వైఎస్లోని సంక్షేమాన్ని.. పీవీలోని సంస్కరణాభిలాషను.. ఒంటపట్టించుకున్న రేవంత్

వైఎస్లోని సంక్షేమాన్ని.. పీవీలోని సంస్కరణాభిలాషను.. ఒంటపట్టించుకున్న రేవంత్

అధికారం వస్తే ఏం చేయొచ్చో... రెండేళ్లలో చేసి చూపించింది కాంగ్రెస్  ప్రజాప్రభుత్వం. దేశానికి వెన్నెముకగా రైతును నిలిపిన దార్శనికులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వారసత్వాన్ని, విలువలను కొనసాగిస్తూ... తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఎలక్షన్లలో  ఓట్లకు ఎరగా గత ప్రభుత్వం తెచ్చుకున్న పథకాలను పునర్ నిర్వచించి, ఎన్నికల ఎజెండా కాదు అంతిమంగా ప్రజలకు మేలు చేయడమే తన ఎజెండా అని ప్రకటించింది కాంగ్రెస్​ ప్రభుత్వం. 

అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ఏకైక నేత సీఎం రేవంత్ రెడ్డి. ఇదొక్కటి చాలు ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యాలేంటో చెప్పడానికి,  సీఎంగా రేవంత్ రెడ్డి ఎలాంటి సంకల్పంతో పని చేస్తున్నాడో చెప్పడానికి.  నాటి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిలోని సంక్షేమాన్ని, దివంగత ప్రధాని, తెలంగాణ బిడ్డ  పీవీలోని సంస్కరణాభిలాషను ఒంటపట్టించుకున్నాడు రేవంత్ రెడ్డి.  అందుకే అభివృద్ది, సంక్షేమాన్ని జోడెడ్లలా పరుగులు పెట్టిస్తూనే  సమాజ హిత సంస్కరణలకు బీజం వేశాడు.

విశ్వనగరంగా హైదరాబాద్​

రోజురోజుకూ పెరుగుతోన్న హైదరాబాద్ మహానగరమే రేపటి తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణం. ఇందులో  మరో ఆలోచనే ఎవరికీ ఉండదు, అందుకే  రాష్ట్రావతరణ సమయంలో సీమాంధ్రనేతలు  హైదరాబాద్​పై అంత పట్టుపట్టింది. కానీ, కేవలం సోనియమ్మ సంకల్పమే పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును చట్టం చేసింది. హైదరాబాద్​తో  కూడిన  స్వరాష్ట్రాన్ని మనకు సాకారం చేసింది.  నేడు రేవంతన్న ప్రజా ప్రభుత్వం హైదరాబాద్​ను  విశ్వనగరంగా చేసి ప్రపంచ ముఖచిత్రంగా మార్చడానికి వజ్ర సంకల్పం తీసుకున్నారు.  

ఫోర్త్ సిటీ నిర్మాణం మొదలు 27 నగర పాలికలను మహానగరంలో కలిపి,  నగరం నడిబొడ్డున ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న కంటోన్మెంట్ బోర్డును విలీనం చేసి 660 చ.కి. నగరాన్ని 2500చ.కి.మీల మేర విస్తరించే మహా సంకల్పానికి పూనుకున్నాడు రేవంతన్న.  ఇందుకోసం కబ్జా కోరల్లో చిక్కుకున్న హైదరాబాద్ సుందర సరస్సుల్ని విడిపించడానికి ఎవరూ సాహసించని విధంగా హైడ్రాను తీసుకొచ్చాడు.  ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్మీని సైతం ఒప్పించాడు, కాలుష్య కారక పరిశ్రమల్ని సీటీ నుంచి దూరం చేస్తేనే 2 కోట్ల జనావాసాలున్న మహానగరం ఊపిరి పీల్చుకోగల్గుతుంది అందుకే హిల్ట్ పాలసీని తీసుకొచ్చాడు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థను బాగుచేయడానికి, వర్షాకాలం వస్తే మహా సముద్రంలా మారే కాలనీల రూపురేఖలు మార్చేందుకు స్వయంగా తిరిగి మాస్టర్ ప్లాన్ రూపొందించారు.

పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ

250 యూనిట్ల ఉచిత కరెంటు, కుటుంబానికి 26 కిలోల ఉచిత నాణ్యమైన సన్న బియ్యం, పేదోడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు పది లక్షల బీమాతో రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇలా ఇచ్చిన ప్రతిహామీని చిత్తశుద్ధితో అమలు చేయడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంది రేవంత్​రెడ్డి సారథ్యంలోని  ప్రజా ప్రభుత్వం.  ఏడాది కాలంలోనే 61వేల ఉద్యోగాలు, టెట్ పరీక్షల నిర్వహణ, చరిత్రలోనే తొలిసారిగా గ్రూప్1 పరీక్షలు నిర్వహణ, పోస్టింగులు ఇవ్వడమే కాకుండా విద్యారంగంలో సమూల మార్పుల్ని తీసుకొస్తోంది ప్రజా ప్రభుత్వం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, ఏటీసీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఇలా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత వైద్యవిద్య వరకూ ప్రతి తెలంగాణ బిడ్డకు అందిస్తోంది ప్రజా ప్రభుత్వం.

ధరణి పాపాలను కడిగేసి భూభారతి మొదలు, హైదరాబాద్ అవసరాలను తీర్చే హిల్ట్ పాలసీ వరకూ ప్రజలపై రూపాయి పన్ను భారం మోపకుండా.. పెట్టుబడులకు తెలంగాణను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తోంది.  రూ. లక్షల కోట్లను తెలంగాణకు రప్పిస్తూ... అద్వితీయ వెలుగులు దిశగా ప్రస్థానం సాగిస్తుంది రేవంత్​రెడ్డి సారథ్యంలోని మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం. ఇందుకు నభూతో నభవిష్యత్ రీతిలో జరగబోయే  విజయ వేడుక రైజింగ్ తెలంగాణ 2047 గ్లోబల్ సమిట్ ప్రత్యక్ష తార్కాణం. రెండేండ్ల ప్రజాప్రభుత్వం రాష్ట్రం పట్ల పూర్తి విజన్​తో ముందుకెళుతుందనేందుకు  జరగబోయే గ్లోబల్​ సమిట్​ చెపుతోంది. 

దార్శనిక పాలన 

గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన మూడు రూట్ల మెట్రోని విస్తరించడానికి ప్రభుత్వంగా పూనుకొని లాస్ట్ మైల్ కనెక్టివిటీతో ప్రపంచస్థాయి నగరంగా మారుస్తున్నారు. ఈ దార్శనిక పాలన కేవలం హైదరాబాద్ తోనే ఆగిపోలేదు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మరింత బాధ్యతగా గత పదేళ్ల కాలంలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పున:నిర్మాణం ప్రారంభించింది.  నీళ్లు,  నిధులు,  నియామకాల ఎజెండాగా సాగిన పోరాటం కేవలం ఒక్క ఇంటికే అన్నీ సమకూర్చి, ఆ దొర గడీల్లో అధికారం బందీగా మారితే... తన అమూల్యమైన వాగ్ధాటి,  అంతకుమించిన విశ్వాసాన్ని తెలంగాణ ప్రజల్లో కలిగించి, దాన్ని సామాన్యుల చెంతకు చేర్చింది ప్రజా ప్రభుత్వం. 

అది మొదలు ఎన్నో లక్షల కోట్ల రూపాయలను  సంక్షేమం కోసం ఖర్చు పెడుతూ తెలంగాణ బిడ్డల సౌభాగ్యానికి పాటుపడుతోంది. ఇంటికి దీపమైన ఇల్లాలికి మొబిలిటీ ఆక్సెస్ ఇస్తే ఆమె ఇంటినే కాదు ఊరును దాంతోపాటు రాష్ట్రాన్ని ప్రగతిపథాన నడిపిస్తుంది. ఈ సత్యం తెలిసింది కాబట్టే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఆమెకు ఎక్స్ ప్రెస్ బస్సును సైతం ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది.  తన పనులతో పాటు యావత్ తెలంగాణను అమూలాగ్రం దర్శించి తను ఉత్తేజితం చెందడమే కాదు తెలంగాణను తేజోవంతం చేస్తున్నది. 

పున్నా కైలాశ్​ నేత, డీసీసీ ప్రెసిడెంట్, నల్గొండ