నిరుద్యోగుల జీవితాలతో ఆటలొద్దు... సీఎం రేవంత్​రెడ్డి

నిరుద్యోగుల జీవితాలతో ఆటలొద్దు... సీఎం రేవంత్​రెడ్డి
  • విద్యార్థుల శవాల మీద బీఆర్​ఎస్​ను బతికించుకోవాలని చూస్తున్నరు: సీఎం రేవంత్​రెడ్డి
  • కేటీఆర్ , హరీశ్​కు దమ్ముంటే ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలి
  • పదేండ్లు నిరుద్యోగులను గోస పుచ్చుకున్నరు
  • మేం వెంటవెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే అడ్డుకుంటున్నరు
  • పోటీ పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్​సెంటర్లే లాభపడ్తయ్
  • అందుకే కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తున్నరు
  • కేసీఆర్​.. నీకు ముందుంది ముసళ్ల పండుగ
  • చేతనైతే రాష్ట్రాభివృద్ధికి సహకరించు.. లేకపోతే ఫామ్​హౌస్​ల పండుకొని ఏడ్వు
  • కాళ్లలో కట్టెపెట్టాలని చూస్తే  వీపులు విమానం మోతేనని హెచ్చరిక

మహబూబ్​నగర్​, వెలుగు: నిరుద్యోగుల భావోద్వేగాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు కేటీఆర్​, హరీశ్​రావు కుట్ర చేస్తున్నారని.. విద్యార్థుల శవాల మీద బీఆర్ఎస్​ పార్టీని బతికించుకోవాలని చూస్తున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘డీఎస్సీని వాయిదా వేయాలని స్టూడెంట్లను రెచ్చగొడ్తున్న  హరీశ్, కేటీఆర్​కు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్​కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగాలి. మిమ్మల్ని ఎవరూ ఆపరు.. మేమే మీకు కాపలా ఇస్తం. ఎన్ని రోజులు దీక్ష చేస్తరో చూద్దాం. మీ బావబామ్మర్దులిద్దరికీ నిజంగా నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే ఆర్ట్స్​ కాలేజీ వద్దకు రండి” అని ఆయన సవాల్​ విసిరారు.

పోటీ పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదని, కానీ లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ఆగమైతాయని, కోచింగ్​ సెంటర్లు లాభపడుతాయని తెలిపారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్​ ముఖ్య కార్యకర్తల సమావేశానికి సీఎం రేవంత్​ చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ‘‘కేసీఆర్ ఎప్పుడు బలహీనపడతడో, పతనం అయితడో అప్పుడు విద్యార్థులను రెచ్చగొడ్తడు. వారిని సావగొట్టి వారి శవాల మీద పార్టీని బతికించుకోవాలనే ప్రయత్నం చేస్తడు.

ఆరు అడుగులు ఉన్న హరీశ్​రావు తెలంగాణ ఉద్యమంలో 100 రూపాయలు పెట్టి పెట్రోల్​ తెచ్చుకున్నడు.. కానీ, పది పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే. ఈయన నాడు డ్రామా ఆడితే అది నిజమని నమ్మిన శ్రీకాంతాచారి లాంటి వందలాది మంది తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసుకున్నరు. కానీ, కేసీఆర్​ కుటుంబంలో ఒక్కరైనా బలిదానం చేసుకున్నరా?’’ అని సీఎం నిలదీశారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్​ నేతలు మళ్లీ అలాంటి యాక్టింగ్​ మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పదేండ్లు నిరుద్యోగులను పట్టించుకోని కేసీఆర్​.. 2022లో డీఎస్సీ నోటిఫికేషన్​ ఇచ్చి ఆ తర్వాత ఎందుకు ఆ పరీక్షలు నిర్వహించలేదని సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. క్యాలెండర్​ డేట్​ ప్రకారం కాంగ్రెస్​ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్​ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే బీఆర్ఎస్ నేతలు  అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.  ‘‘డీఎస్సీ ఎగ్జామ్​ను పోస్టుపోన్​ చేయాలని మోతీలాల్​అనే లంబాడీ బిడ్డను రెచ్చగొట్టి దీక్షకు కూర్చోబెట్టిన్రు. తర్వాత ఒక దళిత వ్యక్తిని కూర్చోబెట్టిన్రు.

ఇప్పుడు మరో కోచింగ్​ సెంటర్​ ఆయన వచ్చి దీక్షలో కూర్చున్నడు. ఎందుకు మోతీలాల్​ కూర్చోవాలె? ఎందుకు జడ్స్​​ కూర్చోవాలె?  నేను హరీశ్​రావు, కేటీఆర్​కు సవాల్​ విసురుతున్నా. మీ ఇద్దరు దీక్షలో కూర్చోండి. మీరు సావనైనా సావాలె. పరీక్షలు వాయిదా అన్నా పడాలె. మీకు ధైర్యం ఉందా? ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్​ కాలేజీ దగ్గరికి రండి. ఆమరణ దీక్షకు కూర్చోండి” అని సీఎం రేవంత్​ అన్నారు. ‘‘ఇప్పటికే నిరుద్యోగులు ఏండ్ల తరబడి హైదరాబాద్ లో ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేర్​ అయిన్రు. ఇంకా కోచింగ్​ సెంటర్లలో వేల రూపాయలు ఫీజులు కట్టాల్సిన పని లేకుండా మా ప్రభుత్వం వెంబడి వెంబడే పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇస్తామంటున్నది.

ఒక వేళ పరీక్ష రాసి ప్రభుత్వఉద్యోగం రానివాళ్లు, ఏదైనా ప్రైవేట్​ జాబ్​ చూసుకొని సెటిలయ్యే అవకాశం ఉంది. ఇందులో తప్పేముంది? మీలాగా(బీఆర్​ఎస్) పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వకుండా ఉంటే పేద పిల్లలు కోచింగ్​ సెంటర్ల  చుట్టూ తిరిగి, ఇంటికి రాలేక, పట్నంలో ఉండలేక అన్ని రకాలుగా దెబ్బతినే ప్రమాదం లేదా?’’ అని సీఎం ప్రశ్నించారు. పోటీ పరీక్షలను పోస్టు పోన్​ చేస్తే నష్టపోయేది విద్యార్థులైతే లాభపడేది కోచింగ్​ సెంటర్లని అన్నారు. ‘‘2022లో నోటిఫికేషన్లు ఇచ్చిన కేసీఆర్​ అప్పుడే ఎందుకు పరీక్షలు పెట్టలేదు. ఈ రెండేండ్లుగా నిరుద్యోగులు చదువుతూనే ఉన్నారు. కోచింగ్​ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాయిదా వేస్తే కోచింగ్​ సెంటర్లు నడుపుకోవచ్చని వాటి నిర్వాహకులు పైరవీలు కూడా చేస్తున్నరు. నిరుద్యోగుల బలహీనతలను వ్యాపారంగా మార్చుకోవాలని కొందరు ఆర్టిఫిషియల్​ ఉద్యమాలను మన కండ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నరు” అని మండిపడ్డారు. 

గ్రూప్​ 1 ఆగిపోవాలని చూస్తున్నరు

‘‘గత బీఆర్​ఎస్ ​ప్రభుత్వం 2022లో గ్రూప్​ వన్​ నోటిఫికేషన్​ ఇచ్చి పరీక్షలు  పెడితే.. ప్రశ్నప్రతాలు లీకై జిరాక్స్​ సెంటర్లు, చౌరస్తాల్లో అమ్ముకున్న పరిస్థితి. దీంతో పరీక్షలు రద్దయ్యాయి. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే గ్రూప్​-1 నోటిఫికేషన్​ ఇచ్చి ప్రిలిమ్స్​ ఎగ్జామ్స్ నిర్వహించినం. 3 లక్షల మంది పరీక్షలు రాస్తే.. 31 వేల మంది మెయిన్స్​కు క్వాలిఫై అయిన్రు.

ఇప్పుడు మెయిన్స్​​ ఎగ్జామ్స్​  పెట్టాలంటే 1:50  రేషియోలో కాకుండా 1:100  పిలవాలని బీఆర్​ఎస్​  అంటున్నది. 1:100 పిలువగానే కోర్టు స్టే ఇస్తదనే దొంగ ఆలోచన చేస్తున్నరు. నోటిఫికేషన్​లో 1:50 ఇచ్చి, పరీక్షలు అయిపోయాక 1:100 ఎలా ఇస్తారని కోర్టు పరీక్షలు రద్దు చేస్తే  పరిస్థితి మళ్లీ మొదటికొస్తది. నిరుద్యోగులు ఆలోచించాలి’’ అని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. 2011 తర్వాత 13 ఏండ్లుగా గ్రూప్​ వన్​ జరగలేదని,  డిసెంబర్​లోగా వెయ్యి మంది ఆఫీసర్లను  చేయాలని తాము ప్రయత్నిస్తుంటే, ఈ దొంగలు పరీక్షలను పోస్టుపోన్ చేయాలని అనుకుంటున్నారని బీఆర్ఎస్​ నేతలపై ఫైర్​ అయ్యారు. 

మోదీ చుట్టూ కేటీఆర్​, హరీశ్​ పిల్లుల్లాగా తిరుగుతున్నరు

అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నెల తిరగక ముందే తమ ప్రభుత్వాన్ని పడగొడ్తామని బీజేపీ, బీఆర్​ఎస్​ నేతలు కామెంట్లు చేశారని, మూడు నెలలు కూడా ఉండనీయమని మాట్లాడారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘ఇప్పుడు ఏమైంది? ఈ భూమి మీద బీఆర్​ఎస్​ ఉండదు. పాతాళానికి పోయింది. కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ (కేసీఆర్​) పార్టీకి పుట్టగతులుండవని ఆ రోజే చెప్పిన. మా పార్టీ కార్యకర్తల ఉసురుతో దుమ్ము కొట్టుకుపోతావ్​. నీకు రాజకీయంగా మనుగడ లేదు.

ఇప్పటికైనా అర్థం చేసుకో. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మేం కష్టపడుతున్నం. తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్​కు అడ్డుపడకుండా శాతనైతే సహకరించు. లేకుంటే ఫామ్​హౌస్​లో పడుకొని ఏడ్వు” అని కేసీఆర్​పై ఫైర్​ అయ్యారు. ప్రజా ప్రభుత్వం కాళ్లలో కట్టే పెట్టడానికి తండ్రీకొడుకు, మామాఅల్లుడు(కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​రావు) చూస్తున్నారని, కాళ్లలో కట్టె పెట్టాలని చూస్తే వీపులు విమానం మోత మోగుతాయని ఆయన హెచ్చరించారు.  ‘‘తన దాక వస్తేగాని తెల్వదన్నట్లుగా ఈ రోజు కేసీఆర్​ దాకా వస్తేగాని తెలుస్తలేదు. నాలుగు రోజులుగా హరీశ్​, కేసీఆర్​ ఢిల్లీలో మోదీ చుట్టూ పిల్లుల్లాగా తిరుగుతున్నరు. ఏదో ఒకటి చేసి తమను ఎట్లయినా కాపాడండని మోదీని అడుగుతున్నరు” అని సీఎం అన్నారు. 

కేసీఆర్​కు ముందుంది ముసళ్ల పండుగ

‘‘తాము చెప్పినట్లు ఈ ప్రభుత్వం వింటలేదని బీఆర్​ఎస్​ లీడర్లు అంటున్నరు. పదేండ్లు కాంగ్రెస్​ కార్యకర్తలను కొట్టి, సంపి, కేసులుపెట్టి, జైలులో పెట్టినప్పుడు కేసీఆర్​కు ఈ దుఃఖం ఎక్కడికిపోయింది. అప్పుడు నీ హయాంలో రాజనీతి, ప్రజాస్వామం ఏమయ్యాయి?’’ అని కేసీఆర్​ను సీఎం రేవంత్​రెడ్డి నిలదీశారు. ‘‘నీలాగా దొంగ దెబ్బ తీస్తలేం. అక్రమ కేసులు పెడ్తలేం. బాజాప్త ప్రజలతో ఎన్నికై ఇక్కడికి వచ్చినం. ఆరు నెలల్లో అంతా అయిపోయిందని ఏదేదో మాట్లాడినవ్​.

కేసీఆర్​..! నీకు ముందుంది ముసళ్ల పండుగ. ఆ ఎమ్మెల్యే పోయిండు.. ఈ ఎమ్మెల్సీ మారిండని సన్నాయి నొక్కులు నొక్కుతున్నవ్​. అప్పట్లో మా ఎమ్మెల్యేలను గద్దలాగా నువ్వు తన్నుకుపోయింది వాస్తవం కాదా?” అని ప్రశ్నించారు. సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, జనంపల్లి అనిరుధ్​రెడ్డి, జి.మధుసూదన్​ రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మేఘారెడ్డి, చిక్కడు వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్​ తదితరులు పాల్గొన్నారు.

గత ప్రభుత్వం పదేండ్లు ఉద్యోగాలు భర్తీ చేయకుండా, పోటీ పరీక్షలు పెట్టకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంది. ఇప్పటికే నిరుద్యోగులు ఏండ్ల తరబడి హైదరాబాద్​లో ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేర్​ అయిన్రు. ఇంకా కోచింగ్​ సెంటర్లలో వేల రూపాయలు ఫీజులు కట్టాల్సిన పని లేకుండా మా ప్రభుత్వం వెంబడి వెంబడే పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇస్తామంటుంటే కుట్ర చేస్తున్నరు. పరీక్షలు పోస్టుపోన్​ చేస్తే కోచింగ్​ సెంటర్లకు వంద కోట్ల ఫీజులు వస్తయ్.. అందుకే పరీక్షలు వాయిదా వేయించాలని కోచింగ్ ​సెంటర్ల మాఫియా కొందరు కిరాయి మనుషులను పెట్టి రోడ్లపై ధర్నాలు చేయిస్తున్నది.  

- సీఎం రేవంత్​రెడ్డి