కాళేశ్వరంపై నిజాలన్నీ చెప్పాల్సిందే: సీఎం రేవంత్ ఆదేశం

కాళేశ్వరంపై నిజాలన్నీ చెప్పాల్సిందే: సీఎం రేవంత్ ఆదేశం
  • కాళేశ్వరంపై నిజాలన్నీ చెప్పాల్సిందే
  • విజిలెన్స్ అడిగిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశం
  • ప్రాజెక్టులోని బ్యారేజీలపై అధ్యయనానికి ఎక్స్ పర్ట్ కమిటీ ఏర్పాటు చేయండి
  • ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకెళ్లండి 
  • కృష్ణా నీళ్లు, ప్రాజెక్టులపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం 
  • సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని అధికారుల వివరణ 

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబం ధించిన నిజాలన్నీ చెప్పాల్సిందేనని ఇరిగేషన్ అధికా రులు, ఇంజనీర్లకు సీఎం రేవంత్​రెడ్డి అల్టిమేటం ఇ చ్చారు. విజిలెన్స్​అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, వివరాలు ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఏవైనా డాక్యుమెంట్లు ఇవ్వలేకపోతే, కారణా లను లిఖితపూర్వకంగా చెప్పాల్సిందేనన్నారు. శని వారం సెక్రటేరియెట్​లో ఇరిగేషన్ ​ప్రాజెక్టులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించడం సాధ్యమేనా?  అది ఉపయోగపడుతుందా? లేదా అనేది తేల్చాల్సింది నిపుణులేనని ఆయన పేర్కొన్నా రు. సీడబ్ల్యూసీ, నేషనల్​ డ్యామ్​సేఫ్టీ అథారిటీని సంప్ర దించి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతపై అధ్యయనం చేసేందుకు ఎక్స్​పర్ట్​కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

‘‘మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లకు రిపేర్లు చేయిస్తే సరిపోతుందా? లేదా? ఉన్నవి తొలగించి కొత్తవి కట్టాలా? కొన్నింటిని రిపేర్లు చేసి, కొన్నింటిని కొత్తగా నిర్మిస్తే సరిపోతుందా? అనేది ఈ కమిటీతో సమగ్ర అధ్యయనం చేయిస్తాం. ఎక్స్ పర్ట్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకువెళ్లండి. తాత్కాలికంగా హడావుడి చేసి, మరోసారి తప్పులకు తావివ్వొద్దు. సాంకేతికంగా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై నిర్ణయం తీసుకోవాలి” అని సూచించారు. రెండు మూడ్రోజుల్లోనే మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని, తనతో పాటు ఇరిగేషన్ మంత్రి కూడా అందులో పాల్గొంటారని చెప్పారు. 

కృష్ణా జలాల్లో వాటాపై అందరితో చర్చిద్దాం.. 

గత పాలకులు చేసిన తప్పుల వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని రేవంత్ అన్నారు. దాదాపు లక్షన్నర కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లకు రూ.10 వేల కోట్లు అవసరమైతే ఖర్చుకు ఆలోచించా ల్సింది లేదని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదన్నారు. ‘‘కృష్ణా జలాల్లో రాష్ట్ర నీటి వాటాలు, కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. 

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణా జలాలకు సంబంధించి జరిగిన మీటింగులు, కేఆర్ఎంబీ ఎజెం డాలు, చర్చల వివరాలు, మినిట్స్,  నిర్ణయాలు, ఒప్పందాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయండి. వీటన్నింటిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిద్దాం. ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణా జలాల్లో 811 టీఎంసీల వాటా ఉంటే అందులో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల పంపకాల కు ఎందుకు ఒప్పుకున్నారు. అప్పుడేం చర్చలు జరి గాయి? ఏమేం నిర్ణయాలు తీసుకున్నారు? వాటన్నింటిపై అఖిల పక్ష సమావేశంలో చర్చిద్దాం” అని చెప్పారు. ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత? అప్పుడు నిర్ణయాలు తీసుకున్నదెవరు? వాటన్నింటినీ ప్రజల ముందుంచాలని అన్నారు. 

 పెండింగ్ ప్రాజెక్టులపై ఆరా.. 

రాష్ట్రంలో పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులు, వాటిలో ఎం త మేరకు పనులు పూర్తయ్యాయనే వివరాలు అడిగి తెలు సుకున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం విస్తరణ ప నులకు భూసేకరణ అడ్డంకిగా మారిందని, రెవెన్యూ అధికారులతో కోఆర్డినేట్ ​చేసుకొని ఆ సమస్యను అధిగ మించాలని అధికారులకు రేవంత్ సూచించారు. నారాయణపేట–కొడంగల్​లిఫ్ట్​ఇరిగేషన్​పనులు పూర్తి చే యడానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్టుల వారీగా ఇచ్చిన ఆయకట్టు వివరాలు, మండలాల వారీగా ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 

అధికారులపై సీఎం ఆగ్రహం.. 

నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీ కి అప్పగించినట్లుగా వస్తున్న ఆరోపణలపై సమావేశంలో చర్చించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించలేదని, ఒప్పందాలపై సంతకాలు చేయలేదని అధికారులు సీఎంకు తెలిపారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 45 రోజులైంది. ఈ కొద్ది రోజుల్లోనే ఎప్పుడు కృష్ణా బోర్డుతో  సమావేశాలు జరిగాయి? ఎవరు హాజరయ్యారు? ఏమేం నిర్ణయాలు తీసుకున్నారు? మాకు తెలియకుండా అధికారులేమైనా నిర్ణయాలు తీసుకున్నారా? మీ విభాగం మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారు’’ అని ఇరిగేషన్ అధికారులపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 శాఖాపరంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమకు ఎన్ని నీళ్లు పోతున్నాయి? కృష్ణా జలాల్లో ఎంత వాటా ఉందో గతంలో ఉన్నోళ్లకు తెలియదా? వాటాకు మించి నీటిని తోడుకుపోతుంటే పదేండ్లు అధికారంలో ఉన్నోళ్లు ఏం చేశారో అఖిల పక్ష సమావేశంలో చర్చకు పెడుదామని సీఎం అన్నారు.