భువనగిరి బాధ్యతలు రాజగోపాల్ రెడ్డికి

భువనగిరి బాధ్యతలు రాజగోపాల్ రెడ్డికి
  • అవసరమైతే నేనూ క్యాంపెయిన్ కు వస్తా
  • జనగామలో మనకు భారీ మెజార్టీ పక్కా
  •  ఈ నెల 21న చామల నామినేషన్ దాఖలు
  • తనతోపాటు కోమటిరెడ్డి బ్రదర్స్ హాజరవుతారన్న సీఎం
  • వచ్చే నెలలో మిర్యాలగూడ, చౌటుప్పల్ లో ప్రియాంక సభలు
  • ప్రచార వ్యూహాలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం


హైదరాబాద్: భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రచార బాధ్యతలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పగిస్తున్నట్టు సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ జూబ్లీ హిల్స్ లోని రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడే భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సెగ్మెంట్ పరిధిలోని జనగామలో మనకు ఎమ్మెల్యే లేరని అధైర్యపడొద్దని సీఎం అన్నారు. ఆ సెగ్మెంట్ పరిధిలోనే చామల కిరణ్ కు భారీ మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గెలుపుకోసం ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ఆరు గ్యారెంటీలను ప్రతి గడపకూ తీసుకెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. భువనగిరి కోమటిరెడ్డి బ్రదర్స్ కంచుకోట అని అన్నారు. ఈ టికెట్ ను కోమటిరెడ్డి ఫ్యామిలీ టికెట్ ఆశించిందని, కానీ అధినాయకత్వం ఎవరికి ఇచ్చినా గెలుపుకోసం కృషి చేస్తామని కూడా  ప్రకటించిందని అన్నారు. అందులో భాగంగానే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. జనగామ కో–ఆర్డినేషన్ బాధ్యతను డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చూసుకుంటారని చెప్పారు. 

21న చామల నామినేషన్


కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్​ కుమార్ రెడ్డి ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమానికి తాను కూడా వస్తానని చెప్పారు. తనతోపాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాజరవుతారని వివరించారు. 

వచ్చే నెలలో ప్రియాంక సభలు

భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గానికి వచ్చే నెలలో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ రానున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకే రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో రెండు సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేశామని చెప్పారు. నల్లగొండ సెగ్మెంట్ పరిధిలోని మిర్యాలగూడలో ఉదయం, సాయంత్రం భువనగిరి సెగ్మెంట్ పరిధిలోని చౌటుప్పల్ లో మరో సభ  జరగనుందని  సీఎం వివరించారు. పార్లమెంటు ఎన్నికల  నేపథ్యంలో రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటనలు కూడా ఉంటాయని చెప్పారు.