జీవో 49ను నిలిపివేస్తూ ఉత్తర్వులు .. కన్జర్వేషన్ రిజర్వ్ విషయంలో సీఎం చొరవ : ఎమ్మెల్సీ దండే విఠల్ 

జీవో 49ను నిలిపివేస్తూ ఉత్తర్వులు .. కన్జర్వేషన్ రిజర్వ్ విషయంలో సీఎం చొరవ : ఎమ్మెల్సీ దండే విఠల్ 

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాను కన్జర్వేషన్ రిజర్వ్​గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 49ను నిలిపివేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంపై ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. జీవో నంబర్ 49 రద్దు చేయాలని సోమవారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులు సీతక్క, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, సోయం బాపురావు, ఆత్రం సక్కు, డీసీసీ ప్రెసిడెంట్ విశ్వప్రసాద్ రావుతో కలిసి ప్రజాభవన్​లో సీఎంను కలిశారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని సైతం కలిసి వినతిపత్రం అందజేశారు. జీవో 49 కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. దీంతో జీవో అమలు నిలిపివేస్తూ సీఎం రేవంత్​ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎంకు నేతలు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల మేలు కోసమే పనిచేస్తుందని అన్నారు. త్వరలోనే బీసీ రిజర్వేషన్ బిల్లు గవర్నర్ ఆమోదం పొందుతుందని ఎమ్మెల్సీ ఆశాభావం వ్యక్తం చేశారు.