పన్ను వసూళ్లలో టార్గెట్​ సాధించాలె: సీఎం రేవంత్ ఆదేశం

పన్ను వసూళ్లలో టార్గెట్​ సాధించాలె: సీఎం రేవంత్ ఆదేశం

హైద‌‌రాబాద్‌‌, వెలుగు: ప‌‌న్ను వ‌‌సూళ్లకు సంబంధించి అన్ని శాఖలూ వార్షిక లక్ష్యాలను అందుకోవాల్సిందేనని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో విధించిన జరిమానాలను వసూలు చేయాలని ఆదేశించారు. ఈమేరకు 2023-24 సంవ‌‌త్సరానికి సంబంధించి వాణిజ్య ప‌‌న్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేష‌‌న్లు, ర‌‌వాణా, గ‌‌నులు, భూగ‌‌ర్భ వ‌‌నరుల శాఖ ప‌‌న్ను వ‌‌సూళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. సోమవారం డాక్టర్ బీఆర్‌‌ అంబేద్కర్ స‌‌చివాల‌‌యంలో ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. 

వాణిజ్య ప‌‌న్నుల శాఖ‌‌లో పన్ను వసూళ్ల ల‌‌క్ష్యానికి, వాస్తవ రాబ‌‌డికి మ‌‌ధ్య వ్యత్యాసం ఎక్కువగా ఎందుకుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన జీఎస్టీ పరిహారం రాకపోవడం వల్లేనని అధికారులు జవాబిచ్చారు. కాగా, మద్యం సరఫరాకు, అమ్మకాలకు తేడా ఉంటోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, పొరుగు రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రాకుండా అడ్డుకోవాలన్నారు. మద్యం సరఫరా వాహనాలకు వే బిల్లులు కచ్చితంగా ఉండాలని, వాహనాలను జీపీఎస్ తో ట్రాక్​చేయాలని, బాటిల్ ట్రాకింగ్​ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.  

ఇసుక విక్రయాలకు సమగ్ర విధానం..

ఇసుక విక్రయాల‌‌కు సంబంధించి సమగ్ర విధానం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. వే బిల్లుల‌‌తో పాటు ఇసుక స‌‌ర‌‌ఫ‌‌రా వాహ‌‌నాల‌‌కు ట్రాకింగ్ ఉండాల‌‌ని, అక్రమ ర‌‌వాణాకు అవ‌‌కాశం ఇవ్వొద్దని సీఎం సూచించారు. రూల్స్ ఉల్లంఘించిన వారికి గతంలో విధించిన జరిమానాలను వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు.