స్కిల్ వర్సిటీ కిందకు ఐటీఐ కాలేజీలు

స్కిల్ వర్సిటీ కిందకు ఐటీఐ కాలేజీలు
  • గైడ్ లైన్స్ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం 

హైదరాబాద్, వెలుగు : ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఐటీఐల్లో కోర్సులను ప్రారంభించాలన్నారు. ఆయా కోర్సుల‌కు అవ‌స‌ర‌మైన సిల‌బ‌స్ రూప‌క‌ల్పనకు ఓ క‌మిటీని నియ‌మించి, నిపుణులు, విద్యావేత్తల స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించాల‌న్నారు. 

శనివారం సెక్రటేరియెట్​లో కార్మిక, ఉపాధి కల్పన శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఐటీఐ కాలేజీలన్నింటిలోనూ ప్రిన్సిపాల్స్ ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులకు స‌మ‌గ్రమైన శిక్షణ అందేలా చూడాలని సూచించారు. పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో ఐటీఐ/ఏటీసీ (అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్) లేని శాస‌న‌స‌భ‌ నియోజకవర్గాలను గుర్తించి నివేదిక‌ ఇవ్వాలన్నారు.

హైద‌రాబాద్ తప్ప 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని చెప్పారు. స‌మావేశంలో సీఎస్ శాంతికుమారి, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజ‌య్ కుమార్‌, సీఎం స్పెషల్ సీఎస్ అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.