
- హరీశ్ అసెంబ్లీలో అపోజిషన్ లీడర్
- బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా
- విలీనం తర్వాత కవితకు బెయిల్
- రుణమాఫీ కోసం రూ. 5 వేల కోట్లు రిజర్వ్
- మాఫీ కాని వాళ్లు కలెక్టరేట్లలో ఫిర్యాదు చేయొచ్చు
- చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.విలీనం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతారని అన్నారు. ఆయన కుమారుడు, ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెప్పారు. కేసీఆర్ మేనల్లుడు, సిద్దపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్ఎస్ కు నలుగురు ఎంపీలున్నారని, విలీనం తర్వాత వీళ్లంతా బీజేపీ ఎంపీలుగా మారిపోతారని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఆ తర్వాత బెయిల్ వస్తుందని సీఎం చెప్పారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఖండించినా అది జరగకమానదని అన్నారు. త్వరలోనే ఫాక్స్ కాన్ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ వస్తారని తెలిపారు. రైతు రుణమాఫీ కోసం రూ. 5 వేల కోట్లు రిజర్వులో ఉంచామని చెప్పారు. రుణమాఫీకాని వారు కలెక్టరేట్ కు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చని అన్నారు. ఒకే కుటుంబంలో వారికి రూ. 2 లక్షలకు పైగా రుణం ఉంటే వారిని ఒక యూనిట్ గా పరిగణించి రూ. 2 లక్షల వరకు మాఫీ చేస్తున్నట్టు సీఎం చెప్పారు. తన మార్కు ఉండాలనే పంద్రాగస్టు రోజున రుణమాఫీని ప్రకటించి అమలు చేశానని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని అన్నారు.