ఉదండాపూర్ నిర్వాసితుల పరిహారం పెంపునకు సీఎం సానుకూలం : ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

ఉదండాపూర్ నిర్వాసితుల పరిహారం పెంపునకు సీఎం సానుకూలం : ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

జడ్చర్లటౌన్, వెలుగు: ఉదండాపూర్  ప్రాజెక్ట్  నిర్వాసితులకు ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ పరిహారం పెంపునకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి చెప్పారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని జలసౌధలో శనివారం ఉదండాపూర్  ప్రాజెక్ట్  నిర్వాసితుల పరిహారం పెంపుపై నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే నిర్వాసితుల సమస్యలను మంత్రికి వివరించారు.

ఆర్అండ్ఆర్​ ప్యాకేజీని పెంచేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని, ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే వాటిని ఆమోదిస్తారని మంత్రి హామీ ఇచ్చారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.40 కోట్ల బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు. రిజర్వాయర్  నిర్మాణ పనులతో పాటు కెనాల్స్​ టెండర్  ప్రక్రియ పూర్తి చేసి పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కోడ్గల్, బైరంపల్లి, వాడియాలలో చెక్ డ్యాంల నిర్మాణాలను చేపట్టాలని కోరారు. నీటి పారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అరుణ్ కుమార్, వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.