న్యాయ్​ యాత్రతో ఎర్రకోటపై జెండా ఎగరేస్తం : సీఎం రేవంత్​రెడ్డి

న్యాయ్​ యాత్రతో ఎర్రకోటపై జెండా ఎగరేస్తం : సీఎం రేవంత్​రెడ్డి
  • జోడో యాత్రతో కర్నాటక, తెలంగాణలో గెలిచినం
  • కేంద్రంలో కాంగ్రెస్​ గెలుపు కోసం కార్యకర్తలు వందరోజులు కృషి చేయాలి
  • పార్టీని అధికారంలోకి తెచ్చి దేశాన్ని కాపాడుకుందాం
  • ప్రధాని మోదీకి ఎక్స్​పైరీ డేట్​ అయిపోయిందని విమర్శ
  • నాగ్​పూర్​లో కాంగ్రెస్​ ఆవిర్భావ వేడుకల్లో ప్రసంగం

హైదరాబాద్, వెలుగు: రాహుల్​గాంధీ చేపట్టనున్న న్యాయ్​ యాత్రతో కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని, ఎర్రకోటపై జెండా ఎగరేస్తామని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ఇప్పటికే జోడో యాత్రతో కర్నాటకలో, తెలంగాణలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిందని, న్యాయ్​ యాత్రతో మరింత ముందుకుసాగుతామని చెప్పారు. గురువారం మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో నిర్వహించిన కాంగ్రెస్​ పార్టీ  ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

మహారాష్ట్రలోనూ కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్​ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ కార్యకర్తలు ఓ వంద రోజులు పనిచేయాలని, ఈ వంద రోజుల పాటు కుటుంబానికి సెలవు పెట్టాలని సూచించారు. ‘‘దేశం కోసం పనిచేస్తామంటూ ఇంట్లో అమ్మ, నాన్న, అన్నా, చెల్లి, తమ్ముడు కుటుంబం అందరికీ చెప్పాలి. కాంగ్రెస్​ గెలుపు కోసం కృషి చేయాలి. 

కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకొచ్చి దేశాన్ని కాపాడుకుందాం” అని పిలుపునిచ్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్​ వరకు రాహుల్​గాంధీ జోడో యాత్ర చేశారని, 150 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. త్వరలో మణిపూర్​ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్​ చేయనున్న భారత్​ న్యాయ్​ యాత్రతో ఎర్రకోటపై కాంగ్రెస్​ జెండా ఎగరడం ఖాయమని, కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీన్ని 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆపలేరని పేర్కొన్నారు. ప్రతి మెడిసిన్​కూ ఒక ఎక్స్​పైరీ డేట్​ ఉంటుందని, ప్రధాని మోదీ ఎక్స్​పైరీ డేట్​ అయిపోయిందని అన్నారు. 

రాబోయే రోజుల్లో మోదీ మెడిసిన్​ దేశంలో పనిచేయబోదని వ్యాఖ్యానించారు. డబుల్​ ఇంజన్​ సర్కార్​ అంటూ బీజేపీ పదే పదే చెప్తున్నదని, అందులో ఒక ఇంజన్​ అదానీ, మరో ఇంజన్​ ప్రధాని అని విమర్శించారు. లోక్​సభలో రాహుల్​ గొంతెత్తడంతో అదానీ అనే ఇంజన్​ పాడైపోయి షెడ్డుకు పోయిందన్నారు. ఇప్పుడు న్యాయ్​ యాత్రతో మోదీ అనే ఇంజన్​ కూడా పాడైపోయి షెడ్డుకు పోతుందని సీఎం రేవంత్​ వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడం మోదీ చూస్తారని అన్నారు. 

వేడుకకు రాష్ట్రం నుంచి పది వేల మంది

నాగ్​పూర్​లో కాంగ్రెస్​ పార్టీ ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ నుంచి దాదాపు 10 వేల మంది హాజరయ్యారు. పార్టీ కార్యకర్తల నుంచి సీనియర్​ నేతల వరకు చాలా మంది ఇందులో పాల్గొన్నారు. వీరిలో మంత్రి జూపల్లి కృష్ణారావు, చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, సీనియర్​ నేతలు సంపత్​ కుమార్​, మల్లు రవి, చామల కిరణ్ కుమార్​ రెడ్డి తదితరులు ఉన్నారు.