జయశంకర్, గద్దర్ను స్మరించుకున్న సీఎం

జయశంకర్, గద్దర్ను స్మరించుకున్న సీఎం

న్యూఢిల్లీ, వెలుగు: ప్రొఫెసర్​ జయశంకర్​ జయంతి, ప్రజాయుద్ధ నౌక గద్దర్​ వర్ధంతి సందర్భంగా బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో వారి చిత్రపటాలకు సీఎం రేవంత్​రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి సేవలను గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ప్రజలు ఏవిధంగా న‌‌ష్టపోయారో గ‌‌ణాంకాల‌‌తో ఎప్పటిక‌‌ప్పుడు వివ‌‌రిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఆరు ద‌‌శాబ్ధాలు స‌‌జీవంగా ఉంచిన ఘ‌‌న‌‌త ప్రొఫెస‌‌ర్ జ‌‌య‌‌శంక‌‌ర్ సార్​దేనని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.

 ప్రొఫెసర్​  జ‌‌య‌‌శంక‌‌ర్ సార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే శ్వాసగా, ధ్యాసగా, లక్ష్యంగా బతికారు. తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన గొప్ప పోరాట యోధుడు. ఆయనను తెలంగాణ స‌‌మాజం సదా గుర్తుంచుకుంటుంది” అని తెలిపారు. అలాగే,  ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుప‌‌ట్టుగా నిలిచిన వ్యక్తి గ‌‌ద్దర‌‌న్న అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘పేద కుటుంబంలో పుట్టి ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన గ‌‌ద్దర్‌‌ ఉన్నత కొలువుల వైపు దృష్టిసారించ‌‌కుండా ప్రతి ఒక్కరికి కూడు, గూడు, నీడ ల‌‌భించాలనే ల‌‌క్ష్యంతో జీవితాంతం త‌‌న పాట‌‌ల‌‌తో ప్రజ‌‌ల‌‌ను చైత‌‌న్యప‌‌ర్చారు. గ‌‌ద్దర్ చేసిన సాంస్కృతిక‌‌, సాహితీ సేవ‌‌లకు గుర్తింపుగా జూన్ 14న గద్దర్ పేరిట తెలంగాణ ఫిల్మ్ అవార్డులను సినీ కళాకారులకు, సినీ ప్రముఖులకు అందించాం. గద్దర్ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు ఆయన  ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది” అని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.