- ప్రభుత్వంతో కలిసి ఊర్లను అభివృద్ధి చేసెటోళ్లను సర్పంచ్‌లుగా గెలిపించుకోండి
- హాఫ్ పోసిండనో.. ఫుల్లు పోసిండనో ఓటేస్తే మునిగేది మనమే
- సర్పంచ్ మంచోడైతే ఊరు బాగుపడ్తది.. ముంచెటోడైతే ఆగమైతది
- 2009లో కేసీఆర్‌ను పాలమూరు బిడ్డలు ఎంపీగా గెలిపిస్తే ఏం చేసిండు?
- పదేండ్లు సీఎంగా ఉండి ఇక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలే.. వలస కష్టాలనూ తీర్చలే
- మేం కొడంగల్ లిఫ్టు మొదలుపెడ్తామంటే కుట్రలు పన్నిండు.. కేసులు వేయించిండు
- రూ.5 వేల కోట్లతో కొడంగల్ లిఫ్టును రెండేండ్లలో పూర్తి చేస్తామని ప్రకటన
- రెండేండ్ల ప్రజాపాలన ఉత్సవాలు ప్రారంభం
- ఈ నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమిట్
ఈ నెల 8, 9, తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రపంచంలోని బడా పారిశ్రామికవేత్తలను ఇక్కడికి రప్పిస్తున్నామని.. తెలంగాణ గురించి, మన నగరం ఎంత గొప్పదో, పల్లెలు ఎంత ప్రశాంత వాతావరణంలో ఉన్నాయో వారికి వివరిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ పరిశ్రమలు, సేవా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వారిని ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సంహ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, తుడి మేఘారెడ్డి, వీరవల్లి శంకర్, కూచకుళ్ల రాజేశ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు కె.ప్రశాంత్ రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, శివసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సీతా దయాకర్‌రెడ్డి, స్వర్ణా సుధాకర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, వెలుగు: పల్లెలను అభివృద్ధి చేసేవాళ్లనే సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని.. మందు పోసెటోళ్లను కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసేవాళ్లను గెలిపించుకుంటే గ్రామాలు బాగుపడ్తాయని.. అభివృద్ధికి అడ్డుపడెటోళ్లను, కాళ్లల్లో కట్టెలు పెట్టెటోళ్లను ఎన్నుకుంటే మునిగేది మనమేనని సూచించారు. ‘‘పంచాయతీ ఎన్నికలొచ్చినయ్. సర్పంచ్‌లుగా ఎవర్ని ఎన్నుకోవాల్నో ఆలోచన చేయండి. నల్లికుట్లోళ్లను ఎన్నుకుంటే మనల్ని కుట్టుకుంటా తిరుగుతరు.
అలాంటోళ్లతో గ్రామాలు అభివృద్ధి చెందుతయా?! ఊరికి బడి కావాలన్నా, గుడి కావాలన్నా, నీళ్లు కావాలన్నా, కరెంట్ కావాలన్నా.. ఇట్ల ఏ విషయం ఉన్నా ఎమ్మెల్యే దగ్గరికి, మంత్రి దగ్గరికి వెళ్లి మాట్లాడి పరిష్కరించే వ్యక్తి సర్పంచ్‌గా గెలిస్తే ఆ ఊరు బాగుపడ్తది. మందు పోసెటోళ్లను నమ్మి ఓటేస్తే మునిగేది మనమే. హాఫ్ పోసిండనో.. ఫుల్లు పోసిండనో ఓటేస్తే ఏం జరుగుతదో ఒక్కసారి ఆలోచన చేయండి” అని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. దాదాపు రూ.5 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రెండేండ్ల ప్రజాపాలన ఉత్సవాలను ప్రారంభించారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వంతో కలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకునేవాళ్లను ఎన్నుకోవాలని సూచించారు. ‘‘ఎవరి మాటలు నమ్మకండి. ఫుల్, హాఫ్‌కు ఓటేస్తే గోస తప్పదు. తాడు, బొంగరం లేనోడైతే అభివృద్ధి జరగదు. మనం ఎన్నుకునే సర్పంచ్ మంచోడైతే ఊరు బాగుపడ్తది.. ముంచెటోడైతే ఉన్న ఊరు ఆగమైతది” అని ఆయన తెలిపారు.
కొడంగల్ స్కీమ్ జీవోను పదేండ్లు తొక్కి పెట్టిండు
పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకునే కుట్ర జరుగుతున్నదని, పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ చివరి దశలోని నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా ఇక్కడి ప్రజల నోట్లో మట్టికొట్టారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఉమ్మడి ఏపీలోనే మక్తల్– కొడంగల్ పథకాన్ని మంజూరు చేస్తూ విడుదలైన జీవో 69ని కేసీఆర్ పదేండ్లు తొక్కిపెట్టి.. మన నోట్లో మట్టి కొట్టిండు. జీవో సాధన కోసం సమితిగా ఏర్పడి గ్రామగ్రామం తిరిగినం. పదేండ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన ఈ స్కీమ్‌ను మేం అధికారంలోకి రాగానే ప్రారంభించేందుకు ప్రయత్నిస్తే .. కోర్టులో కేసులు వేసి కుట్రలు చేశారు. అట్ల కూడా ఏడాదిన్నర పాటు ప్రాజెక్టును ఆపారు. పరిహారం పెంచాలని రైతులు కోరుతున్న విషయం నా దృష్టికి రాగానే వారితో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించిన. రైతులు ఎకరానికి రూ.19 లక్షలు అడిగితే రూ.20 లక్షల చొప్పున మంజూరు చేయించిన.
ఇప్పటికే 96 శాతం మంది రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. రూ.5 వేల కోట్లతో 1.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును చేపడుతాం. కొడంగల్ లిఫ్టును పూర్తి చేసుకోవడానికి మనకు ఇప్పుడు అవకాశం వచ్చింది” అని ఆయన తెలిపారు. ‘‘దండు కట్టండి.. గుంపు కట్టండి.. పనులు చేయించుకోండి. ఈ పనులను రెండున్నరేండ్లలో పూర్తవుతయ్. పనులు చేయించుకునేందుకు కాంట్రాక్టర్, అధికారుల వెంటపడండి. రాత్రింబవళ్లు పని చేయించుకోండి. ఈ ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు కావాలన్నా నేను ఇస్త. పాలమూరులో పాడి పంటలు పండాలి.. దేశానికి ఆదర్శంగా ఉండాలి.. ఇందుకు ఇక్కడి యువత నడుం బిగించాలి” అని పిలుపునిచ్చారు.
మోసం చేస్తే పాతాళానికి తొక్కే నేల పాలమూరు
‘‘పాలమూరు గడ్డ.. ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది, మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది.. ఈ విషయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడివాళ్లు నిరూపించారు. 2009లో ఈ ప్రాంతానికి వచ్చిన కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తే ఆయన్ను ఆశీర్వదించారు. ఎంపీగా గెలిపించారు. కానీ, ఆయన ఏం చేసిండు? స్వరాష్ట్రంలో పదేండ్లు సీఎంగా ఉన్నప్పటికీ ఇక్కడి పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. సంగంబండ ప్రాజెక్టుకు అడ్డుగా ఉన్న బండను తొలగించడానికి రూ.12 కోట్లు కావాలని అడిగినా ఇవ్వలేదు” అని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
ఈ ప్రాంత తాగు, సాగునీటి కష్టాలను తీర్చేందుకు కేసీఆర్ ఏనాడూ ప్రయత్నించలేదని, ఈ ప్రాంత వలస బతుకుల కష్టాలను తీర్చలేదని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తాము 2023లో అధికారాన్ని చేపట్టామని, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 12 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించి ఇచ్చారని తెలిపారు. పాలమూరు బిడ్డగా తెలంగాణ రాష్ట్రానికి రెండో సీఎంగా నాయకత్వం వహిస్తున్నానంటే.. అంతా ఇక్కడి ప్రజల ఆశీర్వాదమేనని ఆయన పేర్కొన్నారు.
ఆడబిడ్డలకు ఫ్రీబస్సు జర్నీ..కేటీఆర్‌కు మింగుడు పడలే
ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే కేటీఆర్‌కు మింగుడు పడలేదని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘కేటీఆర్ కారులో తిరగొచ్చుగాని.. మన ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తిరగొద్దా? ఫ్రీ బస్సు జర్నీని అడ్డుకోవాలని కేటీఆర్ ప్రయత్నాలు చేసిండు. కొందరు ఆటోవాలాలను తయారు చేసి పంచాయితీకి తోలిండు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ వల్ల ఆడబిడ్డలు రూపాయి రూపాయి పోగు చేసి పిల్లలను ఎక్కడ చదివిస్తరోననే భయంతో ఆ ఆటోవాలాలను కేటీఆర్ ఉసి గొలిపిండు.
కానీ.. తెలంగాణ ఆడబిడ్డల జోలికి వస్తే సలాక కాల్చి వాత పెడ్తరని చెప్పిన” అని ఆయన అన్నారు. ప్రజా పాలనలోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమవుతుందని తెలిపారు. సంక్షోభంలో ఇరుకున్న రాష్ట్రాన్ని రూపాయి రూపాయి కూడబెట్టి సరైన దిశగా నడిపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
పాలమూరు గడ్డ.. ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది, మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది.. ఈ విషయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడివాళ్లు నిరూపించారు. 2009లో ఈ ప్రాంతానికి వచ్చిన కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తే ఆయన్ను ఆశీర్వదించారు. ఎంపీగా గెలిపించారు. కానీ, ఆయన ఏం చేసిండు? స్వరాష్ట్రంలో పదేండ్లు సీఎంగా ఉన్నప్పటికీ ఇక్కడి పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. సంగంబండ ప్రాజెక్టుకు అడ్డుగా ఉన్న బండను తొలగించడానికి రూ.12 కోట్లు కావాలని అడిగినా ఇవ్వలేదు.
కేటీఆర్ కారులో తిరగొచ్చుగాని..
మన ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తిరగొద్దా? ఫ్రీ బస్సు జర్నీని అడ్డుకోవాలని కేటీఆర్ ప్రయత్నాలు చేసిండు. కొందరు ఆటోవాలాలను తయారు చేసి పంచాయితీకి తోలిండు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ వల్ల ఆడబిడ్డలు రూపాయి రూపాయి పోగు చేసి పిల్లలను ఎక్కడ చదివిస్తరోనన్న భయంతో ఆ ఆటోవాలాలను ఉసిగొలిపిండు. కానీ.. తెలంగాణ ఆడబిడ్డల జోలికి వస్తే సలాక కాల్చి వాత పెడ్తరు. సీఎం రేవంత్ రెడ్డి
పదేండ్లు పార్టీలు పక్కనపెట్టండి.. కలిసి పని చేద్దాం
పదేండ్లు రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘‘కుట్రలు చేసెటోళ్లు ఉంటరు, జోలి చెప్పేటోళ్లు ఉంటరు.. అందుకే పదేండ్లు పార్టీలను పక్కన పెట్టి కలిసి ఉందాం. మన పాలమూరును పసిడి పంటలతో అభివృద్ధి చేసుకుందాం. చదువులో దేశంలోనే ఈ జిల్లాను ముందుంచు దాం. ఇందుకు జిల్లా అంతా ఏకం కావాలి’' అని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎడ్యుకేషన్‌కు ప్రయారిటీ ఇస్తున్నామని తెలిపారు.
ఈ ప్రాంత పిల్లలు చదువుకోకపోవడం వల్లే వలస పోతున్నారని, వలస కూలీలుగా మారుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, మక్తల్‌లో కూడా ఈ స్కూల్‌కు శంకుస్థాపన చేశామన్నారు. పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అడిగిన వెంటనే మహబూబ్‌నగర్ ట్రిపుల్‌ఐటీని మంజూరు చేయించామని, అలాగే పాలమూరు యూనివర్సిటీకి లా, ఇంజనీరింగ్ కాలేజీలను మంజూరు చేసినట్లు తెలిపారు.
