కొడంగల్​పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్​

కొడంగల్​పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్​
  •  శరవేగంగా అభివృద్ధి పనులకు ప్రణాళికలు
  • కాలేజీలు, రోడ్ల నిర్మాణం కోసం ముందుగా నిధులు
  • పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ భూములపై సర్వే

మహబూబ్​నగర్/ కోస్గి, వెలుగు: తెలంగాణ ఏర్పాటై పదేండ్లు గడిచినా కొడంగల్​ నియోజకవర్గం అభివృద్ధికి నోచకోలేదు. రాజకీయ కారణాలతో ఇక్కడ అభివృద్ధిని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. దీంతో ఇక్కడి నుంచి పేదల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం మారి, ఈ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎనుముల రేవంత్​రెడ్డి సీఎం కావడంతో పరిస్థితుల్లో మార్పు వస్తోంది. కొడంగల్​ డెవలప్​మెంట్​కు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. 

ఎడ్యుకేషన్​కు ప్రియారిటీ..

నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారు. కొడంగల్​లో మెడికల్, అగ్రికల్చర్, నర్సింగ్, ఉమెన్స్​ డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీ, బొంరాస్​పేటలో జూనియర్  కాలేజ్, ఇతర వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి కాలేజీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే కోస్గిలోని పాలిటెక్నిక్   కాలేజీని గవర్నమెంట్​ ఇంజినీరింగ్ కాలేజీగా అప్​గ్రేడ్​​చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

ALSO READ : ఎన్‌హెచ్‌లపై కనిపించని ట్రామా కేర్‌ సెంటర్లు

అలాగే కొడంగల్​లో మిల్లెట్  రీసెర్చ్  సెంటర్, కృషి విజ్ఞాన కేంద్రం, పాల శీతలీకరణ కేంద్రం, సిమెంట్, ఇతర పరిశ్రమల స్థాపనపై దృష్టిపెట్టారు. కొడంగల్, కోస్గి సర్కారు దవాఖానలను వంద పడకల ఆసుపత్రులుగా అప్​గ్రేడ్​ చేయనున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు వారం రోజుల్లో శ్రీకారం చుట్టనున్నారు. అలాగే కొడంగల్​ రెవెన్యూ డివిజన్  ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.

ప్రభుత్వ భూములపై సర్వే..

నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపన, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆఫీసర్లు భూసేకరణ చేస్తున్నారు. నారాయణపేట కలెక్టర్  కోయ శ్రీహర్ష, కాడా స్పెషల్​ ఆఫీసర్​ వెంకట్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆఫీసర్లకు భూ సేకరణపై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, ఆక్రమణ దారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. 20 రోజులుగా దుద్యాల, హకీంపేట, కోస్గి, చంద్రవంచ, మిర్జాపూర్, నాగసానిపల్లి తదితర గ్రామాల్లో ఆఫీసర్లు భూసేకరణపై దృష్టి పెట్టారు. సర్వే చేసిన వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు.

రోడ్లకు మహర్దశ..

కొడంగల్​ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లినా మట్టి రోడ్లు, గుంతల రోడ్లే దర్శనమిస్తాయి. సీఎం అధికారంలోకి రాగానే మొదట ఇక్కడ రోడ్లను డెవలప్​ చేసేందుకు పెద్ద మొత్తంలో ఫండ్స్​ కేటాయించారు. మట్టి రోడ్లను బీటీగా మార్చేందుకు రూ.213.20 కోట్లు, రోడ్ల విస్తరణకు రూ.301 కోట్లు మంజూరు చేశారు. రోడ్ల విస్తరణలో భాగంగా కోస్గి-–తుంకిమోట్ల, మద్దూరు-–లింగాల్​చెడ్​, నారాయణపేట–-మద్దూరు, అప్పంపల్లి–-గుండుమాల్​, కోటకొండ–-మద్దూరు, బీజాపూర్–హైదరాబాద్​ హైవే నుంచి లింగన్​పల్లి, సాగారంతండా, దౌల్తాబాద్​ వరకు, కుదురుమళ్ల నుంచి దుద్యాల, పోలేపల్లి మీదుగా దాదాపూర్​ వరకు, హస్నాబాద్–​-నీటూరు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పాత కొడంగల్  రోడ్డును విస్తరించనున్నారు.

మున్సిపాలిటీల్లో సౌలతుల కోసం..

కోస్గి, కొడంగల్  మున్సిపాల్టీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు యాక్షన్  ప్లాన్  తయారు చేశారు. కోస్గిలో రూ.200 కోట్లతో, కొడంగల్​లో రూ.315 కోట్లకు సంబంధించి ప్రపోజల్స్​ రూపొందించి ప్రభుత్వానికి పంపారు. గిరిజన సంక్షేమ శాఖ నుంచి తండాలకు రోడ్ల ఏర్పాటుకు రూ.27 కోట్ల ఫండ్స్​ మంజూరు చేశారు. మైనారిటీ గురుకులానికి రూ.20 కోట్లు రిలీజ్ అయ్యాయి. నియోజకవర్గంలోని రెండు ఎస్సీ గురుకులాలకు త్వరలో నిధులు మంజూరు చేయనున్నట్లు సమాచారం.