపిస్తుంటేనే ఎన్నో మాటలు పడాల్సి వస్తోందని, ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల అంశంలోకి వెళితే ఇంకెలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని అన్నారు.

తెలంగాణ‌‌కు వ్యతిరేకంగా మాట్లాడితే రెస్పాన్స్ అలాగే ఉంటది.. 

తెలంగాణకు ఎవరైనా రావచ్చు, మాట్లాడవచ్చు, ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని, ఆ హక్కు వారికి ప్రజాస్వా మ్యం కల్పించిందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎంతో మంది రాష్ట్రంలో ఆందోళ‌‌న‌‌లు, ఉద్యమాలు చేస్తు న్నా, ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నా తాము అడ్డుకోవ‌‌డం లేద‌‌న్నారు. ‘‘పవన్ కల్యాణ్ ఎప్పుడైనా తెలంగాణ‌‌కు రావొచ్చు. పోవ‌‌చ్చు. రాజకీయం చేయొచ్చు. కాకపోతే.. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతామంటే, తెలంగాణ  రెస్పాన్స్ అలాగే ఉంటుంది. పవన్ వ్యాఖ్యలకు, మా మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. 

అంతటి తో  ఆ ఎపిసోడ్ క్లోజ్ అయింది. లా అండ్ ఆర్డర్ నేపథ్యంలో అనుమతులు ఇవ్వాలా? వద్దా? అనేది పోలీ సుల ఇష్టం. అందులో నా ప్రమేయం ఏముంటుంది? పవన్ కల్యాణ్‌‌కే ఎందుకు అనుమతి లభించలేదంటే అది పోలీసుల విచ‌‌క్షణాధికారం. ఏపీలో జగన్ మోహన్ రెడ్డికి పవన్ కల్యాణ్ ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? గతంలో బీఆర్‌‌ఎస్ హయాంలో మమ్మల్ని కనీసం ఇంటి నుంచి బయటికే రాకుండా చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి అణచివేత విధానాలను ఫాలో అవ్వదు’’ అని సీఎం స్పష్టం చేశారు. 


హిట్లర్​పై నా వ్యాఖ్యలను వక్రీకరించారు..

హిట్లర్ త‌‌న‌‌కు ఆద‌‌ర్శం అని చెప్పిన‌‌ట్లు విప‌‌క్షాలు అన‌‌వ‌‌స‌‌ర రాద్ధాంతం చేశాయ‌‌ని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అస‌‌లు తాను చెప్పని వ్యాఖ్యల‌‌ను త‌‌న‌‌కు జోడించి.. వ‌‌క్రీక‌‌ర‌‌ణ చేశార‌‌ని చెప్పారు. ‘‘హైడ్రా అనే పదానికి మూలం హిట్లర్ హయాంలోని జర్మనీ నుంచి వచ్చిందని చెప్పాను. నా  వ్యాఖ్యలను వక్రీకరించారు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా హిట్లర్ తమకు ఆదర్శమని చెబుతారా? హిట్లర్‌‌పై నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. కేవలం ‘హైడ్రా’ అనే పదం హిట్లర్ కాలానికి చెందిందని మాత్రమే చెప్పాను. అంతేతప్ప.. నాకు హిట్లరే ఆదర్శం, ఆయనే నా మార్గదర్శి అని నేనెక్కడా అన‌‌లేదు’’ అని సీఎం క్లారిటీ ఇచ్చారు.