సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ

సీఎం రేవంత్  కీలక నిర్ణయం..  ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్తపాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  తమిళనాడు, కర్ణాటక, ఏపీ తదితర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతో పాటుగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధివిధానాలు ఉండేలా  కొత్త పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 

గురువారం  సచివాలయంలో గనులు, భూగర్భ ఖనిజ వనరుల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.  ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని సీఎం అభిప్రాయపడ్డారు.   నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న ఇసుక క్వారీయింగ్, అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని హెచ్చరించారు. 

48 గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని డెడ్లైన్ విధించారు. బాధ్యలైన ఎవరిని వదిలిపెట్టొద్దని ఉన్నాతాధికారులను ఆదేశించారు.  రెండు రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలన్నారు సీఎం.