చెప్పింది చేస్తం..అన్ని విషయాల్లో ఫుల్ క్లారిటీ ఉంది

చెప్పింది చేస్తం..అన్ని విషయాల్లో ఫుల్ క్లారిటీ ఉంది
  • అన్ని విషయాల్లో ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉంది: సీఎం రేవంత్
  • ప్రతిపాదిత కొత్త మెట్రోను మరింత మెరుగ్గా, తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తం
  • ఎంజీబీఎస్‌‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్టుకు కారిడార్ నిర్మిస్తం
  • ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యలో ఫార్మా సిటీ ప్రత్యేక క్లస్టర్లు
  • ప్రజా ప్రయోజనాలకు తగ్గట్టుగానే మార్పులు
  • 100 పడకల హాస్పిటల్ ఉన్నచోట నర్సింగ్ కాలేజ్
  • పార్టీ కోసం కష్టపడినోళ్లకే నామినేటెడ్ పోస్టులు
  • యువతకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక యూనివర్సిటీలు
  • ఆఫీసర్ల నియామకాల్లో సామాజిక న్యాయం పాటిస్తున్నం
  • సెక్రటేరియెట్‌‌లో మీడియా ప్రతినిధులతో సీఎం

హైదరాబాద్, వెలుగు : అనేక విషయాల్లో తమ ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, ఏది ఎంత అవసరమో అంతే చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంస్కరణలు తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నామని, తన వద్ద చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి ఉండదని, చెప్పింది చేస్తామని ఆయన అన్నారు. గతంలో కొందరి ప్రయోజనాల కోసం చేసిన వాటిని ఇప్పుడు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపాదిత కొత్త మెట్రో లైన్లను మరింత మెరుగ్గా, తక్కువ ఖర్చుతో చేపడుతామని వెల్లడించారు. ఎంజీబీఎస్‌‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్టు వరకు కారిడార్ నిర్మిస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్), రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) మధ్య ఫార్మాసిటీ ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సోమవారం న్యూ ఇయర్ సందర్భంగా సెక్రటేరియెట్‌‌లో తనను కలిసిన కొందరు మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈనెల 3వ తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పదవులు కేటాయిస్తామని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. తనకు దగ్గరగా ఉంటారనో, బంధువనో పదవులు ఇవ్వడం ఉండదని తేల్చిచెప్పారు. ఏది చేసినా విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పదవులను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.

ఎంజీబీఎస్‌‌‌‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు మెట్రో మార్గం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు లైన్ ఏర్పాటు చేస్తామని, ఒవైసీ ఆసుపత్రి మీదుగా చాంద్రాయణగుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లేలా మెట్రో లైన్‌‌‌‌కి లింక్ చేస్తామని వివరించారు. ‘‘అవసరమైతే మియాపూర్ దాకా ఉన్న మెట్రోను రామచంద్రాపురం వరకు.. మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్‌‌‌‌ డిస్ట్రిక్ట్ దాకా పొడిగిస్తాం. మేము కొత్తగా ప్రతిపాదించబోతున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన దానితో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయి’’ అని చెప్పారు. ప్రెస్ అకా డమీ చైర్మన్‌‌‌‌ నియామకం తర్వాతే జర్నలిస్టులకు సం బంధించిన అన్ని సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని వెల్లడించారు. 

ఫార్మాసిటీ ప్రత్యేక క్లస్టర్లు

ఔటర్ రింగ్ రోడ్, రీజినల్‌‌‌‌ రింగ్ రోడ్ మధ్య జీరో కాలుష్యంతో ఫార్మాసిటీ ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్ తెలిపారు. ప్రత్యేక క్లస్టర్ల వద్ద పరిశ్రమల్లో పనిచేసే వారి కోసం ఇండ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా శిక్షణ ఉంటుందని వివరించారు. సాధా రణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఈ నైపుణ్యాలకు ఉంటా యని సీఎం వివరించారు. 100 పడకల ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కాలేజీ ఉంటుందని సీఎం తెలిపా రు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని.. ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్‌‌‌‌పవర్‌‌‌‌ను ప్రభుత్వం ద్వారా అందిస్తామని పేర్కొన్నారు. యువతకు ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తామన్నారు.

సొసైటీకి భూమి అప్పగింతపై సీఎం సానుకూలం

పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమిని జవహర్​లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి స్వాధీనం చేయాలన్న సొసైటీ సభ్యుల అభ్యర్థనకు సీఎం రేవంత్​రెడ్డి సానుకూలంగా స్పందించారు. సొసైటీ ప్రతినిధి బృందం సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌లో సీఎంను కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. సొసైటీకి భూమి బదలాయించాలని కోరుతూ వినతి పత్రం అందించింది.

అధికారాన్ని వికేంద్రీకరించాం

ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలకు ఇన్‌‌చార్జ్‌‌లుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ‘‘మూడు కమిషనరేట్లకు కమిషనర్లను నియమిం చాం. వారికి అవసరమైన సిబ్బందిని వారే ఎంపిక చేసుకుంటారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు నేను చూస్తాను. వాళ్ల పరిధిలో అవసరమైన అధికారులను నియమించు కొని యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా వారే చూసుకోవాలి. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం” అని చెప్పారు.

సెక్రటేరియెట్‌‌‌‌లో సందడి

కొత్త సంవ‌‌‌‌త్సరం తొలి రోజున సెక్రటేరియెట్‌‌‌‌లో సందడి నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప‌‌‌‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేత‌‌‌‌లు, ప్రముఖులు, అధికారులు క‌‌‌‌లిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో సోమవారం సెలవు రోజు అయినప్పటికీ సెక్రటేరియెట్‌‌‌‌లో జనాల సందడి కనిపించింది. ఉదయమే రేవంత్‌‌‌‌ను జూబ్లీహిల్స్​లోని ఆయన నివాసంలో మంత్రి సీతక్క కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ కు ఇందిరా గాంధీ ఫొటోను గిఫ్ట్ గా ఇచ్చారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా రేవంత్ రెడ్డిని కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. సీఎంకు విషెస్ చెప్పి మొక్కను బ‌‌‌‌హుక‌‌‌‌రించారు. అసెంబ్లీ స్పీక‌‌‌‌ర్ ప్రసాద్ కుమార్, మంత్రులు జూప‌‌‌‌ల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే య‌‌‌‌శ‌‌‌‌స్విని త‌‌‌‌దిత‌‌‌‌రులు రేవంత్ కు పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. సచివాలయంలో సీఎంను సీఎస్, డీజీపీ కలిసి విషెస్ చెప్పారు. రేవంత్‌‌‌‌కు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వచనాలను యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు అందించారు. సచివాలయం వద్ద రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు.