కంచర గాడిదను ఇంటికి పంపి.. రేసు గుర్రాన్ని తెచ్చుకున్నరు : సీఎం రేవంత్​రెడ్డి

కంచర గాడిదను ఇంటికి పంపి.. రేసు గుర్రాన్ని తెచ్చుకున్నరు :  సీఎం రేవంత్​రెడ్డి
  • కంచర గాడిదను ఇంటికి పంపి.. రేసు గుర్రాన్ని తెచ్చుకున్నరు
  • బీఆర్​ఎస్​కు ఇక అధికారం కల్ల.. పదేండ్లు మేమే ఉంటం
  • కేసీఆర్​కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్​
  • అసెంబ్లీకి రాని నీకు అధికారం కావాల్నా
  • రా బిడ్డ.. ఎట్లస్తవో నీ సంగతి చూస్తం
  • పదేండ్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడినవ్​
  • బయటకొస్తే కానిస్టేబుళ్లే నీ మోకాళ్లు ఇరగ్గొడ్తరు
  • నువ్వు సచ్చిన పామువు.. ఇంకెందుకు సంపుతం
  • నీ ఖేల్​ ఖతం.. దుకాణం బంద్..​ అని ఫైర్​
  • ఉత్తప్పుడు కేసీఆర్​ బాగానే నడుస్తున్నడు.. నల్గొండ మీటింగ్ల మాత్రం వీల్ చైర్ల కూసున్నడని విమర్శ
  • కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేత
  • రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని ప్రకటన

హైదరాబాద్, వెలుగు : పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారన్న కేసీఆర్​ వ్యాఖ్యలకు సీఎం రేవంత్​రెడ్డి స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చారు. ‘‘పాలిచ్చే బర్రెను కాదు.. కంచర గాడిదను ఇంటికి పంపి, రేసు గుర్రాన్ని తెచ్చుకున్నరు. ఏ రేసుకు పోయినా ఈ గుర్రానిదే గెలుపు.. ఆ కంచర గాడిదకు ఇక అధికారం అన్నది కలలో మాట” అని అన్నారు. ‘‘మళ్లా అధికారంలోకి వస్తానని కేసీఆర్​ అంటున్నడు. నడవడానికి చేతగాని ఆయన ఇంకా ఎట్లొస్తడు? ఒకవేళ వచ్చినా.. ఆయన చేసిన అన్యాయాలకు కానిస్టేబుళ్లే మోకాళ్లు ఇరగ్గొట్టి లాకప్​లో వేస్తరు” అని హెచ్చరించారు. వచ్చే పదేండ్లు తాను ఇదే బాధ్యతల్లో ఉంటానని, కేసీఆర్​ ఎట్ల వస్తారో చూస్తానని అన్నారు. ‘‘రా బిడ్డ.. ఎట్లస్తవో నీ సంగతిచూస్త. పదేండ్లు ఈ బాధ్యతలో ఉంట. జనం ఆశీర్వదిస్తే ఇంకో పదేండ్లు కూడా ఇందిరమ్మ రాజ్యమే ఉంటది. వచ్చే పదేండ్లలో చాతనైతే ఒక్క ఎంట్రుకన్న పీకి చూడు. నీ పనైపోయింది.. ఖేల్​ ఖతం.. దుకాణం బంద్” అని కేసీఆర్​కు వార్నింగ్​ ఇచ్చారు. తెలంగాణ స్టేట్​ లెవల్​ రిక్రూట్​మెంట్​ బోర్డు (టీఎస్​ఎల్పీఆర్​బీ) ద్వారా ఎంపికైన కానిస్టేబుళ్లకు సీఎం రేవంత్​రెడ్డి బుధవారం నియామక పత్రాలు అందజేశారు. 

ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, నామా నాగేశ్వరరావు, డీజీపీ రవిగుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​ మాట్లాడుతూ.. ‘‘పాలిచ్చే బర్రెను ఇచ్చి దున్నపోతును తెచ్చుకున్నరని నల్గొండ సభలో కేసీఆర్​ అన్నడు. అయితే.. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు అసెంబ్లీలో ఒక అటెండర్​ నన్ను కలిసి.. ‘కంచర గాడిదను ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నరు’ అని సభలో చెప్పండి అని అన్నడు. అంతేకాదు.. ఏ రేసుకు పోయినా ఆ గుర్రానిదే గెలుపని, కంచెర గాడిదకు ఇక అధికారం కలలో మాట అని ఆ అటెండర్​ అనుమన్నడు. అదే విషయం మీ అందరికీ చెప్తున్న. ఇక కంచెర గాడిదకు అధికారం కల్ల. ఏ రేసుకు పోయినా గుర్రానిదే గెలుపు” అని పేర్కొన్నారు. జనం సమస్యలపై చర్చిద్దామని అసెంబ్లీకి పిలిస్తే  కేసీఆర్​ రాలేదని, సభలు పెట్టి నీళ్ల డ్రామాలు ఆడుతున్నారని,  ఒక అటెండర్​కు ఉన్న ఇంగిత జ్ఞానం కూడా ఆయనకు లేదని మండిపడ్డారు. 

ఉత్తప్పుడు బాగానే నడుస్తున్నడు

‘‘మళ్లీ అధికారంలోకి వస్తానని కేసీఆర్​ అంటున్నడు. కానీ ఆయనకు అంత సీన్​ లేదు. అసెంబ్లీకి రానోళ్లకు అధికారం ఎందుకు” అని సీఎం రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. ‘‘కేసీఆర్​..! నీ ఖేల్​ ఖతం, దుకాణం బంద్​. ఇంకెట్లస్తవ్​. నీకు నడవనీకే సక్కగ వస్తలేదు. వీల్​చైర్​లో తిరుగుతున్నవ్​. ఇంకెట్లొస్తవ్. నువ్వు రావాలనుకున్నా ఇప్పుడు రిక్రూట్​ అయిన కానిస్టేబుళ్లు రానియ్యరు. పదేండ్ల పాటు వీళ్లకు నౌకరీలు ఇవ్వక, ఇప్పుడొచ్చి నాదే అధికారం అంటే ఊకుంటరా? రాష్ట్రం నలుమూలలా ఉండే వీళ్లు నాలుగు కొట్టి లోపలేస్తరు” అని హెచ్చరించారు. కేసీఆర్​ ఇంకా కథలు పడుతున్నారని, ‘సంపుతరా నన్ను, సంపున్రి’ అని అంటున్నారని, సచ్చిన పాముని ఇంకా ఎందుకు సంపుతమని ప్రశ్నించారు. ‘‘ఉద్యమం సమయంలో మంచంలో పడుకొని చావు దగ్గరి దాకా పోయి వచ్చినట్లు కేసీఆర్​ అంటే అప్పుడు నమ్మిన్రు. కానీ, ఇప్పుడు ఆయన డ్రామాలన్నీ చూసి మోసపోయే స్థితిలో ఎవరూ లేరు. ఉత్తప్పుడు బాగానే నడుస్తున్నడు. నల్గొండ మీటింగ్​కు రాంగనే వీల్ చైర్ల కూసున్నడు’’ అని విమర్శించారు. 

పదేండ్లు ఆగం చేసిండు

కేసీఆర్ పదేండ్లు అధికారంలో ఉండి  రాష్ట్రాన్ని ఆగం చేశారని సీఎం రేవంత్​ అన్నారు. ‘‘నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక.. ఒక్క రిక్రూట్​మెంట్​ కూడా చేయక కేవలం తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిచ్చుకున్నడు. 2014 ఎన్నికల్లో గెలవగానే ఒక్క గంట కూడా ఆగకుండా గవర్నర్​ దగ్గరకి పోయి ప్రభుత్వం ఏర్పాటు చేసిండు. మంత్రి వర్గంలో తన కొడుకు, అల్లుడికి పదవులిచ్చుకున్నడు. తర్వాత కూతురు, బంధువుకు ఎంపీ పదవులిచ్చిండు. సడ్డకుని కొడుకుకు రాజ్యసభ సీటు ఇచ్చిండు. పార్టీ ఫిరాయించిన ఎర్రబెల్లికి కూడా మంత్రి పదవి ఇచ్చిండు. తర్వాత వచ్చిన పార్లమెంట్​ ఎన్నికల్లో కవిత, వినోద్​ రావును జనం ఓడిస్తే కేసీఆర్​ తట్టుకోలేక కండ్లల్లకు నీళ్లు తెచ్చుకొని వాళ్లకు మళ్లీ పదవులిచ్చిండు. పదేండ్లపాటు సొంత కుటుంబం గురించి తప్ప ఏనాడైనా నిరుద్యోగుల గురించి ఆలోచించిండా?” అని ప్రశ్నించారు. తాము నిరుద్యోగుల గురించి ఆలోచిస్తూ ఉద్యోగాలు ఇస్తుంటే తట్టుకోలేక కాళ్లలో కట్టెలు పెడుతున్నారని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ పాలనలో స్వేచ్ఛను కోల్పోయాం. అహంకార పూరితంగా వ్యవహరించిండు. నలుగురి ఉద్యోగాలు తీస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నయ్​. టీఎస్​పీఎస్సీ అంటే అంగట్లో పేపర్స్‌‌ అమ్ముకునే సంస్థలా మార్చిండు. కాళేశ్వరం తెల్ల ఏనుగు సామెతలా మారింది” అని అన్నారు. జాబ్ క్యాలెండర్‌‌‌‌తో ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రజాస్వామ్యయుతంగా ప్రజల భద్రతే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. నిరుద్యోగులు పరీక్షలకు ప్రిపేర్​ కావాలని ‘‘మీ రేవంతన్నగా అన్ని విధాలా అండగా ఉంటా” అని హామీ ఇచ్చారు. 

ఏడ నిలదీస్తరోనని అసెంబ్లీకి వస్తలేడు

జనం ఓడించి ఇంట్ల కూసుండబెడితే ఏ దారి లేక కేసీఆర్​ ఇప్పుడు నీళ్ల డ్రామాలు ఆడుతున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘కేఆర్‌‌‌‌ఎంబీలో కేసీఆర్ సంతకం పెట్టడంతోనే ఇప్పుడు అది గుదిబండగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో కట్టింది మేడిగడ్డ కాదు.. అది మేడిపండు. దాని పొట్టవిప్పితే అన్నీ పురుగులే బయటపడ్డయ్. తన అక్రమాలు ఏడ బయటపడ్తయోనని, ఏడ నిలదీస్తరోనని భయంతో కేసీఆర్​ అసెంబ్లీ సమావేశాలకు వస్తలేడు. నీళ్ల మీద చర్చ అంటే అసెంబ్లీకి రాలేదు. నిధులు, నియామకాల మీద మాట్లాడుదామన్నా రాలేదు. కానీ, నల్గొండకు పోయి బీరాలు పలికిండు.. పొంకనాలు కొట్టిండు” అని ఆయన విమర్శించారు.  టీఎస్ఎల్పీఆర్​బీ ద్వారా ఎంపికైన 13,445 సివిల్, ఏఆర్,టీఎస్ఎస్పీ, జైల్స్, ఫైర్, ఆర్టీసీ కానిస్టేబుల్ అభ్యర్థులకు  సీఎం రేవంత్​ నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు.