
- గతంలో ఉన్న స్టేటస్‌నే మళ్లీ నివేదించడంపై తీవ్ర అసంతృప్తి
- రెండేండ్లలో పూర్తి చేయాల్సిందే
- అలసత్వం ప్రదర్శించొద్దు.. పనితీరు మార్చుకోవాలి
- సీఎంవో, మెడికల్ అండ్ హెల్త్ ఉన్నతాధికారులకు హెచ్చరిక
- పనుల స్పీడప్ కోసం సమన్వయ కమిటీ ఏర్పాటు
- జిల్లాల్లో హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల నిర్మాణాలు
- జూన్ నాటికి పూర్తి చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా కొత్త దవాఖాన నిర్మాణాన్ని రెండేండ్లలో పూర్తి చేయాల్సిందేనని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే మొదలుపెట్టిన పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం, గతంలో రివ్యూ చేసిన సందర్భంగా ఏదైతే స్టేటస్ ఉందో అదే విషయాన్ని మళ్లీ చెప్పేందుకు అధికారులు ప్రయత్నించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘తమాషాలు చేస్తున్నరా? వేగంగా పనులు పూర్తి చేయాలని చెప్తే.. పాత స్టేటస్ పేపర్లనే తీసుకొచ్చి చూపిస్తరా? మరీ ఇంత అలసత్వం ఏమిటి? తీరు మార్చుకోవాలని, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ పనులను పూర్తి చేయాలని చెప్తుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు” అని సీఎంవో, మెడికల్ అండ్ హెల్త్ ఉన్నతాధికారుల వ్యవహార శైలిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఉస్మానియా కొత్త హాస్పిటల్ నిర్మాణంపై బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ సమీక్షించారు. సీఎంవో సెక్రటరీల పనితీరు మారాలని ఆయన హెచ్చరించారు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని పనులను స్పీడప్ చేయాలని స్పష్టం చేశారు. నిధులకు సంబంధించిన అంశాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ఈ అంశాన్ని ఇంతకుముందు ఎందుకు చెప్పలేదని, సమన్వయ లోపంతో ఎందుకు వ్యవహరిస్తున్నారని, ఎప్పటికప్పుడు అన్ని శాఖలతో కలిసి పనులు పూర్తి చేసుకోవాలని ఆయన తేల్చిచెప్పారు.
ప్రణాళికలు రెడీ చేయండి
ఉస్మానియా కొత్త హాస్పిటల్లో అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరికరాలు ఉండాలని, వీటిని సమకూర్చుకోవాలని, తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘‘అధునాతన పరికరాల ఏర్పాటుకు తగ్గట్టు గదులు, ల్యాబ్‌లు, ఇతర నిర్మాణాలు ఉండాలి. హాస్పిటల్ నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలి” అని చెప్పారు.
నిర్మాణ పనుల వేగవంతానికి వైద్యారోగ్య శాఖ, పోలీస్, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రతి పది రోజులకోసారి సమావేశమై, ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటూ పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి హాస్పిటల్ నిర్మాణానికి ఒక ఆఫీసర్
ఉస్మానియా నూతన దవాఖాన నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు, ట్రాఫిక్ విధులకు సంబంధించి ముందస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఉస్మానియాకు వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని ఆర్ అండ్ బీ అధికారులకు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న దవాఖానలు, మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రతి నిర్మాణానికి ఒక అధికారిని నియమించాలని ఆయన ఆదేశించారు.
నిర్మాణాలపై 24 గంటలూ ఆ అధికారి పర్యవేక్షించేలా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలన్నారు. వచ్చే జూన్ నాటికి ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, డీజీపీ శివధర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు వికాస్‌రాజ్, క్రిస్టినా జడ్ జోంగ్తూ, ఇలంబర్తి, ముషారఫ్ అలీ ఫరూఖీ, హరిచందన తదితరులు పాల్గొన్నారు.
ఉస్మానియాలో అధునాతన పరికరాల ఏర్పాటుకు తగ్గట్టు గదులు, ల్యాబ్‌లు, ఇతర నిర్మాణాలు ఉండాలి. హాస్పిటల్ నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలి. ఉస్మానియాకు వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలి.
– సీఎం రేవంత్ రెడ్డి