
- పరిహారం పంపిణీలోనూ జాప్యం జరగొద్దు.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
- అలసత్వం వహించే కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లపై చర్యలు తప్పవని హెచ్చరిక
- ట్రిపుల్ ఆర్ నార్త్, సౌత్‌ను ఒక్క ప్రాజెక్టుగానే చూసి అనుమతులు ఇవ్వాలి
- హైదరాబాద్ - అమరావతి - మచిలీపట్నం 12 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు పర్మిషన్ ఇవ్వాలి
- హైదరాబాద్ - మంచిర్యాల - నాగ్‌పూర్ కొత్త రహదారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలనే ఆమోదించాలి
- ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూసేకరణ, పరిహారం పంపిణీ ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలన్నారు. భూసేకరణలో మానవీయ కోణాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే, రహదారుల నిర్మాణంతో రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్లకు ఆయన సూచించారు.
ఎన్‌హెచ్‌ఏఐ, జాతీయ రహదారుల విభాగం, అటవీ శాఖ తదితర విభాగాల అధికారులతో సోమవారం సెక్రటేరియెట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారుల ప్రాజెక్టుల భూసేకరణ, పరిహారం పంపిణీలో జరుగుతున్న జాప్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, దీనిపై ఆరా తీశారు. అక్టోబర్ చివరి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తేల్చిచెప్పారు. ఈ విషయం లో అలసత్వం వహించే కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
అవసరమైతే అటవీ పెంపకానికి ప్రత్యామ్నాయ భూములు
మంచిర్యాల – -వరంగల్ – -ఖమ్మం- – విజయవాడ (ఎన్‌హెచ్-163జీ) సహా పలు రహదారుల పనులపై కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. కోర్టు కేసులు, నిధుల విడుదలలో జాప్యంపై కలెక్టర్లు వివరణ ఇచ్చారు. అలాగే, జాతీయ రహదారుల నిర్మాణంలో అటవీ, పర్యావరణ శాఖ అనుమతుల ఆలస్యంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు.
2002-–2022 మధ్య జరిగిన నిబంధనల ఉల్లంఘనల కారణంగా ప్రస్తుత ప్రాజెక్టులకు అనుమతులు నిరాకరిస్తున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన సీఎం.. పాత ఉల్లంఘనలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ భూమిని అటవీ పెంపకానికి ఇస్తామని, అవసరమైతే కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడుతానని చెప్పారు.
వన్యప్రాణులు లేని ప్రాంతాల్లోనూ వైల్డ్ లైఫ్ నిబంధనలు అమలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా.. తమ కార్యాలయ నిర్మాణానికి రెండు ఎకరాల భూమి కేటాయించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కోరగా, వారికి అవసరమైన భూమిని కేటాయించాలని ఆఫీసర్లను సీఎం ఆదేశించారు.
సమావేశంలో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ కె.రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి, కె.ఎస్.శ్రీనివాసరాజు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వినయ్ కుమార్ రజావత్, ఎన్‌హెచ్ఏఐ సభ్యుడు (ప్రాజెక్ట్స్) అనిల్ చౌదరి, మోర్త్ రీజినల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, ఎన్‌హెచ్ఏఐ రీజినల్ ఆఫీసర్ శివశంకర్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం తదితరులు పాల్గొన్నారు.
ట్రిపుల్ ఆర్ సందేహాలన్నీ ఒకేసారి పంపాలి
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నార్త్‌కు సంబంధించి, కేంద్రం లేవనెత్తుతున్న సందేహాలపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సందేహాలన్నీ ఒకేసారి పంపితే వాటిని నివృత్తి చేస్తామని చెప్పారు. ట్రిపుల్ ఆర్ నార్త్, సౌత్ ప్రాజెక్టులను వేర్వేరుగా కాకుండా, ఒకే ప్రాజెక్టుగా పరిగణించి.. రెండు భాగాల పనులను ఏకకాలంలో ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు సూచించారు.
ట్రిపుల్ ఆర్ సౌత్ అలైన్‌మెంట్‌కు వెంటనే ఆమోదముద్ర వేయాలన్నారు. దీనికి ఎన్హెచ్ఏఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్- అమరావతి - మచిలీపట్నం 12 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఈ రహదారి రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని.. ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని తెలిపారు.
హైదరాబాద్ - విజయవాడ మధ్య 70 కిలోమీటర్లు దగ్గరవుతుందన్నారు. ఈ మార్గంలో డ్రైపోర్ట్, లాజిస్టిక్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న ఈ హైవే నిర్మాణానికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్ - శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మార్గానికి తక్షణ అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు తెలిపారు.
ఇది శ్రీశైలం దేవస్థానం, టైగర్ ఫారెస్ట్‌కు వెళ్లే భక్తులకు ఎంతో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్- మన్నెగూడ రోడ్డులో మర్రి చెట్ల తొలగింపునకు సంబంధించి ఎన్జీటీలో ఉన్న కేసును పరిష్కరించాలని సీఎస్‌ను సీఎం రేవంత్ ఆదేశించారు. హైదరాబాద్ - మంచిర్యాల - నాగ్‌పూర్ కొత్త రహదారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలనే ఆమోదించాలన్నారు.