వీల్​చైర్​లో వీధినాటకాలు బంజేయ్.. కేసీఆర్​పై సీఎం రేవంత్​రెడ్డి ఫైర్

వీల్​చైర్​లో వీధినాటకాలు బంజేయ్.. కేసీఆర్​పై సీఎం రేవంత్​రెడ్డి ఫైర్

 

  • మొన్నటి ఎన్నికల్లో ప్రజలే నీ ప్యాంట్​ ఊడబీకిన్రు
  •     ఇట్లనే ఉంటే అంగి, లాగు కూడా ఊడగొడ్తరు
  •     సీఎంను పట్టుకొని మేడిగడ్డకు ఏం పీకనీకి పోయిన్రంటవా?.. బొక్క బోర్లపడ్డా బుద్ధిమారలే
  •     కేసీఆర్​పై సీఎం రేవంత్​రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు : వీల్‌‌చైర్‌‌లో వెళ్లి వీధి నాటకాలు వేయడం కేసీఆర్‌‌‌‌ ఆపేయాలని, సానుభూతి డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నారు. ‘‘దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై, సాగునీటి ప్రాజెక్టులపై జరిగే చర్చలో పాల్గొను” అని సవాల్​ విసిరారు. బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలు పదే పదే తన భాష గురించి మాట్లాడుతున్నారని, నల్గొండ సభలో కేసీఆర్‌‌‌‌ మాట్లాడిన భాష ఏందని ఆయన ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రిని పట్టుకుని ‘మేడిగడ్డకు ఏం పీకనీకి పోయిన్రు’ అని మాట్లాడ్తడు. దీనికి బీఆర్​ఎస్​ వాళ్లు సమాధానం చెప్పాలి కేసీఆర్​..! ఏం పీకుతరు అని అడుగుతున్నవ్ కదా. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు నీ ప్యాంట్‌‌ ఊడబీకిన్రు. ఈసారి అంగీ, లాగు కూడా ఊడగొడ్తరు. బొక్క బోర్లా పడ్డా మీ బుద్ధి మారలేదు. పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఏం పీకనీకి పోయినవని ఎట్లంటవ్​? నాలుగు కోట్ల మంది ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ముఖ్యమంత్రి గురించి మాట్లాడే పద్ధతి ఇదేనా?” అని మండిపడ్డారు. 

మేడిగడ్డ మేడిపండు లెక్క కుంగిపోయిందని, అక్కడ నీళ్లు నింపడానికి అవకాశం లేదని అన్నారు.  ‘‘ఒకటో రెండో పిల్లర్లు కుంగినయని, అందులో తప్పేముందని కేసీఆర్ అంటున్నడు. ఎన్ని కుంగినయో, అసలు ప్రాజెక్ట్‌‌ పనికొస్తదో లేదో చూడడానికి రమ్మంటే మొహం చాటేసిన్రు. కొత్తగా వచ్చిన మా ప్రభుత్వం తప్పు చేసినట్టు మాట్లాడుతున్నడు. కేసీఆర్, హరీశ్‌‌రావు సాగునీటి మంత్రులుగా పనిచేసిన్రు కదా.. వాళ్లకే పెత్తనం ఇస్తం.. మేడిగడ్డలో నీళ్లు ఎట్ల నింపుతరో, మేడిగడ్డ నుంచి అన్నారానికి, అక్కడి నుంచి సుందిళ్లకు నీళ్లు ఎట్ల ఎత్తిపోస్తరో వాళ్లే చెప్పాలి. ప్రాజెక్టు మొత్తం కుంగిపోయి కుప్పకూలిపోతుంటే, నీళ్లు నింపడానికి అవకాశం ఎక్కడుందో చెప్పాలి” అని సవాల్​ చేశారు.  స్పీకర్​ అనుమతితో పంపుహౌస్​ల పరిస్థితి తెలుసుకోవడానికి సభ్యులంతా వెళ్తే కేసీఆర్​ అట్ల మాట్లాడటం ఏమిటని మండిపడ్డారు. ‘‘రైతుల పట్ల, తెలంగాణ సమాజం పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్​ఎస్​ అక్కడికి వచ్చేది. జరిగిన నష్టాన్ని, రైతులకు కలిగిన కష్టంపై చర్చకు ఒప్పుకునేది. కానీ, ఏం పీకనీకి పోయిన్రని కేసీఆర్​ ఎట్లంటడు?”అని మండిపడ్డారు. 

అవినీతి బయటపడ్తదని పారిపోయిండు

కాళేశ్వరం పేరిట గత సర్కారు ఖర్చు పెట్టిన రూ.94 వేల కోట్లు వృథా అయిపోయాయని సీఎం రేవంత్​ అన్నారు. “కాళేశ్వరం పనికి రాకుండా పోతే, ప్రజలకు సమాధానం చెప్పలేక, శాసనసభకు రావాల్సిన వ్యక్తి సభకు రాకుండా పారిపోయిండు. కాళేశ్వరం పేరిట చేసిన దోపిడీ బయటపడ్తదని పారిపోయి ఫామ్‌‌హౌస్​ల పండుకున్నడు. జైలుకు వెళ్లాల్సి వస్తదని, ‘కేసీఆర్‌‌‌‌ను చంపుతరా’ అని ప్రజలను రెచ్చగొట్టే నాటకాలు మొదలు పెట్టిండు”అని ఆయన 
మండిపడ్డారు.

బీఆర్​ఎస్​ చెప్పిందే వినాలంటే కుదరదు :  శ్రీధర్‌‌‌‌బాబు

రేవంత్‌‌ మాట్లాడుతున్న సమయంలో హరీశ్‌‌రావు సూచనతో బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు కొంత మంది వెల్‌‌లోకి వెళ్లి నిరసన చేశారు. సీఎం ప్రసంగం అనంతరం కడియం శ్రీహరికి స్పీకర్ మైక్ ఇవ్వడంతో నిరసన విరమించారు. పీసీసీ చీఫ్‌‌గా రేవంత్ ఏదైనా మాట్లాడొచ్చని,  సీఎంగా శాసనసభలో అలా మాట్లాడడం సరికాదని కడియం అన్నారు. సంయమనం పాటించాలని, కోమటిరెడ్డి రాజగోపాల్ (అంతకుముందు ఇద్దరికీ వాదోపవాదాలు జరిగాయి) తీరుగా ఏదిపడితే అది మాట్లాడొద్దని అన్నారు. దీంతో కలగజేసుకున్న మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు.. సభలోనైనా, బయటైనా సీఎం గురించి మాట్లాడేటప్పుడు అడ్డగోలుగా మాట్లాడొద్దని అన్నారు. ‘‘మేము చెప్పిందే ప్రజలందరూ వినాలంటే.. కుదరదు. సభ సంప్రదాయాలను గౌరవించడం అందరి బాధ్యత. అందరూ సంయమనం పాటించాలి”అని ఆయన హితవు పలికారు. 

రాజీవ్ విగ్రహ ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన..

సచివాలయం ఎదురుగా ఉన్న స్థలంలో భారత రత్న రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. విగ్రహావిష్కరణకు  సోనియాగాంధీని ఆహ్వానించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని సీఎం కితాబిచ్చారు. ఆయన విగ్రహం జయంతి, వర్ధంతులకు పరిమితం కాదని తెలిపారు. మహానుభావుల విగ్రహాలు చూసినప్పుడు వారి స్ఫూర్తితో ముందు కెళ్లాలన్న భావన  కలగాలని పేర్కొన్నారు.   

తొలిసారి సీఎల్పీకి సీఎం

సీఎం రేవంత్​ రెడ్డి తొలిసారిగా కాంగ్రెస్​ లెజిస్లేటివ్​ పార్టీ (సీఎల్పీ) ఆఫీసుకు వచ్చారు. అక్కడ సీఎల్పీ లీడర్​గా సంతకం చేసి చార్జ్​ తీసుకున్నారు. ఆ వెంటనే ఎల్బీ స్టేడియంలో  జాబ్ అపాయింట్​మెంట్​ లెటర్లను అందజేసేందుకు వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలిచాక సీఎం రేవంత్​ రెడ్డిని సీఎల్పీ లీడర్​గా పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లీడర్​ ఆఫ్​ ది హౌజ్​గా ఆయన చార్జ్​ తీసుకున్నా.. సీఎల్పీ లీడర్​గా చార్జ్​ తీసుకోలేదు. ఈమేరకు సీఎల్పీలో సంతకం చేసి చార్జ్​ తీసుకున్నారు.